
జీఎస్టీతో జీరోదందాకు చెక్
వ్యాట్, టీఓటీ చెల్లించేవారే జీఎస్టీ పరిధిలోకి..
ఇంకా చేరాల్సిన వ్యాపారులు 3,382 మంది
పట్టుబడితే క్రిమినల్ కేసులే
మహబూబాబాద్ : మరికొద్ది రోజుల్లో జీఎస్టీ (వస్తు సేవల పన్ను) అమల్లోకి రానుండటంతో జీరో దందా ఇక బంద్ కానుంది. సరుకులను అంతర్రాష్ట్ర జిల్లా సరిహద్దులు దాటిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న వ్యాపారుల దందాకు ప్రభుత్వం చెక్ పెట్టనుంది. వరంగల్ డివిజన్ పరిధిలో 23,140 మంది వ్యాపారులు జీఎస్టీ పరిధిలోకి మారాల్సి ఉండగా 19,758 మంది ఇప్పటికే మారారు. ఈ నెల చివరికి మిగతా వారందరిని వస్తుసేవల పన్ను పరిధిలోకి మార్చేపనిలో వాణిజ్యపన్నుల శాఖ అధికారులు తలమునకలయ్యారు. వ్యాట్(వాల్యూ ఆడెడ్ ట్యాక్స్) టర్నోవర్ ట్యాక్స్(టీఓటీ) పన్నులు చెల్లించే వ్యాపారులు జీఎస్టీ పరిధిలో మారేందుకు కేంద్రం మార్చి 31 వరకు గడువు విధించింది. వస్తుసేవల పన్ను విధానం అమలులోకి రానుండడంతో జిల్లాలో జీరో వ్యాపారానికి చెక్ పడే అవకాశముంది. ప్రభుత్వ ఆదాయానికి తూట్లు పొడుస్తున్న వ్యాపారులు ఇక నుంచి పన్ను చెల్లింపు పరిధి నుంచి తప్పించుకోలేరు.
వ్యాట్, టీఓటీ చెల్లించే వారే జీఎస్టీ పరిధిలోకి..
రూ.10 లక్షల వ్యాపారం చేసేవారు వ్యాట్ పరిధిలోకి వస్తుండగా అంతకు తక్కువ వ్యాపారం చేసే వారు టీవోటీ పరిధిలోకి వస్తారు. నిబంధనల ప్రకారం సంవత్సరానికి రూ.20 లక్షల వ్యాపారం దాటితే జీఎస్టీ పరిధిలోకి వస్తారు. వరంగల్ డివిజన్ పరిధిలో 11 సర్కిళ్లు ఉన్నాయి. వరంగల్ డివిజన్ పరిధిలో టీఓటీలు 7,206, వ్యాట్ చెల్లించే వ్యాపారులు 20,019 మంది ఉన్నారు. వరంగల్ డివిజన్ పరిధిలోకి వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్, జనగాం, భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు రానున్నాయి. వరంగల్ డివిజన్ పరిధిలో జీఎస్టీ పరిధిలోకి 23,140 వ్యాపారులు వస్తుండగా అందులో 19,758 మంది వ్యాపారులు జీఎస్టీలోకి మారారు. ఇంక 3382 మంది వ్యాపారులు జీఎస్టీలోకి మారాల్సి ఉంది.
పట్టుబడితే క్రిమినల్ కేసులే....
జీఎస్టీ పరిధిలోకి మారకుంటే పన్ను అమల్లోకి వచ్చాక సరుకులు పట్టుబడితే ఏడు రెట్లు అపరాధ రుసుం, క్రిమినల్ కేసులు తప్పవంటున్నారు అధికారులు. రూ.20 లక్షలు దాటిన వ్యాపారులు మాత్రమే జీఎస్టీ పరిధిలోకి వస్తారు. జీఎస్టీ విధానంలో వచ్చిన వారు ఆదాయ పన్నుకు ఇచ్చే కార్డు నం బర్ ఆధారంగా సభ్యత్వ సంఖ్య ఉంటోంది. దీం తో పాన్‌కార్డు నంబర్ కొట్టగానే సదరు వ్యాపారి వాణిజ్య, ఆదాయ పన్ను వివరాలు స్పష్టంగా కన్పిస్తాయి. దీంతో పన్ను ఎగవేతకు బ్రేక్ పడనుందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నారు. గతంలో అనేక మంది వ్యాపారులు అంకెల గారడీతో లెక్కలు చూపి పెద్దమొత్తంలో పన్నులు ఎగవేసేవారు. మరి కొందరు వ్యాపారులు ఆదాయపన్ను చెల్లించి, వాణిజ్య పన్నులు ఎగవేసేవారు. ఇకపై జీఎస్టీ విధానంతో పూర్తిస్థాయిలో అరికట్టనున్నారు. వాణిజ్య ఆదాయ పన్నుల చెల్లింపులు జరిపి ప్రభుత్వానికి వేల కోట్ల ఖజానా చేరుతుందని అధికారులు పేర్కొంటున్నారు.