పరిగి, న్యూస్‌లైన్ : సవాలక్ష షరతుల మధ్య రైతులు తమ ఉత్పత్తులను ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించలేకపోతున్నారు. దీంతో డీసీఎంఎస్, ఐకేపీల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కేంద్రాలు వెలవెలబోతున్నాయి. తప్పని పరిస్థితుల్లో రైతులు వ్యాపారులు, దళారులను ఆశ్రయిస్తున్నారు. ధర తక్కువైనా అమ్మేసుకుని ఇంటిదారి పడుతున్నారు. పరిగిలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేసి 15రోజులు దాటినా ఇప్పటికి కేవలం 100 క్వింటాళ్ల మక్కలు మాత్రమే కొనుగోలు చేయడం ఇందుకు ఉదాహరణ.
ఇన్ని షరతులా?
మొక్కజొన్నలు, ధాన్యానికి మద్దతు ధరను నిర్ణయిస్తూనే ప్రభుత్వం కొనుగోళ్లకు కొన్ని నిబంధనలు పెట్టింది. మొక్కజొన్నలో తేమశాతం14, ధాన్యానికి 17 శాతంలోపే ఉండాలని నిర్ణయిం చింది. ఈ నిబంధనతోనే సగం మంది రైతుల ధాన్యం తిరస్కారానికి గురవుతోంది. ఇక పండించిన ఉత్పత్తులు తమవేనని రైతులు రెవెన్యూ అధికారుల నుంచి ధ్రువీకరణ తెచ్చుకోవాలి. ఇది అదనపు తతంగం. ఈ ఇబ్బంది పడలేక రైతులు వెనకడుగు వేస్తున్నారు. ఇవన్నీ దాటుకుని తేమశాతం సరిగ్గానే ఉండి విక్రయించినా 15రోజుల తర్వాత డబ్బులు వస్తాయని చెబుతారు. కానీ నెల రోజులు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. చివరకు చెక్కు రూపంలో డబ్బులు వస్తాయి. దాన్ని తీసుకుని అకౌంట్ ఉన్న తమ బ్యాంకుకు వెళ్తే అక్కడ పాత బకాయి పట్టుకుంటారనే భయం. ఇన్ని చిక్కులు ఎందుకని చాలా మంది రైతులు షరామామూలుగా దళారుల చెంతకే చేరుతున్నారు.
మార్కెట్ మాయ
ఒక పక్క ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతుంటే వ్యవసాయ మార్కెట్, దళారుల అడ్డాలు మాత్రం ధాన్యం బస్తాలతో కళకళలాడుతున్నాయి. ఒక్కో వారం ఐదు వేల నుంచి 10 వేల క్వింటాళ్ల వరకు మక్కలు పరిగి మార్కెట్‌కు వస్తుండగా బయట రైతుల వద్దకే వెళ్లి కొనుగోలు చేసే దళారులు రోజుకు 20నుంచి 40 లారీల మక్కలు కొనుగోలు చేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్‌లో తూకాల్లో మోసం, వ్యాపారుల సిండికేట్‌తో రైతులను నిండా మునుగుతున్నారు. ఇక దళారులు ఇళ్లు, పొలాల వద్దకే వెళ్లి అడ్డగోలు ధరలతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దోచుకుంటున్నారు. పరిగికి చెందిన ఒక్కో వ్యాపారి ప్రస్తుతం రూ.5 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు మక్కల వ్యాపారం చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మక్కల మద్దతు ధర రూ.1,310 దక్కడంలేదన్నది వాస్తవం.
ధాన్యం అమ్మకాలకు అడ్డొస్తున్న షరతులు
Published Wed, Nov 6 2013 2:49 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement