త్రిపురాంతకం: వ్యవసాయం దండగ అన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి రైతుల కష్టాలు ఏం తెలుస్తాయని యర్రగొండపాలెం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ఎద్దేవా చేశారు. త్రిపురాంతకంలో శనివారం వైఎస్సార్ సీపీ రైతు విభాగం ఆధ్వర్యంలో రైతులు సాగర్ నీటి కోసం ఎన్‌ఎస్‌పీ కార్యాలయం ముట్టడి, నేషనల్ హైవేపై ప్రదర్శన, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి సురేష్ మాట్లాడుతూ ఈరాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రైతులకు సాగర్ జలాలు అందక నాలుగేళ్లయిందన్నారు.
ఈఏడాది సాగునీరిస్తున్నట్లు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి స్వయంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు పదహారు సార్లు వచ్చారని..కనీసం రైతులకు సాగర్ జలాలను సాగుకు అందించలేకపోవడం దారుణమన్నారు. రైతులకు రుణమాఫీ చేయలేదని మభ్యపెడుతున్నారని విమర్శించారు. సాగర్ డ్యాంలో నీరున్నా కుడి కాలువ దిగువన నీరందించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ వచ్చి అధికారుల సమీక్షలు నిర్వహించారు కానీ నీరందలేదన్నారు. రోజుకో విధానం అమలు చేస్తున్నారని..గతంలో నీరు నిరంతరంగా ఇచ్చేవారని చెప్పారు. ఇప్పుడు తొమ్మిది రోజులు ఇచ్చి, ఆరు రోజులు ఆపుతామన్నారని..అది కూడా అమలు జరగడం లేదన్నారు.
ఇక నుంచి ఇలా నీరిస్తే పంట పూర్తిగా ఎండిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా ప్రధాన కాలువకు మూడువేల క్యూసెక్కుల నీరు అందించాలని డిమాండ్ చేశారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నీటిని నిరాటంకంగా అందించారని గుర్తు చేశారు. వరుణుడు కరుణించి వర్షంపడి శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నిండుకుండలా ఉంటే, ఆ నీటిని రైతులకు అందించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ప్రకటనతో రైతులు ఆశించి పంటలు పండించవచ్చనుకుంటే వారికి నీరివ్వక నిలువునా మోసం చేశారని విమర్శించారు. పంటలు వేసేవారికి నీరెప్పుడివ్వాలి, ఎప్పుడు ఎరువులు కావాలి, ఎప్పుడు గిట్టుబాటు ధర కావాలో రైతు బిడ్డకు తెలుస్తుంది కానీ మాటలు చెప్పి కాలయాపన చేసే ఈ ముఖ్యమంత్రికి రైతుల కష్టమేమి తెలుస్తుందని ప్రశ్నించారు. రైతన్నల కష్టాలు తీర్చేందుకు జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని సురేష్ పిలుపునిచ్చారు.
సాగునీటి పోరుకు స్వచ్ఛందంగా తరలివచ్చిన రైతులు:
సాగర్ సాగునీటి కష్టాలు తీర్చాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఇచ్చిన పిలుపు మేరకు రైతుల నుంచి విశేష స్పందన లభించింది. రైతులను సాగునీటి పోరాటంలో పాల్గొనకుండా అధికార యంత్రాంగం, పోలీస్‌శాఖ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినా స్వచ్ఛందంగా రైతులు తరలివచ్చారు. త్రిపురాంతకానికి ఎమ్మెల్యే సురేష్ తెల్లవారే సరికి చేరుకున్నారు. ఆయనను గృహనిర్బంధం చేయాలని రాస్తారోకో, కార్యాలయం ముట్టడి కార్యక్రమాలను నిరోధించే ప్రయత్నాలు చేశారు.
అయినా ప్రకటించిన విధంగా ఎమ్మెల్యే సురేష్ ఆధ్వర్యంలో అనంతపురం–అమరావతి హైవేపై రైతులు ప్రదర్శన చేశారు. సాగర్ కార్యాలయాన్ని ముట్టడించారు. అక్కడ రైతుల సాగునీటి సమస్యపై మండిపడ్డారు. సాగర్ కాలువల ఎస్‌ఈ కె.రవి మాట్లాడుతూ సాగర్ ప్రధాన కాలువ ద్వారా తక్కువ నీరు వస్తున్నందున నీటి సరఫరా పెరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎస్‌ఈ వెంట ఈఈ శ్రీనివాసరెడ్డి, డీఈ నరసింహారెడ్డి, ఏఈలు విజయకుమార్, ప్రసన్నకుమార్ ఉన్నారు. డీఎస్పీ రామాంజనేయులు, సీఐలు మల్లికార్జున్‌రావు, శ్రీరామ్, ఎస్‌ఐలు కమలాకర్, మాధవరావు, దేవకుమార్‌లు హైవే పై బైఠాయించిన సురేష్‌తోపాటు రైతులను బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
స్టేషన్‌లో సాగునీటి సమస్య తీవ్రతను వారికి వివరించారు. కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు పి.చంద్రమౌళిరెడ్డి, ఆళ్ల ఆంజనేయరెడ్డి, కోట్ల సుబ్బారెడ్డి, ఎస్.పోలిరెడ్డి, వజ్రాల కోటిరెడ్డి, దగ్గుల గోపాల్‌రెడ్డి, ఆళ్ల కృష్ణారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, గాలెయ్యయాదవ్, ఉడుముల శ్రీనివాసరెడ్డి, రెంటపల్లి సుబ్బారెడ్డి, నక్కా చిన్నత్రిపురారెడ్డి, పిచ్చయ్య, బాలకోటిరెడ్డి, వెంగళరెడ్డి, సత్యనారాయణరెడ్డి, యల్లారెడ్డి, సుబ్రహ్మణ్యం, మల్లికార్జున, కృష్ణారెడ్డి ,శ్రీనివాసరెడ్డి, వెంకటనారాయణ, రంగయ్య, రంగబాబు, నాయకులు పాల్గొన్నారు.
ఎట్టకేలకు స్పందించిన సాగర్ ఉన్నతాధికారులు
త్రిపురాంతకం: సాగర్ నీటి కోసం వైఎస్సార్ సీపీ రైతు విభాగం ఆధ్వర్యంలో సాగునీటికి ఉద్యమించడంతో ఎట్టకేలకు సాగర్ ఉన్నతాధికారుల బృందం ప్రధాన కాలువపై పర్యటించింది. నాగార్జున సాగర్ ప్రధాన కాలువ జిల్లా సరిహద్దు 85–3 వద్దకు సాగర్ కాలువల చీఫ్ ఇంజినీర్ గోపాల్‌రెడ్డి, ఎస్‌ఈ రవి, ఆర్‌డీఓ రామకృష్ణారెడ్డి, ఈఈ శ్రీనివాసరెడ్డి, డీఈ నరసింహారెడ్డిలు పర్యటించారు. వీరితో పాటు ఎమ్మెల్సీ కరణం బలరాం, ఎమ్మెల్యే డేవిడ్‌రాజు ఉన్నారు. సాగునీటి సరఫరా సక్రమంగా లేనందున వరిపంట దెబ్బతింటుందన్న విషయాన్ని వ్యవసాయశాఖ అధికారులు సాగర్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
కనీసం జిల్లా ఆయకట్టులోని పంటలు దెబ్బతినకుండా సాగునీరందించాలంటే 3300 క్యూసెక్కులు ముందుగా పదిహేను రోజులు ఇవ్వాల్సి ఉంటుందన్న అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం 2046 క్యూసెక్కుల నీటి సరఫరా అవుతోంది. దీనిని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ మేరకు జలవనరుల శాఖ మంత్రితో చర్చించారు. వైఎస్సార్ సీపీ రైతుల సాగునీటి సమస్యపై ముందు నుంచి అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ వచ్చింది. రైతులు పూర్తిగా నష్టపోతున్న తరుణంలో వారి సాగునీటి కష్టాలు తీర్చేందుకు రోడ్డెక్కాల్సిన పరిస్థితులను ప్రభుత్వం కల్పించింది. నీటి సమస్య పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment