న్యూఢిల్లీ: ముడి చమురు ఎక్కడ చౌకగా లభిస్తే అక్కడే కొనుగోలు చేసేందుకు ఒక సార్వభౌమ దేశంగా భారత్‌కు పూర్తి హక్కులు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. అందుకే రష్యా నుంచి చౌక క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నామని ఆయన తెలిపారు. అదే గల్ఫ్ దేశాల నుంచి మరింతగా కొనుగోలు చేసి ఉంటే ధరలు భారీగా పెరిగిపోయి ఉండేవని మంత్రి చెప్పారు. రష్యా నుంచి భారత్ భారీగా ముడిచమురును కొనుగోలు చేయడంపై పాశ్చాత్య దేశాల్లో ’అసంతృప్తి’ ఏమీ లేదని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు.
(ఇదీ చదవండి: Techlayoffs: దేశీయ ఐటీ నిపుణులకు భారడిమాండ్)
పాశ్చాత్య దేశాల ఒత్తిళ్లను పక్కనపెట్టి రష్యా నుంచి భారత్ చమురును దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘భారీ వినియోగదారుగా భారత్ అన్ని అవకాశాలనూ వినియోగించు కుంటోంది. సమీప భవిష్యత్తులోనూ ఇదే ధోరణి కొనసాగిస్తుంది. మనం రష్యా చమురును కొనుగోలు చేస్తుండటం వల్ల పాశ్చాత్య దేశాలేమీ అసంతృప్తిగా లేవు. ఎందుకంటే మనం రష్యా ఆయిల్‌ను కొనకపోతే గల్ఫ్ దేశాల నుంచి మరింతగా దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. అప్పుడు క్రూడాయిల్ రేట్లు మరింతగా పెరిగిపోయేవి‘ అని ఆయన తెలిపారు. గతంలో 27 దేశాల నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేయగా, ప్రస్తుతం మారిన పరిస్థితుల నేపథ్యంలో 39 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు మంత్రి వివరించారు.
(ఫ్లాగ్‌స్టార్ చేతికి సిగ్నేచర్ బ్యాంక్ డీల్ విలువ రూ. 22,300 కోట్లు )
గతేడాది మార్చి వరకూ భారత్‌కు రష్యా నుంచి చమురు దిగుమతులు 0.2 శాతంగానే ఉండేవి. పొరుగునే ఉన్న గల్ఫ్ దేశాలతో పోలిస్తే రష్యా నుంచి దిగుమతి చేసుకోవడం చాలా వ్యయప్రయాసలతో కూడుకున్నది కావడమే ఇందుకు కారణం. అయితే, ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించడంతో పరిస్థితులు మారి పోయాయి. రష్యా తమ క్రూడాయిల్‌ను మార్కెట్ రేటుకన్నా తక్కువకే భారత్‌కు విక్రయిస్తోంది. దీంతో ఇతర దేశాల ఒత్తిళ్లను పక్కన పెట్టి భారత్.. రష్యన్ ముడిచమురు వైపు మొగ్గు చూపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment