జనవరిలోగా పోస్టల్ ఏటీఎంలు
సాక్షి, విజయవాడ బ్యూరో: వచ్చే జనవరి లోగా ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పరిధిలోని 16 పట్టణాల్లో పోస్టల్ ఏటీఎం మెషీన్లను ఏర్పాటు చేయనున్నట్లు చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ సంపత్ పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ నుంచి పరికరాలు రాగానే వాటిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆదివారం గుంటూరులో జరిగిన అఖిల భారత పోస్టల్ ఉద్యోగ సంఘం గ్రూప్-సీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరైన సీపీఎంజీ సంపత్.. కోర్ బ్యాంకింగ్ సిస్టమ్(సీబీఎస్) గురించి పలు వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా మొత్తం 25 వేల పోస్టాఫీసులున్నాయనీ, దశల వారీగా వీటిని కోర్ బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.
పోస్టాఫీస్‌లన్నింటినీ కంప్యూటరీకరణ చేస్తున్నామనీ, ఆఫీసులన్నింటినీ మెయిన్ సర్వర్ కిందకు తెచ్చేందుకు సీబీఎస్ పరిధిలోకి తీసుకెళ్తున్నామని తెలిపారు. దీనివల్ల ఖాతాదారులు ఎక్కడైనా నగదు విత్ డ్రా చేసుకునే సదుపాయం కలుగుతుందని వివరించారు. సోమవారం నుంచి ఆంధ్రా, తెలంగాణ సర్కిళ్ల పరిధిలోని 60 పోస్టాఫీస్‌లను సీబీఎస్ పరిధిలోకి తీసుకెళ్తున్నామని, విజయవాడ రీజియన్ పరిధిలోని 15 పోస్టాఫీస్‌లు ఇందులో ఉన్నాయని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించామన్నారు. సర్కిల్ పరిధిలోని అన్ని పోస్టాఫీస్‌లనూ సీబీఎస్ పరిధిలోకి తీసుకెళ్లడం పూర్తయితే, బ్యాంకు ఏటీఎంలతోనూ పోస్టల్ ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయం కలుగుతుందని సీపీఎంజీ సంపత్ వివరించారు.