
న్యూఢిల్లీ: కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈయన పేరును సుప్రీంకోర్టు జడ్జిగా సిఫార్సుచేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం మార్చి ఆరో తేదీన నిర్ణయించడం తెల్సిందే. జస్టిస్ బాగ్చీని సుప్రీంకోర్టు జడ్జిగా నియమిస్తున్నట్లు న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో సోమవారం ఒక పోస్ట్‌చేశారు. 1966 అక్టోబర్ మూడున జన్మించిన ఈయన సుప్రీంకోర్టులో ఆరేళ్లపాటు జడ్జిగా కొనసాగనున్నారు. ఈ కాలంలోనే పదోన్నతి పొంది సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిగానూ సేవలందించే అవకాశముంది. జస్టిస్ కేవీ విశ్వనాథన్ 2031 మే 25వ తేదీన రిటైర్ అయ్యాక జస్టిస్ బాగ్చీ సీజేఐగా సేవలందించే వీలుంది.
ఈయన 2031 అక్టోబర్ రెండోతేదీన పదవీవిరమణ చేస్తారు. హైకోర్టు జడ్జీలు 62 ఏళ్లకు, సుప్రీంకోర్టు జడ్జీలు 65 ఏళ్లకు రిటైరవుతారు. 2011 జూన్ 27వ తేదీన ఈయన కలకత్తా హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. తర్వాత 2021 జనవరి నాలుగోతేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీఅయ్యారు. అదే ఏడాది నవంబర్ 8న తిరిగి కలకత్తా హైకోర్టుకు బదిలీఅయ్యారు. అప్పట్నుంచీ అదే హైకోర్టులో సేవలందిస్తున్నారు. కలకత్తా హైకోర్టులో మొత్తంగా 13 ఏళ్లు పలు రకాల కేసులకు సంబంధించిన కీలక తీర్పులు వెలువర్చారు. సుప్రీంకోర్టులో జడ్జిగా ప్రమాణస్వీకారం చేశాక కోర్టులో జడ్జీల సంఖ్య 33కు పెరుగుతుంది. రాజ్యాంగం నిర్దేశించిన పరిమితి ప్రకారం సుప్రీంకోర్టులో గరిష్టంగా 34 మంది జడ్జీలు ఉండొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment