జీరో బ్రోకరేజీలకు ఇక చెల్లు! | income of the brokerage firms will decrease drastically | Sakshi
Sakshi News home page

జీరో బ్రోకరేజీలకు ఇక చెల్లు!

Published Sat, Oct 5 2024 3:42 AM | Last Updated on Sat, Oct 5 2024 6:04 AM

income of the brokerage firms will decrease drastically

సెబీ ఎఫ్‌ అండ్‌ ఓ నిబంధనల కఠినతరం ఎఫెక్ట్‌

లావాదేవీ చార్జీలు, కాంట్రాక్ట్‌ సైజు పెంపుతో ట్రేడింగ్‌ వాల్యూమ్‌కు గండి

బ్రోకరేజ్‌ సంస్థలకు భారీగా తగ్గనున్న ఆదాయం

క్యాష్‌ లావాదేవీలపై ఇప్పటికే ఏంజెల్‌ వన్‌ చార్జీల వడ్డన

త్వరలో ఇతర సంస్థలూ ఇదే బాట పట్టే అవకాశం  

ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌అండ్‌ఓ) విభాగంలో చిన్న ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో వారిని ట్రేడింగ్‌కు దూరంగా ఉంచేందుకు సెబీ రంగంలోకి దిగింది. తాజాగా నిబంధనలను మరింత కఠినతరం చేయడంతో జీరో బ్రోకరేజీ సంస్థలకు బాగానే సెగ తగలనుంది. సెబీ చర్యలు అమల్లోకి వస్తే.. డెరివేటివ్స్‌ వాల్యూమ్స్‌ పడిపోయి బ్రోకరేజీ కంపెనీల ఆదాయాలకు గండి పడుతుంది. దీంతో జీరో బ్రోకరేజీ ప్లాన్‌లకు ఇక ‘ఎక్స్‌పైరీ’ తప్పదంటున్నాయి మార్కెట్‌ వర్గాలు!

డెరివేటివ్‌ ట్రేడింగ్‌ విషయంలో సెబీ తీసుకున్న చర్యలతో జీరో బ్రోకరేజీ సంస్థల జోరుకు అడ్డకట్ట పడనుంది. ఎఫ్‌ అండ్‌ ఓ విభాగం నుంచి లభించే ఆదాయానికి చిల్లు పడుతుందన్న అంచనాలతో ఏంజెల్‌ వన్‌ ‘జీరో బ్రోకరేజీ’కి చెల్లు చెబుతున్నట్లు ప్రకటించింది. క్లయింట్ల సంఖ్య పరంగా దేశంలో మూడో అతపెద్ద బ్రోకరేజీ సంస్థగా ఇది నిలుస్తుండం విశేషం. నవంబర్‌ 1 నుంచి క్యాష్‌ మార్కెట్‌ లావాదేవీలు (షేర్ల కొనుగోలు, అమ్మకం)పై రూ.20 ఫ్లాట్‌ ఫీజు లేదా టర్నోవర్‌పై 0.1% (ఏది తక్కువైతే అది) ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఇప్పటిదాకా ఈ లావాదేవీలపై ఎలాంటి ఫీజులు లేవు. కాగా, రాబోయే రోజుల్లో ఇతర బ్రోకరేజీ సంస్థలు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ‘పరిస్థితుల మార్పుతో అతి తక్కువ ఫీజులతో బ్రోకింగ్‌ పరిశ్రమ నిలదొక్కుకోవడం అంత సులువు కాదు. ముఖ్యంగా డిస్కౌంట్‌ బ్రోకింగ్‌ సంస్థలు ఫీజులు పెంచక తప్పదు. ఎందుకంటే అవి ఎఫ్‌అండ్‌ఓ వాల్యూమ్స్‌ పైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. సెబీ నిర్ణయంతో ఆదాయాలకు కోత పడుతుంది’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఎండీ ధీరజ్‌ రెల్లి పేర్కొన్నారు.

కొన్నేళ్లుగా హవా... 

గతంలో ఓ వెలుగు వెలిగిన బ్యాంకింగ్‌ ‘బ్రోకరేజ్‌’లకు (ఐసీఐసీ డైరెక్ట్, యాక్సిస్‌ డైరెక్ట్‌ వంటివి) జీరోధా, గ్రో వంటి కొత్త తరం బ్రోకరేజీ సంస్థలు భారీగానే గండి కొట్టాయి. ముఖ్యంగా క్యాష్‌ లావాదేవీలపై జీరో బ్రోకరేజీ, ఎఫ్‌అండ్‌ఓ ట్రేడింగ్‌కు అతి తక్కువ చార్జీలు, మార్జిన్లపై లీవరేజీ వంటి ప్రయోజనాలతో బ్యాంకుల వ్యాపారాన్ని కొల్లగొట్టాయి. మరోపక్క, రిటైల్‌ ఇన్వెస్టర్లు ముఖ్యంగా యువత సరైన అవగాహన లేకుండా, అత్యాశతో ఎఫ్‌అండ్‌ఓ ట్రేడింగ్‌లో కుదేలయ్యే పరిస్థితికి దారితీస్తోంది. చిన్న ఇన్వెస్టర్లు డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌ చేయకుండా సెబీ పలు చర్యలు చేపడుతున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. 2022–24 మధ్య వ్యక్తిగత ట్రేడర్లు సగటున రూ.2 లక్షలు నష్టపోయారని.. రూ.1.8 లక్షల కోట్లు ఆవిరైందని సెబీ అధ్యయనం తేల్చింది. దీంతో ఇంకాస్త కఠిన నిబంధనలు తెచి్చంది. 

రూ. 2,000 కోట్ల చిల్లు... 

మార్కెట్‌ ఇన్‌ఫ్రా సంస్థలు (ఎంఐఐలు–ఎక్సే్చంజీలు, క్లియరింగ్‌ కార్పొరేషన్లు, డిపాజిటరీలు) మెంబర్లకు (బ్రోకర్లు) విధించే ఛార్జీ లతో సమానంగానే కస్టమర్లకు (ఇన్వెస్టర్లు, ట్రేడర్లు) కూడా చార్జీలు ఉండాలని సెబీ ఈ ఏడాది జూలైలో ఆదేశించింది. ప్రస్తుతం అధిక వాల్యూమ్‌ ఉంటే ఎంఐఐలు బ్రోకర్లకు కొంత డిస్కౌంట్‌ ఇస్తున్నాయి. ట్రేడర్లకు మాత్రం ఫ్లాట్‌ రేట్‌ అమలు చేస్తుండటంతో ఆమేరకు బ్రోకింగ్‌ కంపెనీలకు లాభం చేకూరుతోంది. అయితే, సెబీ ఏకరీతి చార్జీల నిబంధనల వల్ల బ్రోకరేజీ సంస్థల ఆదాయాల్లో రూ. 2,000 కోట్లకు పైగా చిల్లు పడుతుందని అంచనా. ముఖ్యంగా డిస్కౌంట్‌ ప్లాట్‌ఫామ్‌లపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు జీరో బ్రోకరేజీ మోడల్స్‌కు తెరపడవచ్చనేది పరిశ్రమ విశ్లేషకుల మాట! ‘ఆదాయంలో 15–20 శాతం కోత ప్రభావంతో చాలా వరకు బ్రోకరేజీలు ఈక్విటీ డెలివరీపై ఫీజు విధించవచ్చు. మధ్య, చిన్న స్థాయి బ్రోకింగ్‌ కంపెనీలకు ఈ సెగ బాగా తగులుతుంది’ అని ఫైయర్స్‌ బ్రోకరేజ్‌ కో–¸ఫౌండర్, సీఈఓ తేజస్‌ ఖోడే అభిప్రాయపడ్డారు. కాగా, బ్రోకింగ్‌ దిగ్గజం జీరోధా మాత్రం ప్రస్తుతానికి తాము షేర్ల డెలివరీపై ఎలాంటి ఫీజూ విధించబోమని స్పష్టం చేసింది. ‘మా ఆదాయంలో అత్యధిక భాగం ఇండెక్స్‌ డెరివేటివ్స్‌ ద్వారానే వస్తోంది. ఈ విభాగంలో కఠిన నిబంధనల వల్ల ఆదాయంలో 30–50 శాతం తగ్గుదలకు ఆస్కారం ఉంది’ అని జీరోధా ఫౌండర్, సీఈఓ నితిన్‌ కామత్‌ పేర్కొనడం విశేషం!   

సెబీ కీలక మార్పులు... 

  • ఇండెక్స్‌ డెరివేటివ్స్‌లో కాంట్రాక్ట్‌ కనీస విలువను రూ.15 లక్షలకు (గరిష్టంగా రూ.20 లక్షలు) పెంపు. 

  • వీక్లీ ఎక్స్‌పైరీ కాంట్రాక్టుల సంఖ్య కుదింపు, ఇంట్రాడే పొజిషన్‌ లిమిట్‌లను తప్పనిసరిగా పర్యవేక్షించడం

  • బ్రోకరేజీలు ఆప్షన్‌ ప్రీమియంను బయ్యర్ల నుంచి ముందుగానే పూర్తిగా వసూలు చేయడం. 

  • డెరివేటివ్స్‌ ఎక్స్‌పైరీ రోజున మార్జిన్ల పెంపు, క్యాలెండర్‌ 

  • స్ప్రెడ్‌ ప్రయోజనాల తొలగింపు. 

  • ఆప్షన్స్‌ ఎక్స్‌పైరీ రోజున టెయిల్‌ రిస్క్‌ కవరేజీ పెంపు. 

  • ఈ నిబంధనలు నవంబర్‌ 20 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 వరకు దశల వారీగా అమల్లోకి రానున్నాయి.

సెబీ కఠిన నిబంధనల కారణంగా మొత్తం ఎఫ్‌అండ్‌ఓ ట్రేడ్స్‌లో 60% మేర ప్రభావం ఉండొచ్చు. మా ప్లాట్‌ఫామ్‌లో డెరివేటివ్‌ ఆర్డర్లు 30% తగ్గుతాయని భావిస్తున్నాం.  – నితిన్‌ కామత్, జీరోధా ఫౌండర్, సీఈఓ  
 – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement