కొత్త రేటు ముద్రించకుంటే జైలుకే..
♦ జీఎస్టీ అనంతర ధరలపై కంపెనీలకు కేంద్రం హెచ్చరిక
న్యూఢిల్లీ: జీఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కంపెనీలు ఇప్పటిదాకా మిగిలిపోయిన స్టాక్‌పై తప్పనిసరిగా కొత్త రేట్లను ముద్రించే విక్రయించాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. అలా చేయని పక్షంలో రూ. లక్ష దాకా జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించారు. జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన దరిమిలా కొన్ని ఉత్పత్తుల ధరలు పెరగ్గా, కొన్నింటి రేట్లు తగ్గిన సంగతి తెలిసిందే.
నిబంధనలకు అనుగుణంగా కొత్త రేటును ముద్రించకపోతే.. తొలి ఉల్లంఘన కింద రూ. 25,000, రెండోసారి రూ. 50,000, ఆ తర్వాత మూడోసారి రూ. లక్ష దాకా పెనాల్టీ, ఏడాది జైలు శిక్ష విధించే అవకాశం ఉందని పాశ్వాన్ చెప్పారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తేదీ నాటికి అమ్ముడు కాకుండా మిగిలిపోయిన స్టాక్‌ను కొత్త ఎంఆర్పీతో (గరిష్ట చిల్లర ధర) సెప్టెంబర్ దాకా విక్రయించుకునేందుకు తయారీ కంపెనీలకు కేంద్రం వెసులుబాటునిచ్చిన సంగతి తెలిసిందే.
‘అమ్ముడు కాని ఉత్పత్తులపై మారిన రేట్లను రీప్రింట్ చేయాలని కంపెనీలకు ఆదేశించాం. జీఎస్టీ తర్వాత వచ్చిన మార్పుల గురించి వినియోగదారులకు తెలిసేలాగా కొత్త ఎంఆర్పీ స్టిక్కర్లు అతికించాలని సూచించాం‘ అని పాశ్వాన్ విలేకరులకు చెప్పారు. ఆర్థిక, వినియోగదారుల వ్యవహారాల శాఖలు ఇటు వినియోగదారులు, అటు వర్తకుల ఆందోళనలు, సమస్యలను పరిష్కరించేందుకు తగు వ్యవస్థలు ఏర్పాటు చేశాయని పేర్కొన్నారు.