
పొగాకు గోడౌన్ల యజమానులంతా ఇవ్వాల్సిందే
ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ అల్టిమేటం
ప్రతి నెలా రూ.3.12 లక్షల మేర వసూళ్లకు ప్లాన్
కిలో చికెన్‌కు రూ.10 మామూళ్లివ్వాలని ఇటీవలే ఈమె భర్త హుకుం
సంపద సృష్టించాకే సూపర్ సిక్స్ అంటున్న సీఎం చంద్రబాబు
మరోవైపు మద్యం దందా, మొబిలైజేషన్ అడ్వాన్సులతో సొంతానికి సంపద సృష్టి
వినూత్న మార్గాల్లో సీఎంను అనుసరిస్తున్న టీడీపీ ప్రజాప్రతినిధులు
సాక్షి, నంద్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేమో ఓ వైపు సంపద సృష్టించాకే సూపర్ సిక్స్ అమలు చేస్తానని చెబుతూ.. మరోవైపు మద్యం దందా, ఇరిగేషన్ పనుల్లో మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట సొంతంగా సంపద సృష్టించుకుంటుంటే, టీడీపీ ప్రజాప్రతినిధులు సైతం రెండడుగులు ముందుకేసి సొంతానికి సంపద సృష్టించుకోవడానికి వినూత్న మార్గాలు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో ఆక్రమ ఆదాయ మార్గాలను అన్వేషించడంలో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో పరిస్థితి మరీ చిల్లరగా ఉంది. కిలో చికెన్‌కు రూ.10 మామూళ్లు ఇవ్వాల్సిందేనని టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ఇటీవల హుకుం జారీ చేసిన విషయంపై కలకలం సద్దుమణగక ముందే ఈ దంపతుల కన్ను గోడౌన్లపై పడింది. చదరపు అడుగుకు రూపాయి పావలా కమీషన్ ఇచ్చి తీరాల్సిందేనని స్వయంగా ఎమ్మెల్యేనే గోడౌన్ల యజమానులకు అల్టిమేటం జారీ చేశారు. సొంత పార్టీ నేతలైనా సరే కమీషన్ ఇచ్చిన తర్వాతే గోడౌన్ లీజుకు పర్మిషన్ ఇస్తామని తెగేసి చెప్పడంతో టీడీపీ నాయకులు సైతం గగ్గోలు పెడుతున్నారు.
ఆళ్లగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు సుమారు 14 వేల ఎకరాల్లో పొగాకు పంట సాగు చేశారు. ఇప్పటికే కోతలు పూర్తయ్యాయి. రైతుల వద్ద నుంచి కొన్న పొగాకును నిల్వ చేసుకునేందుకు పొగాకు కంపెనీలకు ఆళ్లగడ్డ, దొర్నిపాడు, ఉయ్యాలవాడ, ఆర్.జమ్ములదిన్నెలోని గోడౌన్లు అవసరమవుతాయి. సుమారు 2.50 లక్షల చదరపు అడుగుల స్థలం అవసరం ఉంటుంది. ఒక్కో చదరపు అడుగుకు నెలకు రూ.5.25 చొప్పున ఇస్తామని పొగాకు కంపెనీలు యజమానులకు ఆఫర్ ఇచ్చాయి.
మూడేళ్ల పాటు అగ్రిమెంట్ ఇవ్వాలని చెప్పడంతో యజమానులంతా సంతోషపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న సదరు ప్రజాప్రతినిధి ప్రతి అడుగుకు తనకు రూపాయి పావలా కమీషన్ ఇచ్చి తీరాల్సిందేనని ఖరాకండిగా చెప్పేశారు. కమీషన్ ఇవ్వకుంటే అగ్రిమెంట్ ఎలా చేసుకుంటారో చూస్తానని హెచ్చరించినట్లు యజమానులు వాపోతున్నారు.
తమకు పెద్దగా మిగిలేది ఉండదని మొరపెట్టుకున్నా వినిపించుకోలేదని సమాచారం. దీంతో చేసేది లేక ఆమె గారు అడిగిన మేరకు అడుగుకు “రూపాయి పావలా’ కమీషన్‌కు ఓకే చెప్పారు. ఈ లెక్కన ప్రతి నెలా రూ.3.12 లక్షల మేర ఎమ్మెల్యేకు ముట్టజెప్పాల్సి ఉంటుంది. ఈ విషయం స్థానికంగా రైతులందరికీ తెలియడంతో ఇంత చిల్లర వ్యవహారాలు ఎక్కడా ఉండవని స్థానికులు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment