పొత్తులో కేటాయించే సీటుపై గందరగోళం
ఎచ్చెర్ల, పాతపట్నంలో ఏదో ఒకటి కావచ్చన్న అభిప్రాయం
సీటు కేటాయింపులో స్పష్టత లేమి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కూటమిలో సీట్ల పంపకంపై స్పష్టత కుదరడం లేదు. టీడీపీ, జనసేనలోనే కాదు బీజేపీలో కూడా టెన్షన్ నెలకొంది. శ్రీకాకుళం జిల్లాలో కేటాయించే సీటు విషయంలో ఇప్పటికీ ఓ క్లారిటీ లేకపోవడంతో బీజేపీ నాయకుల్లో అయోమయం వీడడం లేదు. చంద్రబాబు, పవన్‌తో జరిగిన సమావేశంలో జాతీయ స్థాయి నాయకులు పాల్గొనడం, అందులో రాష్ట్ర నాయకులు లేకపోవడంతో బీజేపీకి కేటాయించే సీటుపై గందరగోళం నెలకొంది. ఇప్పుడున్న సమాచారం మేరకు శ్రీకాకుళం కంటే పాతపట్నం, ఎచ్చెర్ల నియోజకవర్గాలకే ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా బీజేపీ నాయకులు అభిప్రాయడుతున్నారు.
పొత్తు కుదరకముందు ప్రతి నియోజకవర్గానికి ముగ్గురేసి అభ్యర్థులను రాష్ట్ర నాయకులు జాతీయ అధిష్టానానికి ప్రతిపాదించారు. ఈ లోగా పొత్తు కుదరడంతో సీట్ల పంపకాలపై పార్టీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు ఒక సీటు ఇవ్వాలని ఒప్పందం జరిగింది. ఇక్కడే కాస్త సమాచారం లోపం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. జిల్లాలో ఒక సీటు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ ఒక్కటీ శ్రీకాకుళం కావచ్చని చాలారోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ తాజాగా బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం జిల్లాకు ఒకటి అన్నది శ్రీకాకుళం పేరు మీద జరిగినందున.. అది శ్రీకాకుళం నియోజకవర్గం అయి ఉండొచ్చనే ప్రచారానికి తెరలేచినట్టుగా భావిస్తున్నారు. అదే జరిగితే శ్రీకాకుళం నుంచి ప్రతిపాదిత జాబితాలో ఉన్న పూడి తిరుపతిరావు, పైడి వేణుగోపాల్‌తో పాటు రాయలసీమ జిల్లాకు చెందిన సురేంద్రకుమా ర్‌లలో ఎవరికో ఒకరికి ఇవ్వవచ్చని ఊహాగానాలు, విశ్లేషణలు జరిగిపోయాయి.
తాజా సమాచారం ప్రకారం ఎచ్చెర్ల, పాతపట్నం నియోజకవర్గాలకే ఎక్కువ అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పాతపట్నంలో టీడీపీలో ఉన్న గ్రూపు రాజకీయాలతో ఆ పార్టీ భ్రష్టు పట్టి పోవడంతో ఎందుకొచ్చిన సమస్య అని బీజేపీకి ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు భోగట్టా. అలాగే ఎచ్చెర్లలో కిమిడి కళా వెంకటరావు, కలిశెట్టి అప్పలనాయుడు మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో బీజేపీకి ఇచ్చేస్తే తలనొప్పి ఉండదని కూడా చంద్రబాబు భావించి ఉండొచ్చని.. ఈ రెండింటిలో బీజేపీ ఏది కోరితే ఆ సీటు ఇచ్చేయడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నట్టు కూడా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలో రాష్ట్ర పార్టీ అభిప్రాయం మేరకు ఈ రెండింటిలో ఏదో ఒక నియోజకవర్గాన్ని జాతీయ నాయకత్వం ఖరారు చేసే అవకాశం ఉందని జిల్లా నాయకత్వం కూడా భావిస్తోంది. వాస్తవంగా ఇటీవల బీజేపీలో చేరిన ఒకప్పటి టీడీపీ నాయకుడు సిరిపురం తేజేశ్వరరావు ఆ వ్యూహంలో భాగమని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. ఒకవేళ పాతపట్నం కాదనుకుంటే ఎచ్చెర్లకు చెందిన ఎన్‌ఈఆర్( నడికుదిటి ఈశ్వరరావు)కైనా ఖరారు కావచ్చని తెలుస్తోంది. ఎన్‌ఈఆర్ కోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పెద్ద ఎత్తున ప్రయతి్నస్తున్నట్టుగా ఓ వర్గం చెబుతుండగా, టిక్కెట్ గ్యారంటీ ఇవ్వడంతోనే సిరిపురం తేజేశ్వరరావు పారీ్టలోకి చేరారని మరోవర్గం స్పష్టం చేస్తోంది.
మొత్తానికి బీజేపీకి జిల్లాలో ఒక సీటు కేటాయించడం ఖాయం. అది ఏది అన్నది తేలాల్సి ఉంది. కమ్యూనికేషన్ గ్యాప్‌తో తెరపైకి వచ్చిన శ్రీకాకుళం అవుతుందా? కాస్త బలంగా ఉన్నామని భావిస్తున్న ఎచ్చెర్ల, పాతపట్నంలో ఒకటవుతుందా అన్నది చూడాల్సి ఉంది. బీజేపీలో జరుగుతున్న తర్జనభర్జన నేపథ్యంలో టీడీపీ నాయకులకు చెమటలు పడుతున్నాయి. బీజేపీతో తమ సీటు గల్లంతు అవుతుందేమోనని అటు శ్రీకాకుళం నుంచి గుండ లక్ష్మీదేవి, గొండు శంకర్, పాతపట్నం నుంచి కలమట వెంకటరమణ, మామిడి గోవిందరావు, ఎచ్చెర్ల నుంచి కళా వెంకటరావు, కలిశెట్టి అప్పలనాయుడు భయాందోళనలో ఉన్నారు. మొత్తానికి ఏదో ఒక నియోజకవర్గంలో ఇద్దరికీ సీటు చిరగడం మాత్రం ఖాయమని పొత్తు ఒప్పందం ప్రకారం స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment