
సాక్షి, అమరావతి: తిత్లీ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రూ.2,800 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాలు వచ్చాయని.. తక్షణ సాయంగా రూ.1,200 కోట్లు విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రధానికి లేఖ రాశారు. తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను ఆదుకోవాలని ప్రధానిని కోరారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు తీరని నష్టం వాటిల్లిందని తెలిపారు.
ప్రాథమిక అంచనాల ప్రకారం మొత్తం నష్టం విలువ రూ.2,800 కోట్లు కాగా.. అందులో విద్యుత్ రంగానికి సంబంధించి రూ.500 కోట్లు, రహదారులు, భవనాల శాఖకు రూ.100 కోట్లు, పంచాయతీరాజ్‌కు రూ.100 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.800 కోట్లు, ఉద్యానరంగానికి రూ.వెయ్యి కోట్లు, పశుగణాభివృద్ధి శాఖకు రూ.50 కోట్లు, మత్స్య శాఖకు రూ.50 కోట్లు, ఆర్‌డబ్ల్యూఎస్‌కు రూ.100 కోట్లు, జలవనరుల శాఖకు రూ.100 కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ.. సహాయ, పునరుద్ధరణ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రజల కష్టాలు కొంతమేరయినా తీర్చి ఉపశమనం కలిగించడానికి ఉదారంగా, వీలైనంత వేగంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ లేఖను ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ పీఎంవోలో అందజేశారు.