తమకు భోజనాలు అందలేదంటూ చంద్రబాబు ఎదుట ఆందోళన చేస్తున్న బాధితులు
టెక్కలి: తుపాన్ ప్రభావం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తుగా సముద్రాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. తిత్లీ తుపాన్ ధాటికి దెబ్బతిన్న శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో బుధవారం ఆయన పర్యటించారు. ముందుగా టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ప్రత్యేక హెలికాప్టర్‌లో దిగారు. అనంతరం ప్రత్యేక కాన్వాయ్‌లో జాతీయ రహదారి మీదుగా బొప్పాయిపురం, కొత్తపేట, కోటబొమ్మాళి, సీతన్నపేట, సంతబొమ్మాళి, హెచ్‌ఎన్‌పేట, జగన్నాథపురం, వడ్డితాండ్ర, ఎన్.జగన్నాథపురం, నౌపడ మీదుగా టెక్కలి వరకు పర్యటన సాగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... తుపాన్ వల్ల నష్టపోయిన ప్రాంతాలకు పూర్వ వైభవం తీసుకొస్తానని చెప్పారు. కొందరు తన దగ్గర తొడలు కొడుతున్నారని, ఆవలిస్తే తాను పేగులు లెక్కపెడతానని తీవ్రంగా హెచ్చరించారు. ‘సాక్షి’ తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని, తననేం చేయలేరన్నారు.
ముఖ్యమంత్రికి నిరసన సెగ
మంత్రి అచ్చెన్నాయుడి సొంత ఇలాకా టెక్కలి నియోజకవర్గంలోని సంతబొమ్మాళి మండలంలో సీఎం చంద్రబాబుకు తిత్లీ తుపాన్ బాధితుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. తుపాన్ బాధితులకు పాఠశాలల్లో భోజనాలు అందజేస్తున్నారా? అని చంద్రబాబు అడగ్గా.. తమకు భోజనాలు అందడం లేదని, తమను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ జనం ముక్తకంఠంతో తెగేసి చెప్పారు. ప్రభుత్వం నుంచి సాయం అందడం లేదని నిరసన వ్యక్తం చేశారు. దాంతో చంద్రబాబు తీవ్ర అసహనానికి గురయ్యారు. అధికారులకు ఒళ్లు బలిసిపోయిందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇదంతా వైఎస్సార్ సీపీ కుట్ర అని ఆరోపించారు. దారిపొడవునా తుపాన్ బాధితులు తమ కష్టాలను ఏకరువు పెట్టారు. వారిపై చంద్రబాబు కస్సుబుస్సుమన్నారు. కాకరాపల్లి ప్రాంతంలో పవర్‌ప్లాంట్ రాదని స్పష్టం చేశారు. వడ్డితాండ్రంలో తుపాన్ వల్ల మృతి చెందిన అప్పలస్వామి కుటుంబాన్ని పరామర్శించారు. వడ్డితాండ్రలో సీఎం పర్యటిస్తుండగానే, పవర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా మత్స్యకారుల దీక్షలు చేయడం గమనార్హం.
తుపాన్ బాధితులకు చేయూతనివ్వండి
కాశీబుగ్గ : తుపాన్ బాధితులకు ప్రతి ఒక్కరూ సాయమందించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. బుధవారం పలాస రైల్వేగ్రౌండ్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కొబ్బరిచెట్టుకు రూ.1500, జీడిమామిడి చెట్టుకు రూ.25వేలు అందిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment