
సాక్షి అమరావతి : తిత్లీ తుపాను బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీకి మరో లేఖ రాశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సీఎం కార్యాలయం ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం.. తిత్లీ తుపాను నష్టం రూ.3,435 కోట్ల అని, తాత్కాలిక సహాయంగా రూ. 1,200 కోట్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆ లేఖలో కోరారు. గతంలో రాసిన లేఖకు పీఎంవో నుంచి స్పందన లేకపోవడంతో ఆవేదనతో మరో లేఖ రాస్తున్నట్టు చంద్రబాబు తన రెండో లేఖలో ప్రస్తావించారు. కనీసం కేంద్ర బృందం కూడా తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించలేదని సీఎం పేర్కొన్నారు.
తుపాను నష్టంపై ఇప్పటికే కేంద్ర హోంమంత్రికి విజ్ఞాపన పత్రం ఇచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు. తక్షణ సహాయ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.500 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. 2.25 లక్షల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని.. వీరికి సహాయ పునరావాసం కల్పించాలని సీఎం చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర బృందాన్ని పంపి తుపాను నష్టాన్ని అంచనా వేయాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment