
పశ్చిమాసియాలో పెరుగుతున్న వివాదాల నేపథ్యంలో అంతర్జాతీయంగా అధికమవుతున్న చమురు ధరలను భారత్ గమనిస్తోందని చమురు వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పురీ తెలిపారు. చమురు ధరలకు సంబంధించి ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటామన్నారు. ‘ఎగ్జిన్‌మొబిల్ గ్లోబల్ ఔట్‌లుక్ 2024’ సమావేశంలో పాల్గొని మంత్రి మాట్లాడారు. మంత్రి ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు..
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమయితే, ఆ ప్రభావం దేశంలో ఇంధన లభ్యతపై ఉంటుంది.
దేశానికి చమురు సరఫరాల్లో ఎటువంటి అవాంతరాలూ ఉండబోవని భావిస్తున్నాం.
ప్రపంచంలోని మూడో అతిపెద్ద చమురు వినియోగ, దిగుమతి దేశమైన భారత్ ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనగలదనే విశ్వాసంతో ఉన్నాం.
దేశంలో చమురు కొరత లేదు. భారతదేశ అవసరాలకు తగిన నిల్వలు, వనరులు ఉన్నాయి.
ఇదీ చదవండి: హర్ష్ గోయెంకా ఓలా స్కూటర్‌ను ఎలా వాడుతారో తెలుసా..?
మార్చిలో సగటున భారత్ దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ బ్యారల్‌కు 83 నుంచి 84 డాలర్లు ఉంటే, సెప్టెంబర్‌లో 73.69 డాలర్లకు తగ్గింది. అయితే తాజా పరిస్థితులు మళ్లీ ధరల పెరుగుదలపై ఆందోళనలను లేవనెత్తుతున్నాయి. దేశంలో పెట్రోల్–డీజిల్ ధరలు లీటర్‌కు 2 నుంచి 3 వరకూ తగ్గే వీలుందని గత వారం రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొన్న నేపథ్యంలోనే పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం గమనార్హం.