
ఐదేళ్లపాటు వందశాతమివ్వాలి
జీఎస్‌టీ అమలుతో రాష్ట్రాలకు ఏర్పడే నష్టం భర్తీపై విజయసాయిరెడ్డి సూచన
న్యూఢిల్లీ: వస్తుసేవల పన్ను(జీఎస్‌టీ) అమలు వల్ల ఏర్పడే నష్టాన్ని పూడ్చడానికి రాష్ట్రాలకిచ్చే నష్ట పరిహారాన్ని తొలి ఐదేళ్లపాటు 100 శాతం, 6వ ఏడాది 50 శాతం, 7వ ఏడాది 25 శాతం చొప్పున అందించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి సూచించారు. జీఎస్‌టీ సవరణ బిల్లుకు తాము మద్దతిస్తున్నామన్నారు. జీఎస్‌టీ పన్ను సంస్కరణల అమలుకు చెందిన 122వ రాజ్యాంగ సవరణ బిల్లుపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బిల్లులో క్లాజ్ 12, సబ్‌క్లాజ్ 4 ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు జీఎస్‌టీ కౌన్సిల్ ప్రత్యేక నిబంధనలను సిఫార్సులు చేస్తుందని,ఏపీని కూడా ఈ కేటగిరీలోని రాష్ట్రాల జాబితాలో చేర్చాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని ఆయన కోరారు.
జీఎస్‌టీ అమలువల్ల రాష్ట్రానికి రూ.4,700 కోట్ల మేరకు రెవెన్యూ నష్టమని ఏపీ ఆర్థికమంత్రి పేర్కొన్నారని చెబుతూ.. ఏపీని ప్రత్యేక కేటగిరీ రాష్ట్రంగా పరిగణిస్తే సమస్య పరిష్కారమవుతుందని, ఏపీకి వాటిల్లే నష్టం తగ్గుతుందని విజయసాయిరెడ్డి అన్నారు.జీఎస్‌టీ వల్ల రాష్ట్రాలకు ఏర్పడే నష్టాన్ని అంచనా వేయాలని, ఆ పద్ధతిని నిబంధనల్లో పేర్కొనాలని సూచించారు. పెట్రోలియం ఉత్పత్తులు, ఆల్కహాల్‌కు ఈ బిల్లులో మినహాయింపు ఇచ్చారని, దాదాపుగా అన్నిరాష్ట్రాల విద్యుత్ బోర్డులు నష్టాల్లో ఉన్నాయని, అందువల్ల రాష్ట్రప్రభుత్వాలు వసూలు చేస్తున్న విద్యుత్ సుంకానికి కూడా మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరారు.