న్యూఢిల్లీ: సేవల రంగం సెప్టెంబర్‌లో పేలవ పనితీరును ప్రదర్శించింది. హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ సెప్టెంబర్‌లో 57.7 వద్ద ముగిసింది. గడచిన 10 నెలల కాలంలో సూచీ ఇంత తక్కువ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. కొత్త వ్యాపారం, అంతర్జాతీయ అమ్మకాలు, ఉత్పత్తిలో వృద్ధి మందగించినట్లు నెలవారీ సర్వే పేర్కొంది.
తీవ్ర పోటీ పరిస్థితులు, ద్రవ్యోల్బణ సవాళ్లు, వినియోగదారుల ఎంపికలో మార్పు (ఆన్‌లైన్ సర్వీసుల్లోకి మారడం), కొత్త ఎగుమతి ఆర్డర్లలో అంతగా పెరుగుదల లేకపోవడం వంటి అంశాలు కూడా సేవల రంగం మందగమనానికి కారణమయ్యాయి. ఆగస్టులో సూచీ 60.9 వద్ద ఉంది. కాగా సూచీ 50 పైన ఉంటే దానిని వృద్ధి ధోరణిగానే పరిగణించడం జరుగుతుంది. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా భావిస్తారు. అయితే 2024లో సూచీ 60 లో పునకు పడిపోవడం సెపె్టంబర్‌లోనే మొదటిసారి.
ఇదీ చదవండి: జీరో బ్రోకరేజీలకు ఇక చెల్లు!
తయారీ–సేవలు కలిపినా డౌన్...
సేవలు–తయారీ రంగం కలగలిపిన హెచ్‌ఎస్‌బీసీ ఇండియా కాంపోజిట్ అవుట్‌పుట్ ఇండెక్స్ ఆగస్టులో 60.7 వద్ద ఉంటే, సెప్టెంబర్‌లో 58.3కు తగ్గింది. అయితే సూచీలో మందగమనం చోటుచేసుకున్నప్పటికీ, ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పన మెరుగ్గానే ఉందని, ఆగస్టు నుంచి వ్యాపార ధోరణి పటిష్టంగా ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు ఒక్క తయారీ రంగమే సెప్టెంబర్‌లో పేలవ పనితనాన్ని ప్రదర్శించింది. హెచ్‌ఎస్‌బీసీ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 56.5కు తగ్గింది. గడచిన ఎనిమిది నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో సూచీ నమోదుకావడం ఇదే తొలిసారి. ఆగస్టులో సూచీ 57.5 వద్ద ఉంది. 400 తయారీ సంస్థల ప్యానల్‌లోని పర్చేజింగ్ మేనేజర్‌లకు పంపబడిన ప్రశ్నపత్రాల ప్రతిస్పందనలను అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం ఎస్‌అండ్‌పీ గ్లోబల్ మదింపుచేసి, హెచ్‌ఎస్‌బీసీ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పీఎంఐని రూపొందిస్తుంది. భారత్ ఆర్థిక వ్యవస్థలో సేవల రంగం వాటా మెజారిటీ కాగా, పారిశ్రామిక రంగం వాటా దాదాపు 25 శాతం. ఇందులో తయారీ రంగం వాటా దాదాపు 75 శాతం.
Comments
Please login to add a commentAdd a comment