Community Health Officers
-
మా సర్వీస్‌ను రెగ్యులరైజ్ చేయాలి
సాక్షి, అమరావతి/ గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ (విలేజ్ క్లినిక్)లో సేవలు అందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో)లు డిమాండ్ చేశారు. అదే విధంగా నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులతో సమానంగా తమకు 23శాతం వేతనాలు పెంచాలని కోరారు. ప్రతి నెలా వేతనంతోపాటు ఇన్సెంటివ్ కూడా చెల్లించాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. తమ సమస్యల పరిష్కారం కోసం విజయవాడలోని ధర్నా చౌక్‌లో సోమవారం సీహెచ్‌వోలు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విజయవాడకు చేరుకున్న సీహెచ్‌వోల ధర్నాకు పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సీహెచ్‌వోల సమస్యలపై శాసన మండలిలో ప్రస్తావిస్తానని, అదే విధంగా వైద్య శాఖ మంత్రితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఎన్హెచ్ఎం జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే 23శాతం జీతాలు పెంచాలని, లేనిపక్షంలో ఇప్పుడు ఇస్తున్న వేతనంతో పాటు ప్రతినెలా రూ.15 వేల ఇన్సెంటివ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈపీఎఫ్‌ను పునరుద్ధరించాలన్నారు. సీహెచ్‌వోల సంఘ రాష్ట్ర అధ్యక్షరాలు ప్రియాంక, ఉపాధ్యక్షుడు ప్రేమ్ కుమార్ తదితరులు మాట్లాడారు. వందలాది మంది సీహెచ్‌వోలు పాల్గొన్నారు. -
గ్రామీణుల ఆరోగ్య సంరక్షణకు టాస్క్‌ఫోర్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామీణ ప్రజల ఆరోగ్య సంరక్షణ ద్వారా ఆరోగ్య రంగంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) సాధన కోసం ప్రతి గ్రామంలో ఎస్డీజీ టాస్క్‌ఫోర్స్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ స్థాయిలో కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్ (మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్– ఎంఎల్‌హెచ్‌పీ) నాయకత్వంలో ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ వర్కర్, స్కూలు హెల్త్ అంబాసిడర్, గ్రామ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ సభ్యులుగా ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా గర్బిణులు, శిశువులు, మహిళలు, పిల్లల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపం నివారణతో పాటు జీవనశైలి జబ్బుల నివారణ, చికిత్సలపై ఈ టాస్క్‌ఫోర్స్ పనిచేస్తుంది. తద్వారా ఆరోగ్య రంగంలో సుస్థిర అభివృద్ధి లక్ష్లాలను సాధించాలని ప్రభుత్వం నిర్దేశించింది. గ్రామీణ ప్రజలకు గ్రామాల్లోనే వైద్య సేవలందించాలనే ఉదాత్తమైన ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌ను ఏర్పాటు చేసింది. వీటిలో కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్ 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, స్కూల్ హెల్త్ అంబాసిడర్, స్వయం సహాయక సంఘాల సమన్వయంతో గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కృషిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రతి గ్రామంలో వీరితో ఎస్డీజీ టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విధులను ప్రభుత్వం నిర్దేశించింది. ఈమేరకు క్షేత్రస్థాయి సిబ్బందికి మార్గదర్శకాలు జారీ చేయాలని ఆయా శాఖలకు సీఎస్ సూచించారు. గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార కౌన్సిలింగ్, రక్తహీనత పర్యవేక్షణ ఐఎఫ్ఏ ట్యాబెలెట్లు పంపిణీ, నిల్వల పర్యవేక్షణను కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్ సమన్వయంతో అంగన్వాడీ వర్కర్లు నిర్వహించేలా మహిళా శిశు సంక్షేమ శాఖ తగిన ఆదేశాలు జారీ చేయాలి. అలాగే ఎస్డీజీల సాధనకు పాఠశాల విద్యా శాఖ, సెర్ప్ తగిన ఆదేశాలు జారీ చేయాలని ఆదేశించారు. ఎస్డీజీ టాస్క్‌ఫోర్స్ విధులు.. ♦ రక్తహీనత పర్యవేక్షణ, ప్రసూతి మహిళల ఆరోగ్యం, పిల్లల ఆరోగ్యం, జీవనశైలి జబ్బుల నిర్ధారణ, నివారణ, చికిత్స తదితర ఆరోగ్య కార్యకలాపాలపై ఏఎన్ఎం, అంగన్వాడీ, ఆశా వర్కర్లకు ఎంఎల్‌హెచ్‌పీ మార్గనిర్దేశం చేస్తారు ♦పాఠశాలల్లోని పిల్లల ఆరోగ్య వివరాలను పాఠశాల విద్యా శాఖ ఎంఎల్‌హెచ్‌పీకి అందించాలి. కౌమార దశలో ఉన్న బాలికలు, బరువు తక్కువగా ఉన్న పిల్లల్లో రక్తహీనతను స్కూల్ అంబాసిడర్ పర్యవేక్షించడంతో పాటు వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లతో సమన్వయం చేసుకోవాలి. రక్తహీనత గల కౌమార దశలోని బాలికలకు రోజూ ఐఎఫ్ఏ మాత్రలను పంపిణీ చేయాలి. ఇతర పిల్లలకు పోషకాహారం అందించాలి. ♦ యుక్త వయస్సులోని బాలికలకు శానిటరీ నాప్కిన్ సరఫరా వివరాలు, బరువు తక్కువగా ఉన్న పిల్లలకు మధ్యాహ్న భోజనం వివరాలను ఎంఎల్‌హెచ్‌పీకి పాఠశాల విద్యా శాఖ అందించాలి. ఫ్యామిలీ ఫిజీషియన్ ద్వారా పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేయించాలి. ఇందుకు స్కూల్ అంబాసిడర్‌తో ఎంఎల్‌హెచ్‌పీ సమన్వయం చేసుకోవాలి. ♦ అంగన్వాడీ కేంద్రాల్లో సేవల సామరŠాధ్యన్ని పెంచడంతోపాటు గ్రామాల్లో రక్తహీనత పర్యవేక్షణ, గర్భిణులకు ప్రసవానికి ముందు, ప్రసవానంతర సంరక్షణ, నులిపురుగుల నిర్మూలన మందులు పంపిణీ, ప్లిలల ఆరోగ్య సంరక్షణ, పౌష్టికాహారం అందించడం వంటి సేవలు సక్రమంగా అందేలా ఎంఎల్‌హెచ్‌పీ సమన్వయం చేసుకోవాలి. ♦ సెర్ప్ గ్రామ ఆర్గనైజేషన్ సమావేశాల్లో ఎంఎల్‌హెచ్‌పీ భాగస్వామిగా ఉంటూ జీవనశైలి జబ్బుల నివారణ, పరీక్షలు, చికిత్సలు, ఇతర అంశాలపై అవగాహన కల్పించాలి. గర్భిణిలలో రక్తహీనతకు కారణాలు, తల్లి, పిల్లలపై చూపే దుష్ప్రభావాలు వివరించి, గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి. ♦ ప్రసవానికి ముందు యాంటినేటల్ పరీక్షల సమయంలో యుఎస్‌జీ స్కానింగ్ ప్రాముఖ్యత, ఇమ్యునైజేషన్ ద్వారా రోగ నిరోధకతను పెంచడం ద్వారా వ్యాధుల నివారణపై అవగాహన కల్పించాలి. ♦ బాల్య వివాహాల నివారణ ద్వారా యుక్త వయస్సు గర్భాలను నిరోధించాలి. ♦ కుటుంబ నియంత్రణ ప్రణాళిక అమలు చేయాలి ♦ ప్రతి శుక్రవారం డ్రై డే పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలి ♦ క్షేత్రస్థాయిలో సిబ్బంది సమన్వయంతో సేవలందించేలా చూడాల్సిన బాధ్యత పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్‌కు ఉంటుంది. -
థ్యాంక్యూ సీఎం సార్
(అల్లూరి సీతారామరాజు) పాడేరు : డాక్టర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లో పనిచేస్తున్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో) హోదాకల్పిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన సీహెచ్‌వోలు పాడేరు ఐటీడీఏ ఎదుట సోమవారం థ్యాంక్యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి వారంతా కృతజ్ఞతలు తెలిపారు. థ్యాంక్యూ సీఎం సార్ నినాదాలతో ఐటీడీఏ ప్రాంగణం హోరెత్తింది. అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌వోల సంఘ ప్రతినిధులు పట్నాల దుర్గా భవానీ, కూడా అమూల్య జ్యోత్స్నరాణి, సమరెడ్డి చంద్రకళ, శరబ ఉదయశ్రీ, ఓలేసు మధుసూదన్‌రాజు, పట్నాల స్వాతి సంధ్య తదితరులు పాల్గొన్నారు. -
థ్యాంక్యూ.. సీఎం సార్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సీహెచ్ఓ) కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం కడపలోని హెడ్‌పోస్టాఫీసు సమీపంలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి, థ్యాంక్యూ సీఎం సార్ అని ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. సందీప్ కుమార్,కడప జిల్లా అధ్యక్షురాలు స్నేహబిందు, ప్రధాన కార్యదర్శి రాహుల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లుగా పనిచేస్తున్న తమను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సహకరించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి విడుదల రజనిలకు ధన్యవాదాలు తెలిపారు. వెద్య రంగంలో కీలక మార్పులు తీసుకొచ్చి ముఖ్యమంత్రికి మంచిపేరు తీసుకొస్తామని తెలిపారు –కడప కార్పొరేషన్ -
CM YS Jagan: థాంక్యూ సీఎం సార్ !
గుంటూరు మెడికల్ : కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో) హోదా కల్పించినందుకు కృతజ్ఞతగా శనివారం గుంటూరు కన్నావారితోటలో పలువురు మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు (ఎంఎల్‌హెచ్‌పీ) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు తమనంపల్లి ప్రవల్లిక, జిల్లా కార్యదర్శి పులి ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లో గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తమను నియమించిందని తెలిపారు. 14 రకాల వైద్య పరీక్షలు చేసి 67 రకాల మందుల్ని ప్రజలకు అందిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభిస్తున్న ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో తమకు కీలకమైన బాధ్యతల్ని రాష్ట్ర ప్రభుత్వం అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం అయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్‌లో తమను నియమించి మెరుగైన వైద్య సేవల్ని గ్రామీణ ప్రజలకు అందిస్తోందని వివరించారు. తమకు సీహెచ్ఓ హోదా కల్పించిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని, బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించి గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో సహ కార్యదర్శి నరేష్‌బాబు, ఉపాధ్యక్షులు అనుపమ, షైనీ మేఘన, శ్రీవాణి, కోశాధికారి మౌనిక, ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పలువురు ఎంఎల్‌హెచ్‌పీలు పాల్గొన్నారు. (చదవండి: నాటుకోడికి ఫుల్ గిరాకీ.. ఆ రుచే వేరబ్బా.. ఎంత ఆరోగ్యమో తెలుసా..? )