
సాక్షి, అమరావతి: తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల నష్ట పరిహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ధ్వంసమైన ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు నిర్మించుకోవటానికి 1.50 లక్షల పరిహారం చెల్లిస్తామన్నారు. ఇల్లు దెబ్బతింటే రూ.10 వేలు పరిహారం ఇస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో శనివారం ఉన్నతాధికారులతో తుపాను అనంతర పరిస్థితి, సహాయ పునరావాసంపై చర్చించి నష్టపరిహారం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆదివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. వరి పంట నష్టపోయిన రైతులకు హెక్టారు రూ.20 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని, ఇతర పంటలకు నిబంధనల మేరకు పరిహారం ఇస్తామని పేర్కొన్నారు.
అరటి తోటలకు ఎకరానికి రూ.30 వేల పరిహారం, జాతీయ ఉపాధిపథకం పథకం కింద కొబ్బరి మొక్కలు నాటి మూడేళ్ల వరకు సంరక్షణకు ఎకరానికి రూ.40 వేలు చొప్పున చెల్లిస్తామని, కొబ్బరి చెట్లు నష్టపోయిన రైతులకు చెట్టుకు రూ.1,200 వంతున చెల్లించనున్నట్లు తెలిపారు. నష్టపోయిన జీడిమామిడి తోటల రైతులకు ఎకరానికి రూ.25 వేల పరిహారం, ఎకరానికి రూ.40 వేల చొప్పున ఉపాధి హామీ పథకం కింద తోటల అభివృద్ధికి సాయం చేస్తామన్నారు. పడవలు పూర్తిగా ధ్వంసమైన మత్స్యకారులకు మెకనైజ్డ్ బోట్ అయితే రూ.6 లక్షలు, సాధారణ పడవలకు రూ.లక్ష, వలను నష్టపోయిన మత్స్యకారులకు వల ఒక్కోదానికి రూ.10 వేలు పరిహారం చెల్లిస్తామన్నారు. దెబ్బతిన్న ఆక్వా రైతులకు ఎకరానికి రూ.30 వేలు, తుపాను ప్రభావంతో మృతి చెందిన పశువులకు రూ.30 వేల చొప్పున చెల్లిస్తామన్నారు. గొర్రెలు, మేకలు మృతి చెందితే ఒక్కోదానికి మూడు వేలు, దెబ్బతిన్న పశువుల కొట్టాలు ఒక్కో దానికి రూ.10 వేల నష్టపరిహారాన్ని యజమానులకు చెల్లిస్తామన్నారు.
యుద్ధప్రాతిపదికన సహాయకచర్యలు చేపట్టండి: సీఎస్
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తిత్లీ తుపాన్ బారిన పడిన మండలాల్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ అధికారులను ఆదేశించారు. ఆదివారం సచివాలయం నుంచి తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస పనులపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment