శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గరుడబద్ర కూడలి వద్ద మామిడిపల్లి, మర్రిపాడు గ్రామస్తుల నిరసన
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/కాశీబుగ్గ: తిత్లీ తుపాన్.. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాను కకావికలం చేసి నాలుగు రోజులవుతోంది. పంటలు నీట మునిగాయి.. తోటలు నేలకొరిగాయి.. ఇళ్లు కూలిపోయాయి. తినడానికి బుక్కెడు బువ్వ లేక, తాగడానికి గుక్కెడు నీరు లేక బాధితులంతా హాహాకారాలు చేస్తున్నారు. నాలుగు రోజులుగా ఆకలితో అలమటించిపోతున్న తమను ఆదుకునే వారే కనిపించక ఆగ్రహంతో రోడ్డెక్కారు. సర్వం కోల్పోయి వీధిన పడ్డ తమను పట్టించుకోని ప్రభుత్వంపై కన్నెర్ర చేశారు. రెండో రోజు ఆదివారం కూడా జిల్లావ్యాప్తంగా రహదారులను దిగ్బంధించారు. కనీసం తాగునీరు కూడా అందించలేని సర్కారు నిర్వాకంపై నిప్పులు చెరిగారు. పునరావాస చర్యలు ఎక్కడా కానరాకపోవడంతో బాధితులు శివాలెత్తారు.
హామీలకు దిక్కులేదు
బంగాళాఖాతంలో వాయుగుండంగా ఏర్పడి ఈ నెల 11వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో తీరాన్ని దాటిన తిత్లీ తుపాన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వేలాది ఎకరాల్లో కొబ్బరి తోటలు, లక్షన్నర ఎకరాల్లో వరితో సహా పలు పంటలు నీటిపాలై రైతన్నలు నష్టపోయారు. ఊళ్లకు ఊళ్లే మరుభూమిలా మారిపోయాయి. తుపాన్ బాధితులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం చురుగ్గా స్పందించలేదు. కనీసం రహదారులకు ఆనుకొని ఉన్న గ్రామాల్లో సైతం తాగునీటి పంపిణీ చేపట్టలేదు. నిత్యావసర సరుకులు అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చి రెండు రోజులు గడుస్తున్నా ఎక్కడా పంపిణీ జరగలేదు. దీంతో ప్రజలు ఎక్కడికక్కడ అధికార పార్టీ ప్రజాప్రతినిధులను, అధికారులను నిలదీస్తున్నారు.
ఈ సెగ ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచే మొదలైన సంగతి తెలిసిందే. కవిటి మండలం జగతి గ్రామంలో వందలాది మంది మహిళలు ముఖ్యమంత్రి కాన్వాయ్‌ను అడ్డుకొని ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. గుక్కెడు నీరు దొరక్క తాము అల్లాడిపోతున్నామని మొర పెట్టుకున్నారు. అయినా ప్రభుత్వం స్పందనలేకపోవడంతో ఆదివారం పలుచోట్ల ఆందోళన కొనసాగించారు. కనీసం తమ దుస్థితిని చూడడానికైనా అధికార పార్టీ నేతలు, ప్రభుత్వాధికారులు తమ గ్రామాలకు రావడం లేదంటూ తుపాన్ బాధిత ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో రెండు రోజుల్లోనే కరెంట్ సరఫరా పునరుద్ధారిస్తానన్న ముఖ్యమంత్రి హామీ గాల్లో కలిసిపోయింది. ఊరూరా ట్యాంకులతో తాగునీరు అందిస్తానన్న హామీ ఆచరణలోకి రాలేదు.
- వజ్రపుకొత్తూరు మండలం గరుడభద్ర గ్రామం వద్ద రహదారిపై మర్రిపాడు, మామిడిపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమకు తాగునీరు సహా కనీస సౌకర్యాలు కల్పించేవరకూ నిరసన విరమించబోమని తెగేసి చెప్పారు. దీంతో పోలీసు సిబ్బంది స్పందించి అగ్నిమాపక శకటం ద్వారా తాగునీరు తీసుకొచ్చారు.
- పలాస మండలం మామిడిపల్లిలో గ్రామస్థులు టీడీపీ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీని నిలదీశారు. తమ గ్రామానికి కరెంటు కాదు కదా ఇప్పటివరకూ కనీసం తాగునీరు కూడా ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. ఓట్ల కోసం వస్తారు కానీ మా కష్టాలను పట్టించుకోరా? అంటూ నిలదీశారు.
- మందస మండలంలోని మకరజ్వాల గ్రామస్థులు ఏకమై 16వ నంబరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను దాదాపు రెండు గంటల పాటు అడ్డుకున్నారు. రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో పరామర్శకు వచ్చిన శ్రీకాకుళం జెడ్పీ చైర్‌పర్సన్, టీడీపీ నేత చౌదరి ధనలక్ష్మిని నిలదీశారు. పోలీసులు వచ్చి సర్దిచెప్పడంతో ఆందోళనను విరమించారు.
- సారవకోట మండల కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. తిత్లీ తుపాన్ వల్ల తామంతా పంటలు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తమ మండలాన్ని తుపాన్ ప్రభావిత ప్రాంతంగా ప్రభుత్వం ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని నిరసన తెలిపారు.
- భామిని మండలంలోని భావేరు సెంటరులోనూ రైతులు నిరసన తెలిపారు. తిత్లీ తుపాన్ వల్ల తాము పంటలు నష్టపోయినా ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి స్పందనలేదని, అధికారులు సర్వే కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
- కొత్తూరు మండల కేంద్రంలోనూ వందలాది మంది రైతులు ఆందోళనకు దిగారు. తుపాన్ వల్ల పంటలు నష్టపోయినా ప్రభుత్వం స్పందించడం లేదని ధ్వజమెత్తారు.
- పలాస మండలం సున్నాదేవి గ్రామం వద్ద వంద మందికిపైగా తుపాన్ బాధితులు జాతీయ రహాదారిని దిగ్బంధించి నిరసన తెలిపారు. ప్రభుత్వం తమకు తాగునీరు, ఆహారం సరఫరా చేయడం లేదని, ఆకలిని భరిస్తూ ఎలా బతకాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే తమ గ్రామానికి రావాలంటూ నినాదాలు చేశారు.
ఎలా జీవించాలో తెలియడం లేదు
‘‘పచ్చటి మా ఊరు తుపాన్ వల్ల నాశనమైపోయింది. ఇళ్లు కూలిపోయాయి. కొబ్బరి చెట్లు నెలకొరిగాయి. కరెంటు పోయింది. మంచినీరు రావడం లేదు. గుక్కెడు నీళ్లు పోసేవాళ్లే కనిపించడం లేదు. ఇక ఎలా జీవించాలో తెలియడం లేదు’’
– మామిడి సుభద్రమ్మ, బహాడపల్లి, మందస మండలం
అవన్నీ ఉత్త కబుర్లే..
‘‘తుపాన్ వల్ల నష్టపోయిన వాళ్లందరికీ నీరు, బియ్యం అన్నీ ఇస్తామన్నారు. భయపడొద్దన్నారు. అవన్నీ ఉత్త కబుర్లుగానే మిగిలిపోయాయి. నాలుగు రోజులైంది. ఇప్పటికీ ఎవరూ మా ఊరికి రాలేదు’’
– సార లక్ష్మమ్మ, బహాడపల్లి, మందస మండలం
కడుపు మండిపోతోంది
‘‘మా ఊరు జాతీయ రహదారి పక్కనే ఉంది. మిగతా ఊళ్లలోకి వెళ్లాలంటే చెట్లు అడ్డంగా ఉన్నాయంటున్నారు. మా ఊరికి రావడానికి ఏమైంది? పాలకులు కనీసం పట్టించుకోవడం లేదు. కడుపు మండిపోతోంది. కరెంటు రాలేదు. తాగునీరు ఇవ్వట్లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే ప్రతిరోజూ ఆందోళనలు కొనసాగిస్తాం’’
– అబ్బాయి, తుపాన్ బాధితుడు, మకరజ్వాల గ్రామం, మందస మండలం
ప్రభుత్వం వివక్ష చూపుతోంది
‘‘భామిని మండలంలో తిత్లీ తుపాన్ వల్ల రైతులంతా నష్టపోయారు. కానీ, మా మండలాన్ని తుపాన్ బాధిత ప్రాంతంగా ప్రభుత్వం గుర్తించకపోవడం దారుణం. దీనివల్ల నష్టపరిహారం రాదు. బీమా రాదు. ప్రభుత్వం ఇలా వివక్ష చూపడం సరికాదు. అందుకే నిరసన తెలుపుతున్నాం.
– మేడిపోయిన చలపతి, రైతు, బావేరు, భామిని మండలం
Comments
Please login to add a commentAdd a comment