గ్రామీణుల ఆరోగ్య సంరక్షణకు టాస్క్‌ఫోర్స్‌ | ask Force on Rural Health Care | Sakshi
Sakshi News home page

గ్రామీణుల ఆరోగ్య సంరక్షణకు టాస్క్‌ఫోర్స్‌

Published Thu, Mar 2 2023 3:31 AM | Last Updated on Thu, Mar 2 2023 3:03 PM

ask Force on Rural Health Care - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామీణ ప్రజల ఆరోగ్య సంరక్షణ ద్వారా ఆరోగ్య రంగంలో సుస్థిర అభి­వృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) సాధన కోసం ప్రతి గ్రామంలో ఎస్‌డీజీ టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను ప్రభు­త్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

గ్రామ స్థాయిలో కమ్యునిటీ హెల్త్‌ ఆఫీసర్‌ (మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌– ఎంఎల్‌హెచ్‌పీ) నాయకత్వంలో ఏఎన్‌ఎం, ఆశా, అంగన్‌వాడీ వర్కర్, స్కూలు హెల్త్‌ అంబాసిడర్, గ్రామ ఆర్గనైజేషన్‌ ప్రెసిడెంట్‌ సభ్యులుగా ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా గర్బిణులు, శిశువులు, మహిళలు, పిల్లల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపం నివారణతో పాటు జీవనశైలి జబ్బుల నివారణ, చికిత్సలపై ఈ టాస్క్‌ఫోర్స్‌ పనిచేస్తుంది. తద్వారా ఆరోగ్య రంగంలో సుస్థిర అభివృద్ధి లక్ష్లాలను సాధించాలని ప్రభుత్వం నిర్దేశించింది.

గ్రామీణ ప్రజలకు గ్రామాల్లోనే వైద్య సేవలందించాలనే ఉదాత్తమైన ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా డాక్టర్‌ వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ను ఏర్పాటు చేసింది. వీటిలో కమ్యునిటీ హెల్త్‌ ఆఫీసర్‌ 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, స్కూల్‌ హెల్త్‌ అంబాసిడర్, స్వయం సహాయక సంఘాల సమన్వయంతో గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్ష­ణకు ప్రభుత్వం కృషిచేస్తోంది.

ఈ నేపథ్యంలోనే ప్రతి గ్రామంలో వీరితో ఎస్‌డీజీ టాస్క్‌ఫోర్స్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విధులను ప్రభుత్వం నిర్దేశించింది. ఈమేరకు క్షేత్రస్థాయి సిబ్బందికి మార్గదర్శకాలు జారీ చేయాలని ఆయా శాఖలకు సీఎస్‌ సూచించారు. గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార కౌన్సిలింగ్, రక్తహీనత పర్యవేక్షణ ఐఎఫ్‌ఏ ట్యాబెలెట్లు పంపిణీ, నిల్వల పర్యవేక్షణను కమ్యునిటీ హెల్త్‌ ఆఫీసర్‌ సమన్వయంతో అంగన్‌వాడీ వర్కర్లు నిర్వహించేలా మహిళా శిశు సంక్షేమ శాఖ తగిన ఆదేశాలు జారీ చేయాలి. అలాగే ఎస్‌డీజీల సాధనకు  పాఠశాల విద్యా శాఖ, సెర్ప్‌ తగిన ఆదేశాలు జారీ చేయాలని ఆదేశించారు.

ఎస్‌డీజీ టాస్క్‌ఫోర్స్‌ విధులు..
రక్తహీనత పర్యవేక్షణ, ప్రసూతి మహిళల ఆరోగ్యం, పిల్లల ఆరోగ్యం, జీవనశైలి జబ్బుల నిర్ధారణ, నివారణ, చికిత్స తదితర ఆరోగ్య కార్యకలాపాలపై ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు ఎంఎల్‌హెచ్‌పీ మార్గనిర్దేశం చేస్తారు
పాఠశాలల్లోని పిల్లల ఆరోగ్య వివరాలను పాఠ­శాల విద్యా శాఖ ఎంఎల్‌హెచ్‌పీకి అందించాలి. కౌమార దశలో ఉన్న బాలికలు, బరువు తక్కు­వగా ఉన్న పిల్లల్లో రక్తహీనతను స్కూల్‌ అంబాసిడర్‌ పర్యవేక్షించడంతో పాటు వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లతో సమన్వయం చేసుకో­వా­లి. రక్తహీనత గల కౌమార దశలోని బాలికలకు రోజూ ఐఎఫ్‌ఏ మాత్రలను పంపిణీ చేయాలి. ఇతర పిల్లలకు పోషకాహారం అందించాలి.
♦ యుక్త వయస్సులోని బాలికలకు శానిటరీ నాప్కిన్‌ సరఫరా వివరాలు, బరువు తక్కువగా ఉన్న పిల్లలకు మధ్యాహ్న భోజనం వివరాలను ఎంఎల్‌హెచ్‌పీకి పాఠశాల విద్యా శాఖ అందించాలి. ఫ్యామిలీ ఫిజీషియన్‌ ద్వారా పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేయించాలి. ఇందుకు స్కూల్‌ అంబాసిడర్‌తో ఎంఎల్‌హెచ్‌పీ సమన్వయం చేసుకోవాలి. 
♦  అంగన్‌వాడీ కేంద్రాల్లో సేవల సామరŠాధ్యన్ని పెంచడంతోపాటు గ్రామాల్లో రక్తహీనత పర్యవేక్షణ, గర్భిణులకు ప్రసవానికి ముందు, ప్రసవానంతర సంరక్షణ, నులిపురుగుల నిర్మూలన మందులు పంపిణీ, ప్లిలల ఆరోగ్య సంరక్షణ, పౌష్టికాహారం అందించడం వంటి సేవలు సక్రమంగా అందేలా ఎంఎల్‌హెచ్‌పీ సమన్వయం చేసుకోవాలి.
♦ సెర్ప్‌ గ్రామ ఆర్గనైజేషన్‌ సమావేశాల్లో ఎంఎల్‌హెచ్‌పీ భాగస్వామిగా ఉంటూ జీవనశైలి జబ్బుల నివారణ,  పరీక్షలు, చికిత్సలు, ఇతర అంశాలపై అవగాహన కల్పించాలి. గర్భిణిలలో రక్తహీనతకు కారణాలు, తల్లి, పిల్లలపై చూపే దుష్ప్రభావాలు వివరించి, గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి. 
♦  ప్రసవానికి ముందు యాంటినేటల్‌ పరీక్షల సమయంలో యుఎస్‌జీ స్కానింగ్‌ ప్రాముఖ్యత, ఇమ్యునైజేషన్‌ ద్వారా రోగ నిరోధకతను పెంచడం ద్వారా వ్యాధుల నివారణపై అవగాహన కల్పించాలి.
♦   బాల్య వివాహాల నివారణ ద్వారా యుక్త వయస్సు గర్భాలను నిరోధించాలి.
♦ కుటుంబ నియంత్రణ ప్రణాళిక అమలు చేయాలి
♦ ప్రతి శుక్రవారం డ్రై డే పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలి
♦   క్షేత్రస్థాయిలో సిబ్బంది సమన్వయంతో సేవలందించేలా చూడాల్సిన బాధ్యత పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌కు ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement