న్యూఢిల్లీ: దేశీయంగా ముడిచమురు ఉత్పత్తి గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఆగస్టులో 2.3 శాతం క్షీణించింది. అదే సమయంలో రిలయన్స్–బీపీకి చెందిన కేజీ–డీ6 క్షేత్రాల ఊతంతో సహజ వాయువు ఉత్పత్తి పెరిగింది. కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఆగస్టులో ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్‌జీసీ క్షేత్రాల్లో ఉత్పత్తి తగ్గడంతో క్రూడాయిల్ ఉత్పత్తి 2.51 మిలియన్ టన్నులకు పరిమితమైంది.
మరోవైపు సహజ వాయువు ఉత్పత్తి 20.23 శాతం పెరిగి 2.9 బిలియన్ ఘనపు మీటర్లుగా నమోదైంది. ప్రైవేట్ ఆపరేటర్ల క్షేత్రాల్లో ఉత్పత్తి 186 శాతం పెరగడం ఇందుకు దోహదపడింది. ముడిచమురును పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలుగా మారుస్తారు. భారత్ తన క్రూడాయిల్ అవసరాల్లో 85 శాతం భాగాన్ని దిగుమతి చేసుకుంటోంది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, దేశీయంగా ఉత్పత్తిని పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది.
14 శాతం అధికంగా ప్రాసెసింగ్..
ఇంధనాలకు డిమాండ్ పుంజుకుంటూ ఉండటంతో చమురు రిఫైనరీలు ఆగస్టులో 14.17 శాతం అధికంగా 18.4 మిలియన్ టన్నుల క్రూడాయిల్‌ను ప్రాసెస్ చేశాయి. ప్రభుత్వ రంగ రిఫైనరీలు 13.6 శాతం, ప్రైవేట్ రంగ రిఫైనరీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 16.4 శాతం అధికంగా ముడిచమురును శుద్ధి చేశాయి.
రిఫైనరీలు ఆగస్టులో 19.5 మిలియన్ టన్నుల మేర పెట్రోలియం ఉత్పత్తులను తయారు చేశాయి. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఇది 9 శాతం అధికం. ఇక ఏప్రిల్–ఆగస్టు మధ్య కాలంలో 12 శాతం అధికంగా 100.2 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను ఉత్పత్తి చేశాయి. రిఫైనరీలు గతేడాది ఆగస్టులో స్థాపిత సామర్థ్యంలో 76.1 శాతం స్థాయిలో పనిచేయగా.. ఈ ఏడాది 87 శాతం మేర పనిచేశాయి.
Comments
Please login to add a commentAdd a comment