జీఎస్‌టీ.. కాస్త టైమ్ పడుతుంది: కేంద్ర మంత్రి
జీఎస్‌టీ.. కాస్త టైమ్ పడుతుంది: కేంద్ర మంత్రి
Published Tue, Aug 29 2017 9:56 AM | Last Updated on Sun, Sep 17 2017 6:06 PM
సాక్షి, న్యూఢిల్లీ: పరోక్ష పన్నుల వ్యవస్థకు పుల్ స్టాప్ పెడుతూ ఒక దేశం ఒక పన్ను విధానం పేరిట కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను (గూడ్స్ అండ్ సేల్స్ టాక్స్-జీఎస్‌టీ) జూలై 1 నుంచి అమలులోకి తెచ్చింది. సత్ఫలితాల మాట ఏమోగానీ గందరగోళంగా ఉందంటూ ఇప్పటికీ విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే కొత్త కోడలు లాంటి జీఎస్‌టీ అలవాటు పడాలంటే కొంత సమయం పడుతుందని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సోమవారం సాయంత్రం ఢిల్లీలో నారెడ్కో(NAREDCO) నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి కోసమే జీఎస్‌టీని మోదీ సర్కార్ తీసుకొచ్చిందని తెలిపారు. ‘కొత్తగా ఓ కుటుంబంలోకి వచ్చిన కోడలికి సర్దుకుపోవటానికి కాస్త సమయం పడుతుంది. తర్వాతే ఆ కుటుంబం అభివృద్ధి చెందటం ప్రారంభిస్తుంది. అలాగే జీఎస్‌టీ కూడా దేశానికి కొత్త కోడలు లాంటిదే. ఆర్థిక పురోగతి కోసమే సరైన సమయంలో జీఎస్‌టీని కేంద్రం తీసుకొచ్చింది. దాని ఫలితం మున్ముంది కనిపిస్తుంది’ అని అర్జున్ రామ్ తెలిపారు.
జీఎస్‌టీ గురించి ప్రజలకు ఇంకా స్పష్టమైన అవగాహన రాలేదని ఎస్‌బీఐ మేనేజింగ్ డైరక్టర్ రజనీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్పందించారు. నోట్ల రద్దుతో ఆర్థిక సంస్కరణలు మొదలుపెట్టిన కేంద్రం జీఎస్‌టీతో ఈ యేడాది మరో కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. జీఎస్‌టీతో పరోక్షంగా ప్రజలపై భారం పడకుండానే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సెక్టార్ లో అది ఎక్కువగా ఉండబోతుందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో బ్యాంకర్లు చేసిన పలు సూచనలను జీఎస్‌టీ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి అర్జున్ రామ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
Advertisement