అన్నపూర్ణగా తెలంగాణ | Rythu Bandhu Scheme Bands Distribution In Rangareddy | Sakshi
Sakshi News home page

అన్నపూర్ణగా తెలంగాణ

Published Mon, Aug 13 2018 12:14 PM | Last Updated on Mon, Aug 13 2018 12:14 PM

Rythu Bandhu Scheme Bands Distribution In Rangareddy - Sakshi

మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ

శంకర్‌పల్లి (రంగారెడ్డి): రానున్న రోజుల్లో తెలంగాణ అన్నపూర్ణగా అవతరించనుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ పేర్కొన్నారు. శంకర్‌పల్లి మండల పరిధిలోని మహాలింగపురంలో ఆదివారం రైతులకు బీమా బాండ్లను రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు రూ.17వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని తెలిపారు. 65 ఏళ్లు పాలించిన నేతలు చేయని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 4 ఏళ్లలో సాధించి చూపించామని అన్నారు. త్వరలో బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలోనూ  రైతుల కోసం ప్రత్యేకంగా బడ్జెట్‌ కేటాయించలేదని, మన రాష్ట్రంలో మాత్రం రూ.12 వేల కోట్లు రైతు సంక్షేమం కోసం కేటాయించినట్లు వివరించారు. సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని విమర్శించారు. గతంలో రైతులు వ్యవసాయం చేస్తే ఆర్థికంగా చితికిపోవడమే తప్పా లాభం ఉండేది కాదని, నేడు రైతులు పండించిన పంటలను సర్కారు మద్దతు ధరకు మార్కెట్‌లో కొనుగోలు చేస్తోందని తెలిపారు. దీంతోపాటు పెట్టుబడికి అవసరమైన డబ్బులను ప్రభుత్వమే భరిస్తూ ఎకరాకు రూ.4వేల చొప్పున అందిస్తోందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్‌ రూ. లక్ష 60 కోట్లు ఉండగా, తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర బడ్జెట్‌ రూ. లక్ష 74 వేల కోట్లకు చేరుకుందన్నారు.

దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉందని స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్‌లో ప్రకటించారని తెలిపారు. గతంలో గుజరాత్‌ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండేదని, ప్రస్తుతం ఎవరికీ అందనంత ఎత్తులో తెలంగాణ రాష్ట్రం వృద్ధి రేటు సాధించిందన్నారు. భూరికార్డుల ప్రక్షాళనతో ఎవరి భూమి ఎంత ఉందోననే వివరాలను సులభంగా తెలుసుకోవచ్చని, తద్వారా రైతులందరికీ మేలు కలిగిందన్నారు. రాబోయే రైతులు దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో సమస్యలు పరిష్కారయ్యే విధంగా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటికి పెద్దదిక్కయిన రైతు ప్రమాదవశాత్తు మృతిచెందితే కుటుంబానికి భరోసా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతుభీమా పథకాన్ని రూపొందించిందన్నారు.

కార్యక్రమంలో రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా రైతుల మేలుకోసమేనన్నారు. రంగారెడ్డి జిల్లాలో లక్షా 23 వేల మందికి, చేవెళ్ల నియోజకర్గంలో 35,601మంది రైతులకు బీమా బాండ్లు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌ రఘునందన్‌రావు, జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్‌ లక్ష్మారెడ్డి, గుడిమల్కాపూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్, వైస్‌ చైర్మన్‌లు ప్రవీణ్‌కుమార్, వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీలు గోవిందమ్మగోపాల్‌రెడ్డి, రవీందర్‌గౌడ్, ఆశోక్‌కుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్‌ గోపాల్, వెంకట్‌రాంరెడ్డి, తహసీల్దార్‌ శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

 రైతులకు బాండ్లు పంపిణీ  చేస్తున్న మంత్రులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement