న్యూఢిల్లీ: భారత్ నవంబర్ ఎగుమతి–దిగుమతుల తాజా గణాంకాలు వెలువడ్డాయి. 2020 ఇదే నెలతో పోల్చితే ఎగుమతులు 27.16 శాతం పెరిగి 30.04 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక దిగుమతుల విలువ ఇదే నెల్లో 56.58 శాతం పెరిగి 52.94 బిలయన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి రెండింటిమధ్య వాణిజ్యలోటు 22.91 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది నవంబర్ వాణిజ్యలోటు 10.19 బిలియన్ డాలర్లతో పోల్చితే ఇది రెట్టింపు. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ తాజా ప్రకటనలో ముఖ్యాంశాలు..
ఎగుమతుల తీరిది...
- నవంబర్‌లో పెట్రోలియం ప్రొడక్టులు, ఇంజనీరింగ్ గూడ్స్, ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతులు గణనీయంగా పెరిగాయి.
- వార్షిక ప్రాతిపదికన పెట్రోలియం ప్రొడక్ట్స్ 154.22 శాతం పెరిగి 3.95 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతులు 37 శాతం పెరిగి 8 బిలియన్ డాలర్లకు చేరాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతులు 30 శాతం పెరిగి 1.12 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆర్గానిక్– ఆర్గానిక్‌యేతర రసాయన ఎగుమతుల విలువ 32.54 శాతం పెరిగి 2.24 బిలియన్ డాలర్లకు చేరాయి.
- సేవల ఎగుమతులు 16.88 శాతం పెరిగి 20.33 బిలియన్ డాలర్లకు చేరాయి. వస్తువులు, సేవలు కలిపితే ఎగుమతుల విలువ 22.80 శాతం ఎగసి 50.36 బిలియన్ డాలర్లకు పెరిగింది.
దిగుమతుల వరుస...
- దిగుమతుల విషయానికి వస్తే.. పసిడి విలువ 40 శాతం పెరిగి 4.22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.
- బొగ్గు,కోక్, బ్రికెట్‌లు 135.81 శాతం పెరిగి 3.57 బిలియన్ డాలర్లకు చేరాయి.
- పెట్రోలియం, క్రూడ్, సంబంధిత ఉత్పత్తుల దిగుమతులు 132.43 శాతం పెరిగి 14.67 బిలియన్ డాలర్లకు ఎగశాయి.
- వెజిటబుల్ ఆయిల్స్ దిగుమతులు 78.82 శాతం పెరిగి 1.75 బిలియన్ డాలర్లకు ఎగశాయి.
ఆర్థిక సంవత్సరంలో ఇలా...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య ఎగుమతులు 51.34 శాతం పెరిగి 263.57 బిలియన్ డాలర్లుగా నమోదుకాగా, దిగుమతులు ఇదే కాలంలో 74.84 శాతం పెరిగి 384.34 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి వాణిజ్యలోటు 120.76 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ 45.66 బిలియన్ డాలర్లు. 2022 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా నిర్దేశించుకున్న 400 బిలియన్ డాలర్ల ఎగుమతులను దేశం సాధించగలదన్న విశ్వాసాన్ని ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఈ ఏడాది రెట్టింపైన వాణిజ్యలోటు
Published Wed, Dec 15 2021 8:17 AM | Last Updated on Wed, Dec 15 2021 8:25 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment