ధనాధన్‌ ‘నవంబర్‌’! | Economy grows at 8. 4percent as disruptions ease after COVID 2nd wave | Sakshi
Sakshi News home page

ధనాధన్‌ ‘నవంబర్‌’!

Published Thu, Dec 2 2021 5:05 AM | Last Updated on Thu, Dec 2 2021 5:05 AM

Economy grows at 8. 4percent as disruptions ease after COVID 2nd wave - Sakshi

భారత్‌ ఆర్థిక వ్యవస్థ నవంబర్‌లో మంచి ఫలితాలను నమోదుచేసినట్లు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. వస్తు, సేవల పన్ను వసూళ్లు, ఎగుమతులు, తయారీ రంగం ఇలా ప్రతి కీలక విభాగమూ వృద్ధిలో దూసుకుపోయింది. ఆయా రంగాలను పరిశీలిస్తే..

జీఎస్‌టీ ఆదాయం రూ.1,31,526 కోట్లు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు నవంబర్‌లో రూ.1,31,526 కోట్లుగా నమోదయ్యాయి. ఎక్సైజ్‌ సుంకం, సేవల పన్ను, వ్యాట్‌ వంటి పలు రకాల పరోక్ష పన్నులను ఒకటిగా మార్చుతూ 2017 జూలై నుంచి అమల్లోకి వచ్చిన తర్వాత, జీఎస్‌టీ ద్వారా ఈ స్థాయి వసూళ్లు జరగడం ఇది రెండవసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో వసూలయిన రూ.1,39,708 కోట్లు ఇప్పటి వరకూ భారీ వసూలుగా రికార్డయ్యింది.

కాగా, 2020 నవంబర్‌ నెలతో (1.05 లక్షల కోట్లు) పోల్చితే తాజా సమీక్షా నెల వసూళ్లలో 25 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. ఇక 2019 ఇదే నెలతో పోల్చితే వసూళ్లు 27 శాతం ఎగశాయి. వ్యాపార క్రియాశీలత మెరుగుపడ్డం, ఎకానమీ రికవరీ పటిష్టత వంటి అంశాలు తాజా సమీక్షా నెల్లో మంచి ఫలితాలకు కారణం. ఇక జీఎస్‌టీ వసూళ్లు లక్షకోట్లు పైబడ్డం కూడా ఇది వరుసగా ఐదవనెల. పన్ను ఎగవేతలను నిరోధించడానికి కేందం తీసుకుంటున్న చర్యలు ఫలితమిస్తున్నాయని,  జీఎస్‌టీ వసూళ్లు గణనీయంగా పెరగడానికి ఇదీ ఒక కారణమని ఆర్థిక శాఖ పేర్కొంది.  

అంకెల్లో చూస్తే...
► నవంబర్‌లో మొత్తం స్థూల వసూళ్లు రూ.1,31,526 కోట్లలో సెంట్రల్‌ జీఎస్‌టీ రూ.23,978 కోట్లు.
► స్టేట్‌ జీఎస్‌టీ రూ.31,127 కోట్లు.  
► ఇంటిగ్రేటెడ్‌ జీఎస్‌టీ రూ.66,815 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.32,165 కోట్లు సహా)
► సెస్‌ రూ.9,606 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలు చేసిన రూ.653 కోట్లుసహా)
ఇదిలాఉండగా, ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటన ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలల జీఎస్‌టీ వసూళ్ల అంకెల్లో సవరణ జరిగింది.


ఎగుమతులు 26 % అప్‌
భారత్‌ ఎగుమతులు నవంబర్‌లో గత ఏడాది ఇదే నెలతో పోల్చితే 26.49 శాతం ఎగశాయి. విలువ రూపంలో 29.88 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఇంజనీరింగ్, పెట్రోలియం, రసాయనాలు, మెరైన్‌ ఉత్పత్తుల వంటి పలు విభాగాలు పురోగతిలో నిలిచాయి. 2020 నవంబర్‌లో ఎగుమతుల విలువ 23.62 బిలియన్‌ డాలర్లు. ఇక దిగుమతులు 57.18 శాతం పెరిగి 53.15 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెల్లో ఈ విలువ 38.81 బిలియన్‌ డాలర్లు. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 23.27 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. వార్షికంగా చూస్తే, వాణిజ్యలోటు రెట్టింపు కావడం గమనించాల్సిన మరో అంశం.   

కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే...
► మొత్తం ఎగుమతుల్లో 28.19 శాతం వాటా ఉన్న ఇంజనీరింగ్‌ ఎగుమతులు 37% పెరిగి 8 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.  
► పెట్రోలియం ప్రొడక్ట్స్‌ ఎగుమతులు 145.3% పెరిగి 3.82 బిలియన్‌ డాలర్ల్లకు చేరాయి.  
► రత్నాభరణాల దిగుమతులు మాత్రం 11% క్షీణించి 2.4 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి.  
► సమీక్షా నెల్లో పసిడి దిగుమలు 8 శాతం పెరిగి 4.22 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.  
► పెట్రోలియం, క్రూడ్‌ ఉత్పత్తుల దిగుమతులు 132.44 శాతం పెరిగి 14.68 బిలియన్‌ డాలర్లకు చేరాయి.  
► బొగ్గు, కోక్, బ్రికెట్స్‌ దిగుమతులు 135.81% పెరిగి 3.58 బిలియన్‌ డాలర్లకు చేరాయి.  


ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకూ...
కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకూ చూస్తే ఎగుమతులు విలువ 50.71 శాతం పెరిగి 174.15 బిలియన్‌ డాలర్ల నుంచి 262.46 బిలియన్‌ డాలర్లకు ఎగసింది. కరోనా ముందస్తు సమయం 2019 ఏప్రిల్‌–నవంబర్‌తో పోల్చినా ఎగుమతులు 24 శాతం పెరగడం గమనార్హం. అప్పట్లో ఈ విలువ 211.17 బిలియన్‌ డాలర్లు.

10 నెలల గరిష్టానికి ‘తయారీ’  
భారత్‌ తయారీ రంగం నవంబర్‌లో పురోగమించింది. ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) 57.6కు ఎగసింది. అక్టోబర్‌లో ఈ సూచీ 55.9 వద్ద ఉంది. గడచిన 10 నెలల్లో ఈ స్థాయి మెరుగుదల ఇదే తొలిసారి. కాగా ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగానే పరిగణిస్తారు. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా లెక్కించడం జరుగుతుంది. దీర్ఘకాలిక సగటు 53.6కన్నా కూడా సూచీ పైన ఉండడం తాజా సమీక్షా నెల ముఖ్యాంశం. మూడు నెలల వరుస క్షీణత అనంతరం నవంబర్‌లో ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా మెరుగుపడినట్లు ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఎకనమిక్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ పాలీయానా డీ లిమా  పేర్కొన్నారు. వరుసగా ఐదు నెలల తర్వాత నిర్వహణా పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని కూడా ఆమె తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement