ప్రత్యేక ఆహ్వానితులుగా పలు శాఖల ముఖ్య కార్యదర్శులు
గత కేటాయింపులపై సమీక్ష చేయనున్న బృందం
సాక్షి, అమరావతి: సీఆర్‌డీఏలో పలు సంస్థల భూ కేటాయింపుల సమస్యలను పరిశీలించడానికి మంత్రుల బృందం ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులిచ్చారు. మంత్రుల బృందంలో పయ్యావుల కేశవ్, నారాయణ, కొల్లు రవీంద్ర, సంధ్యారాణి, దుర్గేశ్, టీజీ భరత్ ఉన్నారు. మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక సీఎస్ కన్వీనర్‌గా వ్యవహరిస్తూ ఈ బృందం ప్రొసీడింగ్స్‌ను సమన్వయం చేస్తారు.
బృందంలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఆర్థిక, ప్రణాళిక, ఉన్నత విద్యా, వైద్య ఆరోగ్య, పరిశ్రమలు, యువజన సర్వీసు శాఖల ముఖ్య కార్యదర్శులు ఉన్నారు. మంత్రుల కమిటీ అప్పగించిన బాధ్యతలను వీరు నిర్వహిస్తారు. మంత్రులు బృందం ఎప్పటికప్పుడు తమ సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ బృందం ప్రధానంగా ఈ అంశాలపై దృష్టి పెట్టాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అవేంటంటే..
» సీఆర్‌డీఏలో గతంలో పలు సంస్థలకు చేసిన భూ కేటాయింపులను సమీక్షించి ఇప్పటికే ఉన్న వాటి కేటాయింపులను కొనసాగించడంపై నిర్ణయం తీసుకోవాలి. ఇందివరకే కేటాయించిన భూమి వినియోగం లేదా ఇతర అంశాలను అంచనా వేయడంతోపాటు అవసరమైన మార్పులను పరిశీలన చేయాలి.
» భూ కేటాయింపుల కోసం కొత్త అభ్యర్థనలను పరిశీలన చేసి నిర్ణయం తీసుకోవాలి. పలు రంగాల్లో ప్రపంచస్థాయి సంస్థలను గుర్తించి వాటిని అమరావతిలో తమ కార్యాకలాపాలను నెలకొల్పడానికి చర్యలు తీసుకోవాలి. సీఆర్‌డీఏ ప్రాంతంలో పలు సంస్థలకు మొత్తం భూముల కేటాయింపుల పురోగతిని పర్యవేక్షించాలి.
17 నుంచి ‘స్వచ్ఛతా హి సేవా’
ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వచ్ఛతా హి సేవా సన్నాహక కార్యక్రమం ఈ నెల14న ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో సీఎస్ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ, జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కమిటీలు ఏర్పాటు చేసి ప్రచారాన్ని పర్యవేక్షించడానికి నోడల్ అధికారిని నియమిస్తామని తెలిపారు.
తక్కువ బడ్జెట్‌తో నాణ్యమైన రోడ్లు నిర్మించాలి
తక్కువ వ్యయంతో ఎక్కువకాలం మన్నేల రోడ్లు నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని ఆర్ అండ్ బి అధికారులను సీఎస్ ఆదేశించారు. ఆ శాఖ అధికారులతో వెలగలపూడిలోని సచివాలయంలో గురువారం సీఎస్ సమీక్ష నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment