Irrigation water problems
-
‘కరువు’ సాగు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి. కాలువల ద్వారా సాగునీటి సరఫరా అందడం లేదు. బోర్లు, బావుల్లో నీళ్లు అడుగంటిపోయాయి. దీనితో చాలాచోట్ల సాగునీటికి కొరత ఏర్పడింది. దీనితో ముఖ్యంగా వరి పంట దెబ్బతింటోంది. పొట్టదశకు వచ్చిన వరి ఎండిపోతుంటే రైతులు ఆందోళన పడుతున్నారు. ఎలాగోలా పంటను కాపాడుకోవడానికి ట్యాంకర్లతో నీటిని తెచ్చి పొలాల్లో పోస్తున్నారు. ఇలా చేయలేనివారు కన్నీటితో పంటలను అలాగే వదిలేస్తున్నారు. పశువుల మేతకు వినియోగిస్తున్నారు. కొందరు రైతులు ఎండిన పంటలకు ఆవేదనతో నిప్పు పెడుతున్నారు. మూడో వంతు పంటలకు దెబ్బ వర్షాభావంతో కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని రిజర్వాయర్లు నిండలేదు. దీనితో యాసంగి సీజన్లో ప్రాజెక్టుల నుంచి సాగుకు నీటిని విడుదల చేయలేదు. దీనికితోడు భూగర్భజలాలు పడిపోవడం మరింత కష్టం తెచ్చిపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల ఎకరాల్లో వరి పంట ఎండిపోయిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మిగతా పంటలనూ కలుపుకొంటే యాసంగిలో సాగుచేసిన పంటల్లో దాదాపు 30 శాతం మేర ఎండిపోయాయని పేర్కొంటున్నారు. దీనితో గ్రామాల్లో రైతులతోపాటు కూలీలకు కూడా పనులు లేకుండా పోయాయి. ఉపాధి హామీ పనులే జీవనాధారంగా మారాయి. ఇది కరువు పరిస్థితేనని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం దీనిని కరువుగా భావించడం లేదని పేర్కొంటున్నాయి. అడుగంటిన భూగర్భ జలాలు.. గత ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో భూగర్భ జలాలు సగటున 7.34 మీటర్ల లోతులో ఉండగా.. ఈసారి ఫిబ్రవరి నాటికి 8.70 మీటర్ల లోతుకు పడిపోయాయి. కామారెడ్డి జిల్లాలో 10.64 మీటర్ల లోతు నుంచి.. ఈసారి 12.92 మీటర్ల లోతుకు తగ్గిపోయాయి. ఖమ్మం జిల్లాలో 5.11 మీటర్ల నుంచి 6.22 మీటర్ల లోతుకు.. మేడ్చల్ జిల్లాలో 8.97 మీటర్ల నుంచి 11.45 మీటర్ల లోతుకు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో 6.57 మీటర్ల నుంచి 9.52 మీటర్ల లోతుకు పడిపోయాయి. మహబూబ్‌నగర్, నల్లగొండ, వికారాబాద్ జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలో 6.93 మీటర్ల నుంచి ఏకంగా 10.19 మీటర్ల లోతుకు.. నల్లగొండ జిల్లాలో 6.15 మీటర్ల నుంచి 10.86 మీటర్ల లోతుకు.. వికారాబాద్ జిల్లాలో 13.07 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. తగ్గిన పంటల సాగు విస్తీర్ణం సాగు నీటి వసతులు తగ్గడంతో గతేడాదితో పోలిస్తే ఈసారి యాసంగి సీజన్లో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. గత యాసంగిలో 72.58 లక్షల ఎకరాల్లో పంటలు వేయగా.. ఈసారి 66.30 లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి. సుమారు 6.28 లక్షల ఎకరాలు తగ్గినట్లు వ్యవసాయశాఖ తేలి్చ, ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేసింది. గత యాసంగిలో 56.44 లక్షల ఎకరాల్లో వరి సాగైతే.. ఈసారి 50.69 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అంటే 5.75 లక్షల ఎకరాల సాగు తగ్గింది. పప్పుధాన్యాల సాగు గత యాసంగిలో 4.33 లక్షల ఎకరాలు అయితే.. ఇప్పుడు 3.18 లక్షల ఎకరాలకు తగ్గింది. ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏది? ఒకవైపు పంటల సాగు విస్తీర్ణం తగ్గడం, మరోవైపు వేసిన పంటలు ఎండిపోతుండటం ఆందోళనకరంగా మారింది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా వ్యవసాయశాఖ స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంటలు ఎండిపోతుంటే ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేయడంలో వ్యవసాయ శాఖ విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. కనీసం తమకు భరోసా కల్పించే ప్రయత్నాలైనా చేయడం లేదని రైతులు మండిపడుతున్నారు. పంట నష్టంపై సర్వే చేయడంలోనూ నిర్లక్ష్యం వహిస్తోందని.. సర్వే చేసి కరువు తీవ్రతను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తే.. పరిహారమో, సాయమో అందే పరిస్థితి ఉండేదని వాపోతున్నారు. మూడు జిల్లాల్లో ‘సాగు’ గోస! ► ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో యాసంగి కింద ప్రధానంగా వరి, మొక్కజొన్న, జొన్న, వేరుశనగ, ఇతర పంటలు సాగు చేశారు. మొత్తం 7,25,345 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో వరి 4,71,047 ఎకరాల్లో సాగైనట్లు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. కానీ సాగునీరు అందక, బోర్లు వట్టిపోవడంతో ఇప్పటివరకు సుమారు 88,752 ఎకరాల్లో వరి, 2,605 ఎకరాల్లో వేరుశనగ, మొక్కజొన్న పంటలు ఎండిపోయినట్టు ప్రాథమిక అంచనా. ► ఖమ్మం జిల్లాలో గత నాలుగేళ్లుగా యాసంగిలో మూడు లక్షల ఎకరాలకుపైగా పంటలు సాగవుతున్నాయి. నాగార్జునసాగర్ జలాలు అందుబాటులో ఉండటంతోపాటు బోర్లు, బావులు, చెరువుల కింద సాగు కొనసాగింది. కానీ ఈసారి కృష్ణా పరీవాహకంలో వర్షాభావంతో సాగర్ నిండలేదు. పంటల సాగుకు జలాలు విడుదల కాలేదు. దీనితో వరి, ఇతర పంటల సాగు తగ్గింది. చాలా మంది చెరువులు, బోర్లపై ఆధారపడి పంటలు వేశారు. దీంతో ఈ ఏడాది సాగు 1,47,389 ఎకరాలకే పరిమితమైంది. ఇందులో వరి 80,025 ఎకరాల్లో, మొక్కజొన్న 57,342 ఎకరాల్లో వేశారు. సాగైన చోట కూడా పంటలు ఎండిపోతున్నాయి. ► ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని మండలాల్లో పంటలు ఎండిపోతున్నాయి. నాగార్జునసాగర్, ఏఎమ్మార్పీ కాల్వల కింద ఏడాది నుంచి సాగునీరు అందలేదు. భూగర్భ జలాలు అడుగంటడంతో వందల సంఖ్యలో బోర్లలో నీరు రావడం లేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు లక్ష ఎకరాల్లో వరి ఎండిపోయినట్టు అంచనా. పంటలను కాపాడుకోవడానికి రైతులు నానా యాతనా పడుతున్నా ప్రయోజనం ఉండటం లేదు. కొన్ని గ్రామాల్లో చేసేదేమీ లేక పొలాలను పశువుల మేతకు వదిలేస్తున్నారు. పంట పశువుల మేతకు వదలాల్సి వచ్చింది నాకు ఊరు చెరువు వెనకాల రెండెకరాల పొలం ఉంది. యాసంగిలో వరిసాగు చేసేందుకు చెరువు నుంచి నీరు వదలడం లేదు. దీనితో జనవరిలో పొలంలో బోరు వేయించాను. నీరు బాగానే పడటంతో నా రెండెకరాలకు తోడు మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశా. కానీ నెలన్నర రోజుల్లో బోరు ఎండిపోయింది. పంటను దక్కించుకునేందుకు 400 అడుగుల లోతుతో మరో బోరు వేయించా. అందులోనూ నీరు అడుగంటింది. దీనితో మరో రెండు బోర్లు వేయించినా ఫలితం లేకపోయింది. పొలం ఎండిపోవడంతో పశువుల మేతకు వదిలిపెట్టా. నాలుగు బోర్లు, పంట పెట్టుబడికి ఏడు లక్షలదాకా అప్పులు అయ్యాయి. ప్రభుత్వమే ఆదుకోవాలి. – చిన్నయ్య, రైతు, గాధిర్యాల్ గ్రామం, మహమ్మదాబాద్ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వం ఆదుకోవాలి నందిగామ బ్రాంచి కెనాల్ కింద రెండెకరాల వరి వేశా. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో సాగునీరు అందక ఎండిపోయింది. మునుపెన్నడూ లేనంతగా నష్టపోయాను. ప్రభుత్వం ఆదుకోవాలి. – మల్లెబోయిన సైదులు, రైతు, భైరవనిపల్లి గ్రామం, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా నాలుగెకరాల పంటంతా ఎండి పోయింది నాకున్న నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశాను. సుమారు రూ.లక్ష వరకు పెట్టుబడి అయింది. ఉన్న ఒక్క బోరులో నీళ్లు అడుగంటాయి. నీళ్లు సరిపోక పంటంతా ఎండిపోయింది. ఎస్సారెస్పీ నీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేక పంటను వదలివేసిన. – ధరావతు సోమాని, రైతు, పాశ్చ్యానాయక్ తండ, చివ్వెంల మండలం, సూర్యాపేట జిల్లా రెండు బోర్లూ అడుగంటాయి రెండున్నర ఎకరాల భూమిలో వరి వేశాను. ఉన్న రెండు బోర్లలో నీళ్లు అడుగంటాయి. 15 రోజులైతే పంట చేతికి వస్తుందనుకున్న సమయంలో పొలం ఎండిపోయింది. పంటకు పెట్టిన రూ.50 వేలు పెట్టుబడి నష్టపోయాను. – దొంతినేని జగన్రావు, వెంకటాద్రిపాలెం, తిప్పర్తి మండలం, నల్లగొండ జిల్లా -
సాగునీటి సమస్య పరిష్కారం.. మాట నిలబెట్టుకున్న మంత్రి కాకాణి
సాక్షి, నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలంలోని రామదాసుకండ్రిగ, ఇడిమేపల్లి, గురివిందపూడి గ్రామ పంచాయతీల రైతులు వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. సుమారు వంద సంవత్సరాలుగా ఇక్కడి సాగునీటి సమస్యకు పరిష్కారం లభించలేదు. సమీపంలో కనుపూరు కాలువ ఉపకాలువ అయిన గురివిందపూడి బ్రాంచ్ కెనాల్ ఉంది. ఇందులో సాగునీరున్నా ఆయకట్టు స్థిరీకరణ సాధ్యపడలేదు. ఎట్టకేలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి రైతుల నిరీక్షణకు తెరదించారు. ఆయన తీసుకున్న చర్యలతో సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. కనుపూరు కాలువ నుంచి అందుబాటులోని చెరువులకు సాగునీరు సరఫరా సాధ్యమైంది. దీంతో అధికారికంగా మూడువేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. అనధికారికంగా మరో రెండువేల ఎకరాలకు నీరందుతుంది. ఈ నేపథ్యంలో ఆయా పంచాయతీల రైతులు ఆనందం వ్యక్తం చేశారు. పట్టించుకోని టీడీపీ సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అనేక పర్యాయాలు పాలకుల దృష్టికి ఆ మూడు పంచాయతీల రైతులు తీసుకెళ్లారు. చెరువులున్నాయి, జలాశయాల నుంచి నీరు వచ్చే మార్గాలను పునరిద్ధరించాలని ఆభ్యర్థించారు. 22 సంవత్సరాలు పాలించిన టీడీపీ నేతలకు అక్కడి రైతుల విన్నపాలు చెవిక్కెలేదు. వర్షం లేకపోతే భూగర్భ జలాలు అడుగంటిపోయి, తాగునీటికి సైతం ఇబ్బందులు పడేవారు. టీడీపీ హయాంలో తాగునీటి ఇక్కట్లను ప్రజలు చవిచూశారు. ఇలాంటి పరిస్థితుల్లో 2019 ఎన్నికలు సమీపించాయి. మూకుమ్మడిగా తాగు, సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ముక్తకంఠంతో కోరారు. హామీని నిలబెట్టుకున్న మంత్రి 2019 ఎన్నికలకు ముందు వాస్తవ పరిస్థితిని అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి దృష్టికి ఆయా పంచాయతీల ప్రజలు తీసుకెళ్లారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే సొంత నిధులు వెచ్చించి కాలువలను పునరిద్ధరిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో వైఎస్సార్సీపీ అధికార పగ్గాలు అందుకుంది. మంత్రి కాకాణి రూ.40 లక్షల సొంత నిధులు వెచ్చించి వెంకటాచలంలోని కాకెద్దులగుంటచెరువు నుంచి రామదాసుకండ్రిగ, గురివిండపూడి, ఇడిమేపల్లి చెరువులకు సాగునీరు వెళ్లేలా కాలువల పునరుద్ధరణ పనులు చేయించారు. సుమారు 11 కిలోమీటర్లు పొడవున్న కాలువ పనులను 16 రోజులపాటు రేయింబవళ్లు 12 మెషీన్లతో చేశారు. నేడు కాలువల్లో నీళ్లు రావడంతో రైతుల ఆనందం హద్దులు దాటింది. అక్కడి నుంచి చెరువులకు నీరు విడుదల చేశారు. రామదాసుకండ్రిగ చెరువు పరిశీలనకు వెళ్లిన మంత్రి గోవర్ధన్‌రెడ్డికి రైతాంగం బ్రహ్మరథం పట్టారు. గుర్రపు బండిపై తీసుకెళ్లి తమ సంతోషాన్ని బాహాటంగా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణిని ఘనంగా సన్మానించారు. జీవింతాం గుర్తించుకుంటాం రామదాసుకండ్రిగ రైతుల ఎన్నో ఏళ్ల నాటి కలను మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సాకారం చేశారు. ఎంతోమంది మా గ్రామానికి వచ్చి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. కానీ అందరిలా కాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చిన మంత్రిని ఎప్పటికీ మర్చిపోలేం. జీవితాంతం గుర్తించుకుంటాం. – షేక్ షాజహాన్, మాజీ సర్పంచ్, రామదాసుకండ్రిగ బిడ్డల భవిష్యత్ బాగుంటుంది చెరువు ఆయుకట్టు భూమి ఉన్నా.. నీరు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఏళ్ల తరబడి భూములు బీడుగా మారాయి. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చొరవతో మా బిడ్డల భవిష్యత్ బాగుంటుంది. సాగునీటి కాలువను తవ్వించి, చెరువులకు నీటిని విడుదల చేయడం సంతోషాన్ని ఇచ్చింది. ఈ ఏడాది ఎలాంటి కష్టాలు లేకుండా పంటలు పండించుకుంటాం. – వెడిచర్ల సుబ్రహ్మణ్యం, రైతు శాశ్వత పరిష్కారం లభించింది చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి సంవత్సరం సాగునీటి సమస్యలతో పంటలు పండేవి కావు. మూడేళ్ల నుంచి గోవర్ధన్‌రెడ్డి ప్రత్యేకశ్రద్ధతో కొంతమేరకు పంటలు పండించుకున్నాం. ఇప్పుడు సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు. చెరువులకు నీరు విడుదల చేయడంతో ఇక మాకు నీటి కష్టాలుండవు. సాగునీటి సమస్యను పరిష్కరించిన మంత్రికి జీవితాంతం రుణపడి ఉంటాం. – వాకా సుబ్బారావు, రైతు -
సీమ కరువుకు ‘రాయలసీమ’తో చెక్
సాక్షి, అమరావతి: ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ 854 అడుగుల కంటే ఎక్కువ ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా సామర్థ్యం మేరకు నీటిని రాయలసీమకు తరలించవచ్చు. అంతకంటే నీటిమట్టం తగ్గితే పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించడానికి వీలుండదు. దీనివల్ల రాయలసీమలో కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు.. తాగు, సాగునీటి సమస్యలను అధిగమించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం కనీస స్థాయికి అంటే 854 అడుగులకంటే దిగువకు చేరుకున్నా.. రాయలసీమలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉత్పన్నమైన సందర్భాల్లో తాగు, సాగునీటికి ఇబ్బందులు లేకుండా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శ్రీశైలంలో 797 అడుగుల స్థాయి నుంచి రోజుకు మూడు టీఎంసీల చొప్పున బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్(బీసీఆర్)లోకి ఎత్తిపోసి.. అక్కడినుంచి తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, కేసీ కెనాల్ ద్వారా సాగు, తాగునీటి కష్టాలను అధిగమించే పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఈ ఎత్తిపోతలకు రాయలసీమ ఎత్తిపోతలుగా నామకరణం చేసింది. దీనికి డీపీఆర్ తయారుచేయాలని జలవనరులశాఖను ప్రభుత్వం ఆదేశించింది. సీమను సుభిక్షం చేసేలా.. కృష్ణా నదిలో నీటి లభ్యత తగ్గిపోతోంది. వరదను ఒడిసిపట్టి.. శ్రీశైలంపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపే స్థాయిలో కాలువల సామర్థ్యాన్ని పెంచే పనులను గత సర్కారు చేపట్టలేదు. దీనివల్ల ఈ నీటి సంవత్సరంలో శ్రీశైలం జలాశయానికి 1,782 టీఎంసీల వరద వచ్చినా ఒడిసి పట్టలేకపోయాం. ప్రకాశం బ్యారేజీ నుంచి 801 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. ఈ నేపథ్యంలో కృష్ణా నదికి వరదొచ్చే 40 రోజుల్లోనే సీమ ప్రాజెక్టులను నింపడానికి రూ.33,869 కోట్లతో రాయలసీమ కరువు నివారణ ప్రణాళికను అమలు చేసేందుకు సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఆ మేరకు శ్రీశైలంలో 797 అడుగుల స్థాయి నుంచి రోజుకు 3 టీఎంసీలను తరలించేలా ముచ్చుమర్రి నుంచి ఎత్తిపోసి.. 42 కిలోమీటర్ల పొడవున తవ్వే గ్రావిటీ కెనాల్ ద్వారా బీసీఆర్‌లోకి నీటిని తరలిస్తారు. అక్కడినుంచి తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్‌కు సరఫరా చేస్తారు. కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు తాగు, సాగునీటిని ఈ ఎత్తిపోతల ద్వారా అందిస్తారు. దీనికి రూ.3,890 కోట్లు వ్యయమవుతుందని ప్రాథమిక అంచనా. ఆయకట్టుకు భరోసా.. ప్రస్తుతం రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో తెలుగుగంగ కింద 5.45 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు. ఎస్సార్బీసీ కింద వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో 1.90 లక్షల ఎకరాలు, కేసీ కెనాల్ కింద 2.65 లక్షల ఎకరాలు వెరసి ఈ మూడు ప్రాజెక్టుల కింద 10 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు. గాలేరు–నగరి కింద మరో 2.60 లక్షల ఎకరాలకు నీళ్లందించాల్సి ఉంది. రాయలసీమలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు తాగునీళ్ల కోసం కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో శ్రీశైలం నుంచి కనీస నీటిమట్టానికి దిగువనున్న జలాలను తరలించి.. సాగు, తాగునీటి ఇబ్బందులను అధిగమించడానికి వీలవుతుంది. -
అన్నదాతల భగీరథ యత్నం
సాక్షి, చీరాలటౌన్ (ప్రకాశం): ఆరుగాలం కష్టించి పండించిన పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. చేతికి అందివచ్చే పంటలకు కావాల్సిన ఆఖరి తడి కోసం తంటాలు పడుతున్నారు. మినుము పంటలు సాగుచేసిన రైతులు తమ పంటలు కాపాడుకోవడానికి డీజిల్ ఇంజన్లను వినియోగిస్తున్నారు. వివరాల్లోకెళితే.. మండలంలోని గవినివారిపాలెం, పిట్టువారిపాలెం గ్రామాల్లోని రైతులు మినుము పంటలను 75 ఎకరాల్లో సాగు చేశారు. మరో నెల రోజుల సమయంలో పంట చేతికివచ్చే సమయంలో మినుము పంటకు కావాల్సిన నీటిని సిమెంట్ కాలువ నుంచి డీజిల్ ఇంజన్లు ద్వారా పైపులతో సరఫరా చేసుకుంటున్నారు. వ్యవసాయ రంగంపై ఆధారపడిన రైతులకు కావాల్సిన నీటిని అందించడంతో అధికారులు, ప్రభుత్వం విఫలం కావడంతో డీజిల్ ఇంజన్లతో ఎకరానికి రూ.3వేలు ఖర్చు చేసి పంటలకు నీరు అందిస్తున్నామన్నారు. పంట చేతికందే సమయంలో కూడా నీటి కోసం తాము కష్టాలను అనుభవిస్తున్నామని రైతులు వాపోతున్నారు. సిమెంట్ కాలువల నుంచి డీజిల్ ఇంజన్లుతో నీటిని పైపుల ద్వారా పంట భూములకు తరలిస్తున్నారు. ప్రతిఏటా పంటల సాగుచేసే సమయంలో తాము సాగునీటి కోసం భగీరథ యత్నాలు చేస్తున్నామని రైతులు చెబుతున్నారు. -
ఈ ముఖ్యమంత్రికి రైతు సమస్యలేం తెలుస్తాయి
త్రిపురాంతకం: వ్యవసాయం దండగ అన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి రైతుల కష్టాలు ఏం తెలుస్తాయని యర్రగొండపాలెం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ఎద్దేవా చేశారు. త్రిపురాంతకంలో శనివారం వైఎస్సార్ సీపీ రైతు విభాగం ఆధ్వర్యంలో రైతులు సాగర్ నీటి కోసం ఎన్ఎస్పీ కార్యాలయం ముట్టడి, నేషనల్ హైవేపై ప్రదర్శన, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి సురేష్ మాట్లాడుతూ ఈరాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రైతులకు సాగర్ జలాలు అందక నాలుగేళ్లయిందన్నారు. ఈఏడాది సాగునీరిస్తున్నట్లు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి స్వయంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు పదహారు సార్లు వచ్చారని..కనీసం రైతులకు సాగర్ జలాలను సాగుకు అందించలేకపోవడం దారుణమన్నారు. రైతులకు రుణమాఫీ చేయలేదని మభ్యపెడుతున్నారని విమర్శించారు. సాగర్ డ్యాంలో నీరున్నా కుడి కాలువ దిగువన నీరందించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ వచ్చి అధికారుల సమీక్షలు నిర్వహించారు కానీ నీరందలేదన్నారు. రోజుకో విధానం అమలు చేస్తున్నారని..గతంలో నీరు నిరంతరంగా ఇచ్చేవారని చెప్పారు. ఇప్పుడు తొమ్మిది రోజులు ఇచ్చి, ఆరు రోజులు ఆపుతామన్నారని..అది కూడా అమలు జరగడం లేదన్నారు. ఇక నుంచి ఇలా నీరిస్తే పంట పూర్తిగా ఎండిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా ప్రధాన కాలువకు మూడువేల క్యూసెక్కుల నీరు అందించాలని డిమాండ్ చేశారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నీటిని నిరాటంకంగా అందించారని గుర్తు చేశారు. వరుణుడు కరుణించి వర్షంపడి శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నిండుకుండలా ఉంటే, ఆ నీటిని రైతులకు అందించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ప్రకటనతో రైతులు ఆశించి పంటలు పండించవచ్చనుకుంటే వారికి నీరివ్వక నిలువునా మోసం చేశారని విమర్శించారు. పంటలు వేసేవారికి నీరెప్పుడివ్వాలి, ఎప్పుడు ఎరువులు కావాలి, ఎప్పుడు గిట్టుబాటు ధర కావాలో రైతు బిడ్డకు తెలుస్తుంది కానీ మాటలు చెప్పి కాలయాపన చేసే ఈ ముఖ్యమంత్రికి రైతుల కష్టమేమి తెలుస్తుందని ప్రశ్నించారు. రైతన్నల కష్టాలు తీర్చేందుకు జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని సురేష్ పిలుపునిచ్చారు. సాగునీటి పోరుకు స్వచ్ఛందంగా తరలివచ్చిన రైతులు: సాగర్ సాగునీటి కష్టాలు తీర్చాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఇచ్చిన పిలుపు మేరకు రైతుల నుంచి విశేష స్పందన లభించింది. రైతులను సాగునీటి పోరాటంలో పాల్గొనకుండా అధికార యంత్రాంగం, పోలీస్‌శాఖ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినా స్వచ్ఛందంగా రైతులు తరలివచ్చారు. త్రిపురాంతకానికి ఎమ్మెల్యే సురేష్ తెల్లవారే సరికి చేరుకున్నారు. ఆయనను గృహనిర్బంధం చేయాలని రాస్తారోకో, కార్యాలయం ముట్టడి కార్యక్రమాలను నిరోధించే ప్రయత్నాలు చేశారు. అయినా ప్రకటించిన విధంగా ఎమ్మెల్యే సురేష్ ఆధ్వర్యంలో అనంతపురం–అమరావతి హైవేపై రైతులు ప్రదర్శన చేశారు. సాగర్ కార్యాలయాన్ని ముట్టడించారు. అక్కడ రైతుల సాగునీటి సమస్యపై మండిపడ్డారు. సాగర్ కాలువల ఎస్ఈ కె.రవి మాట్లాడుతూ సాగర్ ప్రధాన కాలువ ద్వారా తక్కువ నీరు వస్తున్నందున నీటి సరఫరా పెరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎస్ఈ వెంట ఈఈ శ్రీనివాసరెడ్డి, డీఈ నరసింహారెడ్డి, ఏఈలు విజయకుమార్, ప్రసన్నకుమార్ ఉన్నారు. డీఎస్పీ రామాంజనేయులు, సీఐలు మల్లికార్జున్‌రావు, శ్రీరామ్, ఎస్ఐలు కమలాకర్, మాధవరావు, దేవకుమార్‌లు హైవే పై బైఠాయించిన సురేష్‌తోపాటు రైతులను బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. స్టేషన్లో సాగునీటి సమస్య తీవ్రతను వారికి వివరించారు. కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు పి.చంద్రమౌళిరెడ్డి, ఆళ్ల ఆంజనేయరెడ్డి, కోట్ల సుబ్బారెడ్డి, ఎస్.పోలిరెడ్డి, వజ్రాల కోటిరెడ్డి, దగ్గుల గోపాల్‌రెడ్డి, ఆళ్ల కృష్ణారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, గాలెయ్యయాదవ్, ఉడుముల శ్రీనివాసరెడ్డి, రెంటపల్లి సుబ్బారెడ్డి, నక్కా చిన్నత్రిపురారెడ్డి, పిచ్చయ్య, బాలకోటిరెడ్డి, వెంగళరెడ్డి, సత్యనారాయణరెడ్డి, యల్లారెడ్డి, సుబ్రహ్మణ్యం, మల్లికార్జున, కృష్ణారెడ్డి ,శ్రీనివాసరెడ్డి, వెంకటనారాయణ, రంగయ్య, రంగబాబు, నాయకులు పాల్గొన్నారు. ఎట్టకేలకు స్పందించిన సాగర్ ఉన్నతాధికారులు త్రిపురాంతకం: సాగర్ నీటి కోసం వైఎస్సార్ సీపీ రైతు విభాగం ఆధ్వర్యంలో సాగునీటికి ఉద్యమించడంతో ఎట్టకేలకు సాగర్ ఉన్నతాధికారుల బృందం ప్రధాన కాలువపై పర్యటించింది. నాగార్జున సాగర్ ప్రధాన కాలువ జిల్లా సరిహద్దు 85–3 వద్దకు సాగర్ కాలువల చీఫ్ ఇంజినీర్ గోపాల్‌రెడ్డి, ఎస్ఈ రవి, ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, ఈఈ శ్రీనివాసరెడ్డి, డీఈ నరసింహారెడ్డిలు పర్యటించారు. వీరితో పాటు ఎమ్మెల్సీ కరణం బలరాం, ఎమ్మెల్యే డేవిడ్‌రాజు ఉన్నారు. సాగునీటి సరఫరా సక్రమంగా లేనందున వరిపంట దెబ్బతింటుందన్న విషయాన్ని వ్యవసాయశాఖ అధికారులు సాగర్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కనీసం జిల్లా ఆయకట్టులోని పంటలు దెబ్బతినకుండా సాగునీరందించాలంటే 3300 క్యూసెక్కులు ముందుగా పదిహేను రోజులు ఇవ్వాల్సి ఉంటుందన్న అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం 2046 క్యూసెక్కుల నీటి సరఫరా అవుతోంది. దీనిని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ మేరకు జలవనరుల శాఖ మంత్రితో చర్చించారు. వైఎస్సార్ సీపీ రైతుల సాగునీటి సమస్యపై ముందు నుంచి అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ వచ్చింది. రైతులు పూర్తిగా నష్టపోతున్న తరుణంలో వారి సాగునీటి కష్టాలు తీర్చేందుకు రోడ్డెక్కాల్సిన పరిస్థితులను ప్రభుత్వం కల్పించింది. నీటి సమస్య పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
అన్నదాతలకు సాగునీటి కష్టాలు
-
రైతుహితమే లక్ష్యం
నారాయణఖేడ్ రూరల్, న్యూస్‌లైన్: రానున్న రోజుల్లో సాగునీరు, విద్యుత్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున రైతులు రబీలో ఆరుతడి పంటలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ సూచించారు. నారాయణఖేడ్‌లోని సాయిబాబా ఫంక్షన్‌హాలులో మంగళవారం నియోజకవర్గ రైతులకు ‘రైతుహిత’ సదస్సు ద్వారా పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ సదస్సుకు హాజరైన జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ మాట్లాడుతూ, రైతులంతా వరిసాగుపై దృష్టి సారించకుండా, నీటి లభ్యత, విద్యుత్ సరఫరాను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలైన మొక్కజొన్న, జొన్న పంటలను అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. బోర్లు తవ్వించే రైతులు కూడా భూగర్భ జలాలను దృష్టిలో ఉంచుకుని బోర్లు వేసేందుకు ప్రయత్నించాలన్నారు. లేకపోతే బోర్లు తవ్వినా నీరుపడక తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కలెక్టర్ హెచ్చరించారు. రైతులు సాగులో అధునాతన పద్ధతులు పాటించేలా చూసేందుకే ‘రైతుహిత’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో వరి, మొక్కజొన్న, పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర అందేలా చూస్తామన్నారు. సాగులో రైతులకు కావాల్సిన సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించేందుకే ’రైతుహిత’ ముఖ్య ఉద్దేశమన్నారు. ఖేడ్ ప్రాంతంలో వలసల నివారణకు ఈజీఎస్‌లో పనులు కల్పిస్తున్నట్టు తెలిపారు. జలప్రభ పథకం ద్వారా 6,500 మంది ఎస్సీ, ఎస్టీ రైతులకు చెందిన 16వేల హెక్టార్ల భూమిని సాగులోకి తెచ్చేందుకు పనులు జరుగుతున్నాయన్నారు. రబీ సీజన్లో ఖేడ్ నియోజకవర్గ రైతులకు బ్యాంకర్ల ద్వారా రూ.20 కోట్ల వరకు పంట రుణాలను అందించామనీ, వీటిని సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు సాధించాలన్నారు. మార్కెట్ యార్డుకు కృషి జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ మాట్లాడుతూ, ఉపాధి హామీని వ్యవసాయానికి అనుబంధం చేయాలని పార్లమెంట్లో ప్రశ్నించానన్నారు. రైతుల కృషితోనే దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నాయన్నారు. నారాయణఖేడ్‌లో మార్కెట్ యార్డు, ఉల్లి, టమాటలకు కోల్డ్‌స్టోరేజీలకు కృషి చేస్తామన్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి మాట్లాడుతూ, ఖేడ్ నియోజకవర్గంలో పరిశ్రమలు లేవనీ, అందువల్లే అందరూ వ్యవసాయంపైనే ఆధారపడ్డారన్నారు. భూగర్భ జలాలు కూడా అంతంతమాత్రంగానే ఉండడంతో రైతులు అధికంగా వర్షాధార పంటలపై ఆధారపడి ఉన్నారన్నారు. అంతకుముందు వ్యవసాయ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో ప్రదర్శించిన స్టాల్స్‌లను కలెక్టర్ పరిశీలించారు. రైతులు, అధికారులతో మాట్లాడారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ సర్పంచ్ అప్పారావ్షెట్కార్, అగ్రికల్చర్ జేడీ ఉమామహేశ్వరమ్మ, ఆర్డీఓ ధర్మారావు, హార్టికల్చర్ ఏడీ శేఖర్, సీడీసీ చైర్మన్ నర్సింహారెడ్డి, ఏఎంసీ చైర్మన్ వీరారెడ్డి, ఏడీఏ ప్రసాద్, ఏఓ శ్రీనివాస్, ఆత్మ చైర్మన్ భాస్కర్, మాజీ జెడ్పీటీసీ సంజీవ్‌రెడ్డి, రషీద్, కాంగ్రెస్ నేతలు చంద్రశేఖర్‌రెడ్డి, శంకరయ్యస్వామి, సుధాకర్‌రెడ్డి, సంగారెడ్డి, భోజిరెడ్డి,మాణిక్‌రెడ్డి, తాహెర్, వినోద్‌పాటిల్, పండరిరెడ్డి, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.