విజయవాడ ధర్నా చౌక్‌లో సీహెచ్‌వోల ధర్నా
సాక్షి, అమరావతి/ గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ (విలేజ్ క్లినిక్)లో సేవలు అందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో)లు డిమాండ్ చేశారు. అదే విధంగా నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులతో సమానంగా తమకు 23శాతం వేతనాలు పెంచాలని కోరారు. ప్రతి నెలా వేతనంతోపాటు ఇన్సెంటివ్ కూడా చెల్లించాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. తమ సమస్యల పరిష్కారం కోసం విజయవాడలోని ధర్నా చౌక్‌లో సోమవారం సీహెచ్‌వోలు పెద్ద ఎత్తున ధర్నా చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విజయవాడకు చేరుకున్న సీహెచ్‌వోల ధర్నాకు పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సీహెచ్‌వోల సమస్యలపై శాసన మండలిలో ప్రస్తావిస్తానని, అదే విధంగా వైద్య శాఖ మంత్రితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఎన్‌హెచ్‌ఎం జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే 23శాతం జీతాలు పెంచాలని, లేనిపక్షంలో ఇప్పుడు ఇస్తున్న వేతనంతో పాటు ప్రతినెలా రూ.15 వేల ఇన్సెంటివ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈపీఎఫ్‌ను పునరుద్ధరించాలన్నారు. సీహెచ్‌వోల సంఘ రాష్ట్ర అధ్యక్షరాలు ప్రియాంక, ఉపాధ్యక్షుడు ప్రేమ్ కుమార్ తదితరులు మాట్లాడారు. వందలాది మంది సీహెచ్‌వోలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment