
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) లోటును భర్తీ చేయడానికి కేంద్రం గురువారం రూ.44,000 కోట్లను రుణంగా రాష్ట్రాలకు విడుదల చేసింది, దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ తరహా నిధుల విడుదల పరిమాణం మొత్తం రూ.1.59 లక్షల కోట్లకు చేరుకుంది. నిధులను బ్యాక్–టు–బ్యాక్ లోన్‌లుగా విడుదల చేయడం... సెస్ వసూళ్ల నుండి ఇచ్చే ద్వైమాసిక జీఎస్‌టీ పరిహారానికి అదనం. 2021–22 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ. 1.59 లక్షల కోట్ల రుణ సమీకరణలు జరపాలని, ఈ నిధులను (జీఎస్‌టీ పరిహార నిధిలో లోటు భర్తీకి) వనరుల అంతరాన్ని తీర్చడానికి ఒక బ్యాక్–టు–బ్యాక్ ప్రాతిపదికన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విడుదల చేయాలని ఈ ఏడాది మే 28వ తేదీన జరిగిన 43వ జీఎస్‌టీ అత్యున్నత నిర్ణాయక మండలి సమావేశం నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరం ఈ విధంగా ఇదే విధానం ప్రకారం రాష్ట్రాలకు కేంద్రం రూ. 1.10 లక్షల కోట్లు విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment