కలెక్టరేట్, న్యూస్‌లైన్:
జిల్లాలో వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమన్నారు. బ్లాక్, బ్లూ బాల్‌పాయింట్ పెన్, హాల్‌టికెట్‌తో మాత్రమే అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్, లైజన్ అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే నెల 2న వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షల కోసం 154 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 60,463 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. వీఆర్‌ఓ పోస్టులకు 57,820 మంది, వీఆర్‌ఏ పోస్టులకు 2,643 మంది హాజరవుతున్నారన్నారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వీఆర్‌ఓ, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు వీఆర్‌ఏ పరీక్ష ఉంటుందన్నారు.
అభ్యర్థుల సౌకర్యార్థం సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్‌చెరు, రామచంద్రాపురం బస్టాండ్‌లలో ఈ నెల 30వ తేదీ నుంచే పరీక్ష కేంద్రాల వివరాలను వాటి మధ్య ఉన్న దూరాన్ని తెలియజేస్తూ హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు జేసీ డాక్టర్ ఎ. శరత్ తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల ఎడమ చేతి బొటన వేలిముద్రను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఏపీపీఎస్సీ నియమ నిబంధనలను క్షుణ్ణంగా చదివి ఆ మేరకు పరీక్ష నిర్వహణ చేపట్టాలన్నారు. పరీక్ష కేంద్రాన్ని, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా ఎప్పటికప్పుడు వీడియో ద్వారా చిత్రీకరించేలా ఆర్డీఓలు చర్యలు తీసుకోవాలన్నారు. ఏ ఒక్క అభ్యర్థి కింద కూర్చోకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షలకు హాజరవుతున్న అంధులకు, రెండు చేతులు లేనివారికి పదో తరగతి చదివే విద్యార్థులను సహాయకులుగా ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. వీఆర్వోలకు 999 కోడ్, వీఆర్‌ఏలకు 888 కోడ్ ఉంటుందని వాటిని పరిశీలించి తగిన జాగ్రత్త వహించాల్సిందిగా ఏపీపీఎస్సీ పరిశీలకులు తెలిపారు.
అభ్యర్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో సాయిలు, కలెక్టరేట్ ఏవో శివకుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీవోలు ధర్మారావు, ముత్యంరెడ్డి, వనజాదేవి, తహశీల్దార్‌లు, ఎంపీడీవో, వ్యవసాయశాఖ అధికారులు, వివిధ కళాశాలలు, పాఠశాలల ప్రిన్సిపాల్స్, ప్రతినిధులు పాల్గొన్నారు.
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
Published Tue, Jan 28 2014 10:59 PM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM
Advertisement
Advertisement