![Hike in oil prices due to free Covid vaccines, water costlier than petrol - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/12/teli.jpg.webp?itok=oEJohh8L)
న్యూఢిల్లీ: దేశంలో కరోనాటీకా ఉచితంగా ఇస్తున్నందునే పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయని పెట్రోలియం, సహజవాయు శాఖా సహాయ మంత్రి రామేశ్వర్ తెలి వ్యాఖ్యానించారు. ఒక లీటర్ పెట్రోలు కన్నా ఒకలీటర్ హిమాలయన్ నీటి ధర అధికమన్నారు. పెట్రోల్ అంత ఖరీదేమీ కాదని, కేంద్ర, రాష్ట్రాలు పన్నులు విధించడం వల్ల ఖరీదైందని చెప్పారు. ప్రజలందరికీ కరోనా టీకా ఉచితంగా ఇస్తున్నారని, ఇందుకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. ప్రభుత్వాలు విధించే పన్నులతోనే టీకాలు కొంటున్నామన్నారు.
130 కోట్ల మందికి ఉచితంగా టీకాలివ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని, ఒక్కో టీకా సుమారు రూ.1,200 అవుతుందని గుర్తు చేశారు. లీటరు పెట్రోలు ఖరీదు సుమారు రూ. 40 ఉండొచ్చని, దీనిపై వ్యాట్ తదితర పన్నులు వేస్తారని వివరించారు. ఒక లీటర్ హిమాలయన్ బాటిల్ ఖరీదు రూ.100 ఉంటోందని గుర్తు చేశారు. అంతేకాకుండా క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్‌ను బట్టి మారుతుంటాయని తెలిపారు. చమురు ధరలను తమ శాఖ నిర్ణయించదని, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయ ధరలు మారేలా గతంలో వాణిజ్య శాఖ నిర్ణయం తీసుకుం దని చెప్పారు. రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని, కానీ విపక్షపాలిత రాష్ట్రాలు పన్ను తగ్గించకుండా తమపై నింద మోపాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఇటీవలే తమ శాఖ నిధులను ఆరోగ్య శాఖకు కోవిడ్ కోసం మరలించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment