ఆకాశంలో సగం.. అవకాశాల్లోనూ సగమంటూ.. మహిళాలోకం నినదిస్తోంది. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తోంది. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన అతివలు ఇపుడు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు. అటు సమాజాభివృద్ధికి పాటుపడుతూ.. ఇటు కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. జిల్లాలో కలెక్టర్, ఎస్పీ తదితర అత్యున్నత పదవులను అలంకరించిన నారీమణులు జిల్లా అభివృద్ధిలో తమ ముద్ర వేస్తున్నారు. ఇక వ్యాపార, వ్యవసాయ రంగాలతో పాటు విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లోనూ ఇంతులంతా ఇంతింతై...అన్న చందంగా ఎదుగుతున్నారు.
సాగు సలహాల్లోనూ మగువే
తడ్కల్, న్యూస్‌లైన్: దేశాభివృద్ధికి వెన్నుముకగా నిలుస్తోన్న వ్యవసాయంలోనూ మగువలే ముందున్నారు. గ్రామీణ మహిళలు పురుషులతో పోటీ పడి వ్యవసాయ పనులు చేస్తుండగా, వ్యవసాయాధికారులుగా విధులు నిర్వర్తిస్తున్న వారు ఆధునిక వ్యవసాయం గురించి రైతులకు వివరిస్తూ సాగుకు సాయం చేస్తున్నారు. పంటలకు సోకే చీడ, పీడల బాధ నుంచి రైతులకు విముక్తులను చేస్తున్నారు. రైతులతో పాటు ధీటుగా వ్యవసాయ క్షేత్రాల్లో అలుపు లేకుండా తిరుగుతూ వ్యవసాయాభివృద్ధికి తోడ్పడుతున్నారు.
నారాయణఖేడ్ నియోజకవర్గంలో వ్యవసాయ శాఖలో కల్హేర్ ఏఓగా అరుణ, పెద్దశంకరంపేట ఏఓగా రత్న, కల్హేర్, కంగ్టి, మనూర్ వ్యవసాయ విస్తరణ అధికారులుగా స్వాతి, శ్రీదేవి, గీతలు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరితో పాటు రైతుల పొలాలను సందర్శించడానికి తరచుగా ైరె తు శిక్షణ కేంద్రం నుంచి ఏడీఏ రమాదేవి, ఏఓ మీనా వ్యవసాయంలో మేముసైతం... అంటూ సేవలు అందిస్తున్నారు. ఖేడ్ వ్యవసాయ కార్యాలయంలో సహాయకురాలిగా సైతం సరిత అనే మహిళ విధులు నిర్వర్తిస్తున్నారు. వీటన్నింటికీ మించి జిల్లా వ్యవసాయాధికారిగా ఉన్న ఉమామహేశ్వరి రైతులకు విలువైన సూచనలు, సలహాలు చేస్తూ సాగుకు సాయం చేస్తున్నారు.
ఆ ఇద్దరూ రథ సారథులై.. కలెక్టర్, ఎస్పీల సమర్థ పాలన
జిల్లా అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధించడానికి ఆ ఇద్దరూ రథసారథులై నడిపిస్తున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇద్దరూ మహిళే కావడం విశేషం. కలెక్టర్‌గా స్మితా సబర్వాల్ జిల్లా పాలనను సమర్థవంతంగా నిర్వహిస్తుండగా, ఇటీవల జిల్లాకు వచ్చిన జిల్లా ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ శాంతిభద్రతల పరిరక్షణలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం,ఆరోగ్యం, మహిళా సంక్షేమం, వ్యవసాయం, పారిశుధ్యం తదితర అంశాలపై కలెక్టర్ స్మితా సబర్వాల్ ప్రత్యేక దృష్టి సారించారు.
అంతేగాక వైద్యం విషయంలో ‘మార్పు’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. పదవ తరగతి ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు సైతం విద్యార్థులకు సాయంత్రం వేళల్లో అల్పాహార కార్యక్రమాన్ని చేపట్టిన ఘనత కూడా రాష్ట్ర వ్యాప్తంగా మెదక్ జిల్లా కలెక్టర్‌కే దక్కింది. ఈ కార్యక్రమం అమలు కోసం సామాజిక భద్రత నిధి నుంచి ప్రతి విద్యార్థికి రూ.6 రూపాయలు కేటాయించారు. అలాగే జిల్లా ఎస్పీగా శెముషీ బాజ్‌పాయ్ నేతృత్వంలో జిల్లాలో శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉన్నాయి. రానున్న ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆమె ఇప్పటికే జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించారు. జిల్లాలో నెలకొన్న శాంతిభద్రతల పరిరక్షణ గురించి తెలుసుకున్నారు. డివిజన్ల వారీగా సంబంధిత పోలీసు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ఇప్పటి నుంచే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. వీరిద్దరూ ఉత్తమ సేవలందిస్తూ జిల్లాలోని మహిళల్లో స్ఫూర్తి నింపుతున్నారు.
స్వశక్తితో ఎదగాలి మహిళా దినోత్సవ సభలో కలెక్టర్
కలెక్టరేట్, న్యూస్‌లైన్: స్వశక్తిపై ఆధారపడి సమాజంలో గౌరవనీయమైన స్థానానికి చేరుకోవాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ మహిళా ఉద్యోగులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో టీఎన్జీఓల ఆధ్వర్యంలో ప్రపంచ మహిళ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దశాబ్దం క్రితం నాటికి ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయన్నారు. బాలికలపై గతంలో మాదిరిగా వివక్షలేద న్నారు. చిత్తశుద్ధితో విధులు నిర్వహించడంలో మహిళలే ముందున్నారని పేర్కొన్నారు. మహిళా సాధికారతకు ప్రత్యేక కృషి చేస్తున్నట్టు తెలిపారు. టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మనోహర పాల్గొన్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన మహిళా ఉద్యోగులకు కలెక్టర్ జ్ఞాపికలు అందజేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం
Published Fri, Mar 7 2014 11:47 PM | Last Updated on Sat, Sep 2 2017 4:27 AM
Advertisement
Advertisement