ఏపీ రైతు సంఘం పిలుపు
ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపాటు
సాక్షి, అమరావతి : రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైన టీడీపీ కూటమి ప్రభుత్వం పట్ల రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ జిల్లాలలో దాదాపు 80కు పైగా మండలాలు కరువు కోరల్లో చిక్కుకున్నప్పటికీ మొక్కుబడిగా 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకుందే తప్ప పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. 2023–24లో ఖరీఫ్‌తో పాటు రబీ సీజన్‌లలో వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టపోయిన 3.91 లక్షల మంది రైతులకు చెల్లించాల్సిన రూ.328 కోట్ల కరువు సాయం బకాయిలు విడుదల చేయలేదు.
ఖరీఫ్–2023 సీజన్‌లో రైతుల తరఫున రూ.930 కోట్ల ప్రీమియం బకాయిలు చెల్లించకపోవడం వల్ల రైతులకు న్యాయంగా దక్కాల్సిన రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారం అందలేదు. ఇలా రైతులకు చెల్లించాల్సిన రూ.12,563 కోట్లు ఎగ్గొట్టింది. ఈ నేపథ్యంలో రైతాంగ సమస్యలపై ఈ నెల 17న విజయవాడలో భారీ ధర్నా నిర్వహణకు ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణయ్య, కే ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి రైతుకు రూ.20 వేల పెట్టుబడి సాయం ఇస్తామన్న హామీని ఎప్పుడు అమలు చేస్తారంటూ ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఎన్నికలలో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నామని గొప్పగా చెబుతున్న చంద్రబాబు.. రైతులకు ఇచ్చిన హామీల సంగతేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. పెట్టుబడి సాయం హామీ ముఖ్యమంత్రికి గుర్తులేదా? గుర్తు ఉన్నా రైతులకు ఇవ్వటం ఇష్టం లేక అమలు చేయటం లేదా.. అన్నది స్పష్టం చేయాలన్నారు. ఈ నేపథ్యంలో రైతాంగ సమస్యల సాధనకు డిమాండ్ చేస్తూ ఈ నెల 17న విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా నిర్వహించబోతున్నామని వారు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment