‘ఆరుతడి’ని ప్రోత్సహించండి | Without having to be aware of paddy farmers | Sakshi
Sakshi News home page

‘ఆరుతడి’ని ప్రోత్సహించండి

Published Thu, Jan 2 2014 3:40 AM | Last Updated on Wed, Sep 5 2018 1:45 PM

Without having to be aware of paddy farmers

 సిద్దిపేట రూరల్, న్యూస్‌లైన్: రానున్న రోజుల్లో విద్యుత్, భూగర్భ జలాల సమస్యల నుంచి గట్టెక్కెందుకు ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ సూచించారు. ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదు కావడంతో రైతులు మూకుమ్మడిగా వరి సాగుకు సిద్ధమతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నా, వేసవిలో విద్యుత్ సరఫరా సమస్యలు ఎదురైతే వరి రైతాంగం నష్టపోయే అవకాశాలున్నాయని ఆమె హెచ్చరించారు. ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని ఆదర్శ రైతులను ఆమె ఆదేశించారు.

సిద్దిపేట మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన ఆదర్శ రైతులకు అవగాహన కార్యక్రమంలో ఆమె స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావుతో కలిసి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్మితా సబర్వాల్ మాట్లాడుతూ, ప్రస్తుతం పల్లెల్లో వరి నాట్లు ఉధృతంగా సాగుతున్నాయనీ, అయితే రైతులంతా వరి సాగుపైనే దృష్టి సారిస్తే రానున్న రోజుల్లో సాగునీరు, విద్యుత్ సమస్య తలెత్తే ప్రమాదం ఉన్నందున ఇంకా నార్లుపోయని రైతులతో వరి సాగును మాన్పించి, ఆరుతడి పంటల సాగు వైపునకు వారి దృష్టి మళ్లించాలని సూచించారు. ఆరుతడి పంటల విత్తనాలను రైతుల కోసం అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇంకా అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తెప్పిస్తామని హామీ ఇచ్చారు. వరి సాగు విస్తీర్ణం అమాంతంగా పెరిగిపోతే వచ్చే ఏడాది భూగర్భ జలాల మట్టం పడిపోయే ప్రమాదముందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే హరీష్‌రావు మాట్లాడుతూ, ప్రభుత్వం వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ సరఫరా చేయలేక ఇప్పుడే చేతులెత్తేసిందన్నారు.

 ప్రస్తుతం ఆరు గంటల మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారని, రానున్న రోజుల్లో సరఫరా మరింత తగ్గే అవకాశాలున్నాయన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ఆరుతడి పంటల సాగుకే మొగ్గు చూపాలన్నారు. బహిరంగ మార్కెట్లో ఆరుతడి పంటల దిగుబడులకు మంచి గిట్టుబాటు ధర లభిస్తోందన్నారు. సమావేశంలో ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఎంపీడీఓ బాలరాజు, ఏడీఏ వెంకటేశ్వర్లు, ఏఓ అనీల్ కుమార్, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులతో పాటు సుమారు 200 మంది ఆదర్శ రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement