
సాధారణ వినియోగదారులతోపాటు నిరుపేద ఉజ్వల పథకం లబ్దిదారులకూ వర్తింపు
సీఎన్‌జీపైనా రూపాయి పెంపు
అర్ధరాత్రి నుంచే అమల్లోకి
పెట్రోల్, డీజిల్‌పై రూ. 2 ఎక్సైజ్ సుంకం
పెట్రోలియం సంస్థల నష్టాలతో ధరల పెంపు తప్పలేదన్న కేంద్రం
పెట్రో భారం సామాన్యులపై ఉండదని స్పష్టికరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఎల్పీజీ వినియోగదారులపై భారం మరింత పెరిగింది. గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ ధరను 50 రూపాయలు పెంచుతూ కేంద్రం సోమవారం నిర్ణయం తీసుకుంది. ఇది సాధారణ వినియోగదారులతో పాటు నిరుపేద ఉజ్వల పథక లబ్దిదారులకు కూడా వర్తిస్తుందని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురి వెల్లడించారు. సోమవారం అర్ధరాత్రి నుంచే పెంపు అమల్లోకి వచ్చింది.
ఎల్పీజీ విక్రయాలపై పెట్రోలియం సంస్థలు నష్టాలు మూటగట్టుకుంటున్నందున ఈ నిర్ణయం తప్పలేదన్నారు. తాజా పెంపుతో దేశ రాజధానిలో ఎల్పీజీ సిలిండర్ ధర ఉజ్వల వినియోగదారులకు రూ.503 నుంచి రూ.553కు పెరిగింది. సాధారణ వినియోగదారులకు ధర రూ.853కి చేరింది. సీఎన్‌జీ ధరలను కూడా దాదాపు నాలుగు శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఢిల్లీలో సీఎన్‌జీ ధర కిలోకు ఒక రూపాయి పెరిగి రూ.75.09కి చేరింది.
వీటితో పాటు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని కూడా కేంద్రం 2 రూపాయల చొప్పున పెంచింది. అయితే ఈ పెంపు రిటైల్ ధరలకు వర్తించబోదు. ఫలితంగా ఈ భారం సామాన్య వినియోగదారులపై పడబోదని పురి స్పష్టం చేశారు. ‘‘అంతర్జాతీయంగా చమురు ధరలు బ్యారల్‌కు 70–75 డాలర్ల నుంచి 60 డాలర్లకు తగ్గిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం విధించాలని నిర్ణయించాం.
దీనివల్ల కేంద్రానికి రూ.32 వేల అదనపు ఆదాయం సమకూరనుంది. సమీప భవిష్యత్తులో చమురు ధరలు పెరగని పక్షంలో పెట్రో ధరలను తగ్గించే అవకాశం కూడా ఉంది’’ అని మంత్రి వెల్లడించారు. తాజా నిర్ణయంతో పెట్రోల్‌పై కేంద్రం పన్నులు లీటర్‌కు రూ.21.9కి, డీజిల్‌పై రూ.15.8కి చేరాయి. భారత్‌లో పెట్రోల్, డీజిల్ వార్షిక వినియోగం 16,000 కోట్ల లీటర్లు. మన చమురు అవసరాలకు 85 శాతం దాకా దిగుమతులపైనే ఆధారపడ్డాం.
