rythu hitha program
-
అన్నపూర్ణగా తెలంగాణ
శంకర్పల్లి (రంగారెడ్డి): రానున్న రోజుల్లో తెలంగాణ అన్నపూర్ణగా అవతరించనుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. శంకర్పల్లి మండల పరిధిలోని మహాలింగపురంలో ఆదివారం రైతులకు బీమా బాండ్లను రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు రూ.17వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని తెలిపారు. 65 ఏళ్లు పాలించిన నేతలు చేయని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 4 ఏళ్లలో సాధించి చూపించామని అన్నారు. త్వరలో బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ రైతుల కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించలేదని, మన రాష్ట్రంలో మాత్రం రూ.12 వేల కోట్లు రైతు సంక్షేమం కోసం కేటాయించినట్లు వివరించారు. సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని విమర్శించారు. గతంలో రైతులు వ్యవసాయం చేస్తే ఆర్థికంగా చితికిపోవడమే తప్పా లాభం ఉండేది కాదని, నేడు రైతులు పండించిన పంటలను సర్కారు మద్దతు ధరకు మార్కెట్లో కొనుగోలు చేస్తోందని తెలిపారు. దీంతోపాటు పెట్టుబడికి అవసరమైన డబ్బులను ప్రభుత్వమే భరిస్తూ ఎకరాకు రూ.4వేల చొప్పున అందిస్తోందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ రూ. లక్ష 60 కోట్లు ఉండగా, తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర బడ్జెట్ రూ. లక్ష 74 వేల కోట్లకు చేరుకుందన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉందని స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్లో ప్రకటించారని తెలిపారు. గతంలో గుజరాత్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండేదని, ప్రస్తుతం ఎవరికీ అందనంత ఎత్తులో తెలంగాణ రాష్ట్రం వృద్ధి రేటు సాధించిందన్నారు. భూరికార్డుల ప్రక్షాళనతో ఎవరి భూమి ఎంత ఉందోననే వివరాలను సులభంగా తెలుసుకోవచ్చని, తద్వారా రైతులందరికీ మేలు కలిగిందన్నారు. రాబోయే రైతులు దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో సమస్యలు పరిష్కారయ్యే విధంగా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటికి పెద్దదిక్కయిన రైతు ప్రమాదవశాత్తు మృతిచెందితే కుటుంబానికి భరోసా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతుభీమా పథకాన్ని రూపొందించిందన్నారు. కార్యక్రమంలో రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా రైతుల మేలుకోసమేనన్నారు. రంగారెడ్డి జిల్లాలో లక్షా 23 వేల మందికి, చేవెళ్ల నియోజకర్గంలో 35,601మంది రైతులకు బీమా బాండ్లు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ రఘునందన్‌రావు, జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ లక్ష్మారెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు ప్రవీణ్‌కుమార్, వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీలు గోవిందమ్మగోపాల్‌రెడ్డి, రవీందర్‌గౌడ్, ఆశోక్‌కుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ గోపాల్, వెంకట్రాంరెడ్డి, తహసీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతుహితమే లక్ష్యం
నారాయణఖేడ్ రూరల్, న్యూస్‌లైన్: రానున్న రోజుల్లో సాగునీరు, విద్యుత్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున రైతులు రబీలో ఆరుతడి పంటలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ సూచించారు. నారాయణఖేడ్‌లోని సాయిబాబా ఫంక్షన్‌హాలులో మంగళవారం నియోజకవర్గ రైతులకు ‘రైతుహిత’ సదస్సు ద్వారా పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ సదస్సుకు హాజరైన జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ మాట్లాడుతూ, రైతులంతా వరిసాగుపై దృష్టి సారించకుండా, నీటి లభ్యత, విద్యుత్ సరఫరాను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలైన మొక్కజొన్న, జొన్న పంటలను అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. బోర్లు తవ్వించే రైతులు కూడా భూగర్భ జలాలను దృష్టిలో ఉంచుకుని బోర్లు వేసేందుకు ప్రయత్నించాలన్నారు. లేకపోతే బోర్లు తవ్వినా నీరుపడక తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కలెక్టర్ హెచ్చరించారు. రైతులు సాగులో అధునాతన పద్ధతులు పాటించేలా చూసేందుకే ‘రైతుహిత’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో వరి, మొక్కజొన్న, పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర అందేలా చూస్తామన్నారు. సాగులో రైతులకు కావాల్సిన సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించేందుకే ’రైతుహిత’ ముఖ్య ఉద్దేశమన్నారు. ఖేడ్ ప్రాంతంలో వలసల నివారణకు ఈజీఎస్‌లో పనులు కల్పిస్తున్నట్టు తెలిపారు. జలప్రభ పథకం ద్వారా 6,500 మంది ఎస్సీ, ఎస్టీ రైతులకు చెందిన 16వేల హెక్టార్ల భూమిని సాగులోకి తెచ్చేందుకు పనులు జరుగుతున్నాయన్నారు. రబీ సీజన్లో ఖేడ్ నియోజకవర్గ రైతులకు బ్యాంకర్ల ద్వారా రూ.20 కోట్ల వరకు పంట రుణాలను అందించామనీ, వీటిని సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు సాధించాలన్నారు. మార్కెట్ యార్డుకు కృషి జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ మాట్లాడుతూ, ఉపాధి హామీని వ్యవసాయానికి అనుబంధం చేయాలని పార్లమెంట్లో ప్రశ్నించానన్నారు. రైతుల కృషితోనే దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నాయన్నారు. నారాయణఖేడ్‌లో మార్కెట్ యార్డు, ఉల్లి, టమాటలకు కోల్డ్‌స్టోరేజీలకు కృషి చేస్తామన్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి మాట్లాడుతూ, ఖేడ్ నియోజకవర్గంలో పరిశ్రమలు లేవనీ, అందువల్లే అందరూ వ్యవసాయంపైనే ఆధారపడ్డారన్నారు. భూగర్భ జలాలు కూడా అంతంతమాత్రంగానే ఉండడంతో రైతులు అధికంగా వర్షాధార పంటలపై ఆధారపడి ఉన్నారన్నారు. అంతకుముందు వ్యవసాయ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో ప్రదర్శించిన స్టాల్స్‌లను కలెక్టర్ పరిశీలించారు. రైతులు, అధికారులతో మాట్లాడారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ సర్పంచ్ అప్పారావ్షెట్కార్, అగ్రికల్చర్ జేడీ ఉమామహేశ్వరమ్మ, ఆర్డీఓ ధర్మారావు, హార్టికల్చర్ ఏడీ శేఖర్, సీడీసీ చైర్మన్ నర్సింహారెడ్డి, ఏఎంసీ చైర్మన్ వీరారెడ్డి, ఏడీఏ ప్రసాద్, ఏఓ శ్రీనివాస్, ఆత్మ చైర్మన్ భాస్కర్, మాజీ జెడ్పీటీసీ సంజీవ్‌రెడ్డి, రషీద్, కాంగ్రెస్ నేతలు చంద్రశేఖర్‌రెడ్డి, శంకరయ్యస్వామి, సుధాకర్‌రెడ్డి, సంగారెడ్డి, భోజిరెడ్డి,మాణిక్‌రెడ్డి, తాహెర్, వినోద్‌పాటిల్, పండరిరెడ్డి, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.