![VRO dharna in vijayawada: Andhra pradesh](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/17/dharan.jpg.webp?itok=pyOr7jmc)
సమస్యలు పరిష్కరించాలని ఆందోళన
అక్రమ తొలగింపులు, రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్
కోర్టు తీర్పులు అమలు చేయాలని కోరుతూ ధర్నా
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): కూటమి ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపులు, అక్రమ తొలగింపులకు వ్యతిరేకంగా వెలుగు వీఓఏలు కదం తొక్కారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నినదించారు. వీఓఏల నినాదాలతో విజయవాడలోని ధర్నా చౌక్ దద్దరిల్లింది. ఆంధ్రప్రదేశ్ ఐకేపీ యానిమేటర్ల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి యానిమేటర్లు తరలివచ్చారు.
యానిమేటర్ల ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం వీఓఏలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలన్నారు. కూటమి అధికారంలోకి వచి్చన వెంటనే కాలపరిమితి సర్క్యులర్‌ను రద్దు చేస్తామని వాగ్దానం చేసిందని గుర్తుచేశారు. వీఓఏలపై పని భారం పెంచుతూ మానసిక వేదనకు గురిచేస్తున్నారని, ప్రభుత్వ విధానాలను వెంటనే మార్చాలని ఆమె డిమాండ్ చేశారు. రోజుకో రకమైన యాప్‌తో వీఓఏల జీవితాలతో అధికారులు ఆటలాడుతున్నారన్నారు.
అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు రూపాదేవి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై వీఓఏలు పెట్టుకున్న ఆశలను అడియాసలు చేయొద్దన్నారు. అక్రమంగా తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని,బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment