
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచార యావ అధికారులనే విస్మయ పరుస్తోంది. ఇదే ప్రచార యావతో గోదావరి పుష్కర కార్యక్రమాల నిర్వహణను సినిమా తరహాలో చిత్రీకరణకు పూనుకుని తొక్కిసలాటకు కారణమయ్యారని, 29 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయినా చంద్రబాబు వైఖరిలో ఎలాంటి మార్పూ రాలేదని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా తిత్లీ ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను ఎక్కడికక్కడ వీడియోల్లో చిత్రీకరించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వం అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఆయా శాఖల వద్ద వీడియో కెమెరాలు ఉంటే సరేనని.. లేనిపక్షంలో తక్షణమే వీడియో గ్రాఫర్లను నియమించుకోవాలని సూచించింది.
బాధితులకు భోజనం అందించడం, మంచినీటి సరఫరాతో పాటు పడిపోయిన చెట్లు తొలగించడం, విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లు తుపాను బాధితులతో కలసి ఉన్న ఫొటోలతో కూడిన వీడియోలను రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ వీడియోలన్నింటితో డాక్యుమెంటరీని రూపొందించి సినిమా థియేటర్లలో ప్రదర్శించడం ద్వారా ప్రచారం పొందాలనేది ముఖ్యమంత్రి యోచన అని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒక పక్క బాధితులను ఆదుకోవడానికి విరివిగా విరాళాలు ఇవ్వాల్సిందిగా పిలుపునిస్తూ మరోపక్క ప్రజా ధనాన్ని ఇలా ప్రభుత్వ ప్రచారం కోసం దుర్వినియోగం చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హుద్‌హుద్ తుపాను సమయంలో కూడా ప్రచారం కోసం రూ.36.63 లక్షల రూపాయలను వ్యయం చేశారని, సహాయక చర్యలతో ప్రచార ప్రకటనలను జారీ చేశారని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment