జీఎస్టీ రేట్లను సవరించాలని నిర్ణయించిన మంత్రుల బృందం
న్యూఢిల్లీ: 20 లీటర్ల వాటర్ క్యాన్, సైకిళ్లు, నోటు పుస్తకాల ధరలు తగ్గే వీలుంది. వస్తుసేవల పన్నుల(జీఎస్టీ) రేట్ల హేతుబద్ధీకరణపై ఏర్పాటైన మంత్రుల బృందం(జీఓఎం) శనివారం పలు నిర్ణయాలు తీసుకుంది. ప్యాక్‌చేసిన 20 లీటర్ల నీళ్ల క్యాన్, సైకిళ్లు, రాసుకునే నోటుపుస్తకాలపై జీఎస్‌టీని ఐదు శాతానికి తగ్గించాలని జీఓఎం నిర్ణయించింది. ఖరీదైన చేతి గడియారాలు, షూలపై పన్నులను పెంచాలని మంత్రుల బృందం నిర్ణయించిందని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
కొన్ని వస్తువులపై పన్నులు పెంచడం ద్వారా రూ.22,000 కోట్ల ఆదాయం సమకూరవచ్చని బిహార్ ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల బృందం అంచనావేసింది. ఈ సిఫార్సులను జీఎస్టీ మంత్రిమండలి ఆమోదిస్తే సవరణల అమల్లోకి రానున్నాయి. ప్యాక్‌చేసిన 20 లీటర్ల నీళ్ల బాటిల్‌పై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ వసూలుచేస్తుండగా త్వరలో అది 5 శాతానికి దిగిరానుంది.
రూ.10వేలలోపు ధర ఉన్న సైకిళ్లపై ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ ఉండగా దానిని 5 శాతానికి తగ్గిస్తారు. నోటు పుస్తకాలపైనా 5 శాతం జీఎస్టీనే వసూలుచేయనున్నారు. కొన్నింటి ధరలు పెరిగే వీలుంది. హెయిర్ డ్రయర్లు, హెయిర్ కర్లర్లు, బ్యూటీ/మేకప్ సామగ్రిపై ప్రస్తుతం అమలవుతున్న 18 శాతం జీఎస్టీని 28 శాతానికి పెంచనున్నారు.
మంత్రుల బృందంలో ఉత్తరప్రదేశ్ ఆర్థికమంత్రి సురేశ్ ఖన్నా, రాజస్తాన్ ఆరోగ్య మంత్రి గజేంద్ర సింగ్, కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ గౌడ, కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ సభ్యులుగా ఉన్నారు. 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం శ్లాబులతో జీఎస్టీని అమలుచేస్తున్నారు. నిత్యావసరాల సరకులపై తక్కువ పన్నులను, అత్యంత విలాసవంత వస్తువులపై 28 శాతం జీఎస్టీని వసూలుచేస్తుండటం తెల్సిందే. వినియోగదారులు, మార్కెట్‌వర్గాల నుంచి వస్తున్న అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుంటూ ఎప్పటి కప్పుడు ఆయా వస్తువులను ప్రభుత్వం వేర్వేరు శ్లాబుల్లోకి మారుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment