free vaccinnes
-
ఉచిత వ్యాక్సినేషన్ వల్లనే పెట్రో మంట!
న్యూఢిల్లీ: దేశంలో కరోనాటీకా ఉచితంగా ఇస్తున్నందునే పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయని పెట్రోలియం, సహజవాయు శాఖా సహాయ మంత్రి రామేశ్వర్ తెలి వ్యాఖ్యానించారు. ఒక లీటర్ పెట్రోలు కన్నా ఒకలీటర్ హిమాలయన్ నీటి ధర అధికమన్నారు. పెట్రోల్ అంత ఖరీదేమీ కాదని, కేంద్ర, రాష్ట్రాలు పన్నులు విధించడం వల్ల ఖరీదైందని చెప్పారు. ప్రజలందరికీ కరోనా టీకా ఉచితంగా ఇస్తున్నారని, ఇందుకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. ప్రభుత్వాలు విధించే పన్నులతోనే టీకాలు కొంటున్నామన్నారు. 130 కోట్ల మందికి ఉచితంగా టీకాలివ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని, ఒక్కో టీకా సుమారు రూ.1,200 అవుతుందని గుర్తు చేశారు. లీటరు పెట్రోలు ఖరీదు సుమారు రూ. 40 ఉండొచ్చని, దీనిపై వ్యాట్ తదితర పన్నులు వేస్తారని వివరించారు. ఒక లీటర్ హిమాలయన్ బాటిల్ ఖరీదు రూ.100 ఉంటోందని గుర్తు చేశారు. అంతేకాకుండా క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్‌ను బట్టి మారుతుంటాయని తెలిపారు. చమురు ధరలను తమ శాఖ నిర్ణయించదని, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయ ధరలు మారేలా గతంలో వాణిజ్య శాఖ నిర్ణయం తీసుకుం దని చెప్పారు. రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని, కానీ విపక్షపాలిత రాష్ట్రాలు పన్ను తగ్గించకుండా తమపై నింద మోపాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఇటీవలే తమ శాఖ నిధులను ఆరోగ్య శాఖకు కోవిడ్ కోసం మరలించామన్నారు. -
ఉచిత వ్యాక్సినేషన్, రేషన్.. కేంద్రంపై రూ.1.45 లక్షల కోట్ల భారం
న్యూఢిల్లీ: ఉచిత వ్యాక్సినేషన్ అలాగే కరోనా సెకండ్ వేవ్‌తో తీవ్రంగా నష్టపోయిన పేద ప్రజలకు ఆహార ధాన్యాల పంపిణీల విషయంలో కేంద్రంపై రూ.1.45 లక్షల కోట్ల అదనపు భారం పడనుందని మంగళవారం నిపుణులు విశ్లేషించారు. 18 ఏళ్లు దాటిన వయోజనులందరికీ వ్యాక్సిన్ ఖర్చును కేంద్రమే భరిస్తుందని సోమవారం ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 21 నుంచి దేశ వ్యాప్తంగా దీనిని అమలు చేయనున్నట్లు ప్రధాని తెలిపారు. ఇక పేదలకు నవంబర్ వరకూ ఉచిత రేషన్‌ను ఇవ్వనున్నట్లూ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన పేర్కొన్నారు. ప్రధాని ప్రకటనకు సంబంధించి ఈ అంశంతో సంబంధం ఉన్న ఉన్నత స్థాయి నిపుణుల విశ్లేషణలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ►వయోజనులకు ఉచిత వ్యాక్సినేషన్ వ్యయం రూ.45,000 కోట్ల నుంచి రూ.50,000 కోట్ల మధ్య ఉంటుంది. కేంద్రం 2021–22 బడ్జెట్లో కేటాయించిన రూ.35,000 కోట్లకన్నా ఇది అధికం. అంటే వ్యాక్సినేషన్‌పై ప్రధాని తాజా ప్రకటనతో పడే అదనపు భారం దాదాపు రూ.15,000 కోట్లన్నమాట. ►ఇక ఐదు కేజీల గోధుమలు లేదా బియ్యం, కేజీ పప్పు ధాన్యాలు నెలనెలా నవంబర్ వరకూ దాదాపు 80 కోట్ల మంది లబ్దిదారులకు అందిస్తే, ఈ వ్యయం దాదాపు రూ.1.1 లక్షల కోట్లు రూ.1.3 లక్షల కోట్ల మధ్య ఉంటుంది. నిజానికి ఉచిత రేషన్ జూన్ వరకూ అమలు జరుగుతోంది. దీనిని నవంబర్ వరకూ పొడిగిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ►పై రెండు ప్రయోజనాలనూ పరిగణనలోకి తీసుకుంటే కేంద్రంపై బడ్జెట్ కేటాయింపులు కాకుండా అదనంగా రూ.1.45 లక్షల కోట్ల వ్యయ భారం పడుతుంది. ►ప్రభుత్వ ఆదాయాలకు సంబంధించి జరుగుతున్న విశ్లేషణలను పరిశీలిస్తే, కఠిన ద్రవ్య పరిస్థితులతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న కేంద్రానికి ఆర్బీఐ రూ.99,122 కోట్ల డివిడెండ్ బదలాయింపులు ఇప్పటికే పెద్ద ఊరట. అంచనాలకన్నా ఇది అదనం. ఆర్బీఐ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి కేవలం రూ.53.511 కోట్లు అందుబాటులోకి వస్తాయని 2021–22 బడ్జెట్ అంచనావేసింది. అంచనాలకు భిన్నంగా మార్చి 31వ తేదీతో ముగిసిన తొమ్మిది నెలల ‘అకౌంటింగ్ కాలంలో’ మార్కెట్ ఆపరేషన్లు, పెట్టుబడులు తాను పొందిన మొత్తంలో వ్యయాలుపోను మిగులును కేంద్రానికి ఆర్బీఐ బదలాయించాలని సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇక పెట్రోల్, డీజిల్ రికార్డు పన్నుల నుంచి కేంద్రానికి భారీ ఆదాయం ఒనగురుతోంది. ఈ రెండింటి ద్వారా వచ్చే ఆదాయాలు ఉచిత వ్యాక్సినేషన్, ఆహార ధాన్యాల పంపిణీ వ్యయాలకు దాదాపు సరిపోతుందని అంచనా. ►వ్యాక్సినేషన్లు ఎలా, ఎక్కడ నుంచి పొందుతారన్న విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం భారత్ సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న ఆస్ట్రాజనికా వ్యాక్సిన్‌ను, అలాగే దేశీయంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చెందిన మరో వ్యాక్సిన్‌ను వినియోగిస్తోంది. దీనికితోడు రష్యా అభివృద్ధి చేసిన స్పూత్నిక్ వీ వ్యాక్సినేషన్‌ను కూడా ఈ నెల్లో దేశంలో ప్రారంభించనున్నారు. అదనపు వ్యాక్సిన్ల కొనుగోలుకు కేంద్రం ఇతర విదేశీ వ్యాక్సిన్ తయారీ కంపెనీలతో చర్చిస్తోంది. దేశంలో జనవరి 16న వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. తొలుత పూర్తి నత్తనడకగా ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం సెకండ్ వేవ్ ఆందోళనలతో ప్రస్తుతం కొంత ఊపందుకుంది. 23 కోట్ల డోస్‌ల వ్యాక్సినేషన్లు జరిగాయి. ►సెకండ్ వేవ్‌లో మే 7న 4,14,188 కేసుల గరిష్టాన్ని తాకిన కేసులు తాజాగా లక్ష దిగువకు పడిపోయాయి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కర్ఫ్యూలు, లాక్డౌన్లు విధించడం దీనికి కారణం. ఈ పరిస్థితుల్లో భారత్ ఎకానమీ వృద్ధి 2021–22 ఆర్థిక సంవత్సరంలో 7.9 శాతం నుంచి 9.5 శాతం మధ్య పరిమితం అవుతుందని అంచనాలు ఉన్నాయి. మూడవ వేవ్ ఆందోళనల నేపథ్యంలో ప్రస్తుత లాక్డౌన్ల... ఆన్‌లాకింగ్ ప్రక్రియపై ఆచితూచి వ్యవహరించాలని రాష్ట్రాలకు సూచనలు అందుతున్నాయి. ►మహమ్మారి సెకండ్‌వేవ్ విజృంభించడానికి కేవ లం కొద్ది వారాల ముందు మార్చిలో ‘కోవిడ్– 19 మహమ్మారికి భారత్‌లో –ఎండ్‌గేమ్– పడుతు న్నట్లే’ అంటూ కేంద్రం ఆర్థిక మంత్రి హర్‡్షవర్థన్ చేసిన ప్రకటన అలాగే ఈ ప్రకటన ద్వారా భారత్ ఇతర దేశాలకు వైద్య వనరుల ఎగుమతులు, ప్రత్యేకించి 19.3 కోట్ల డోస్‌లను ఇతర దేశాలకు ఎగుమతులు తీవ్ర విమర్శకు కారణమైంది. ►ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆహార సబ్సిడీ రూ.2.42 లక్షల కోట్లపైగా ఉంటుందని అంచనా. సవరిత అంచనాల ప్రకారం 2020– 21లో ఈ పరిమాణం రూ.4.22 లక్షల కోట్లు. -
Narendra Modi: ఇక టీకా.. ఫ్రీ
న్యూఢిల్లీ: దేశ టీకా విధానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. అర్హులైన దేశ ప్రజలందరికీ కేంద్రమే ఉచితంగా కోవిడ్ టీకా అందిస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికి జూన్ 21 నుంచి ఉచితంగా టీకా అందించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు టీకా డోసులను రాష్ట్రాలకు పంపిస్తామన్నారు. దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం ప్రసంగించారు. ‘రాష్ట్రాల వాటా అయిన 25% టీకాలను కేంద్రమే సేకరించి, రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కేంద్రానికి, రాష్ట్రాలకు రెండు వారాల సమయం పడుతుంది. జూన్ 21 నుంచి రాష్ట్రాలకు ఉచితంగా టీకాలను పంపించే కార్యక్రమం ప్రారంభిస్తాం. ఈ కార్యక్రమం కింద 18 ఏళ్లు పైబడిన అందరికీ ఉచితంగా టీకా లభిస్తుంది’ అని వివరించారు. కేంద్ర ప్రభుత్వ టీకా విధానంపై పలు రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వ్యాక్సినేషన్ బాధ్యత కేంద్రమే తీసుకోవాలని లేఖలు రాసిన విషయం తెలిసిందే. మరోవైపు, సుప్రీంకోర్టు పలుమార్లు కేంద్ర ప్రభుత్వ టీకా విధానంలో లోపాలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని ప్రసంగం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రాల వాటా అయిన 25% సహా మొత్తం 75% టీకాలను కేంద్రమే టీకా ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. వాటిని రాష్ట్రాలకు ఉచితంగా అందజేస్తుందని తెలిపారు. మిగతా 25% టీకాలను ప్రైవేటు ఆసుపత్రులు సొంతంగా కొనుగోలు చేసుకోవచ్చన్నారు. వ్యాక్సిన్ నిర్ధారిత ధరపై ఆసుపత్రులు విధించే సర్వీస్ చార్జ్ ఒక్కో డోసుకు, రూ. 150కి మించకూడదని స్పష్టం చేశారు. దేశంలో ప్రస్తుతం ఏడు కంపెనీలు కరోనా టీకాలను ఉత్పత్తి చేస్తున్నాయని, మరో మూడు టీకాలు త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు. విదేశాల్లోని ఫార్మా సంస్థల నుంచి టీకాలను కొనుగోలు చేసే ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. కరోనా మూడో వేవ్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందన్న హెచ్చరికల నేపథ్యంలో.. పిల్లల కోసం రెండు వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయన్నారు. ముక్కు ద్వారా స్ప్రే చేసే టీకాను అభివృద్ధి చేసే పరిశోధనలు త్వరితగతిన జరుగుతున్నాయని, ఆ టీకా అందుబాటులోకి వస్తే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతమవుతుందని తెలిపారు. టీకాలపై అబద్దాలను ప్రచారం చేసేవారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కారణం ఇదే కేంద్ర ప్రభుత్వ టీకా విధానంపై విమర్శలు చేసిన వారిపై మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీకా విధానంలో తాజా మార్పునకు కారణం వివరిస్తూ.. ‘జనవరి 16 నుంచి ఏప్రిల్ చివరి వరకు వ్యాక్సినేషన్ కార్యక్రమం కేంద్రం ఆధ్వర్యంలోనే సజావుగా సాగింది. అర్హులైనవారంతా క్రమశిక్షణతో టీకాలు తీసుకున్నారు. ఇంతలో టీకా కార్యక్రమాన్ని వికేంద్రీకరించాలన్న డిమాండ్స్ వచ్చాయి. కేంద్రమే అన్నీ నిర్ణయిస్తుందా?, ఒక వయస్సు వారికే ప్రాధాన్యత ఎందుకు? అని కొందరు ప్రశ్నించారు. ఇంకా చాలా రకాలైన ఒత్తిళ్లు వచ్చాయి. మీడియాలోని ఒక వర్గం కూడా దీన్నో ప్రచారంలా చేపట్టింది. దాంతో, అందరి అభిప్రాయాలు తీసుకుని రాష్ట్రాల డిమాండ్‌కు అంగీకరించాలని నిర్ణయం తీసుకున్నాం. మే 1వ తేదీ నుంచి 25% టీకాలను రాష్ట్రాలే తీసుకునే వెసులుబాటు కల్పించాం. కానీ, ఆ తరువాత కొన్ని రోజులకే రాష్ట్రాలకు సమస్య అర్థమైంది. ఇంతపెద్ద కార్యక్రమం చేపట్టడంలోని కష్టాలు అర్థమయ్యాయి. తరువాత, రెండు వారాలకే పాత విధానమే మేలు అని కొన్ని రాష్ట్రాలు అంగీకరించాయి. క్రమంగా దాదాపు అన్ని రాష్ట్రాలు అదే విషయం చెప్పసాగాయి. టీకా విధానంపై పునరాలోచన చేయాలని కోరాయి. దాంతో, దేశ ప్రజలు ఇబ్బంది పడకూడదని, వ్యాక్సినేషన్ కార్యక్రమం సజావుగా సాగాలనే ఉద్దేశంతో.. మే 1 వ తేదీకి ముందున్న విధానాన్నే మళ్లీ అమలు చేయాలని నిర్ణయించాం’ అన్నారు. ఆక్సిజన్ డిమాండ్ ఊహించలేదు రెండో వేవ్ ఉధృతంగా ఉన్న ఏప్రిల్, మే నెలల్లో మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ ఊహించనంతగా పెరిగిందని, ఆ స్థాయిలో ఆక్సిజన్ డిమాండ్ గతంలో ఎన్నడూ లేదని ప్రధాని తెలిపారు. ఆ స్థాయిలో ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు మొత్తం ప్రభుత్వ యంత్రాంగమంతా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిందన్నారు. నేవీని, వైమానిక దళాన్ని కూడా రంగంలోకి దింపామని, ప్రత్యేకంగా ఆక్సిజన్ రైళ్లను నడిపామని గుర్తు చేశారు. స్వల్ప వ్యవధిలోనే లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని 10 రెట్లు పెంచగలిగామన్నారు. నిర్లక్ష్యం వద్దు సెకండ్ వేవ్ విజృంభణ అనంతరం కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్డౌన్ ఆంక్షల్లో సడలింపులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సడలింపులను అవకాశంగా తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ప్రధాని ప్రజలకు ఉద్బోధించారు. నిబంధనలను పాటించడమే వైరస్‌ను ఎదుర్కొనే శక్తిమంతమైన ఆయుధమన్నారు. ‘ఆంక్షల్లో సడలింపులను ఇస్తున్నారు అంటే అర్థం వైరస్ ముప్పు పూర్తిగా తొలగిపోయిందని కాదు. ఎప్పటికప్పుడు రూపం మారుస్తున్న కరోనాపై ఇప్పటికీ చాలా అప్రమత్తంగా ఉండాలి. మాస్క్, భౌతికదూరం తదితర కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలి’ అని సూచించారు. కరోనాపై మనం కచ్చితంగా విజయం సాధిస్తామన్నారు. టీకాతోపాటు 6 వేలు ఇవ్వండి ప్రధాని ప్రకటనపై ఎన్డీయే నేతలు హర్షం వ్యక్తం చేయగా, టీకా విధానంలో గందరగోళానికి ఇకనైనా తెరవేయాలని కాంగ్రెస్ కోరింది. ఉచితంగా టీకా ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 6 వేలు జమ చేయాలని డిమాండ్ చేసింది. మరోవైపు, సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యల కారణంగానే ప్రధాని ఈ ప్రకటన చేశారని సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ చేశారు. ‘సుప్రీం’ వ్యాఖ్యల వల్లనేనా? కేంద్ర ప్రభుత్వం మళ్లీ కేంద్రీకృత టీకా విధానం వైపు వెళ్లడానికి ఇటీవల సుప్రీంకోర్టు చేసిన ఘాటు వ్యాఖ్యలే కారణమన్న వాదన వినిపిస్తోంది. కేంద్రానికి, రాష్ట్రాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు టీకా ధరల్లో వ్యత్యాసం, కోవిన్ యాప్‌లో తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలనే నిబంధన, వయస్సుల వారీగా టీకాలివ్వాలన్న విధానంలో హేతుకత.. తదితర అంశాలపై జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించింది. వ్యాక్సిన్ కోసం బడ్జెట్లో కేటాయించిన రూ. 35 వేల కోట్లలో ఎంత మొత్తాన్ని, ఎలా ఖర్చు చేశారో వివరించాలని ఆదేశించింది. టీకా విధానాన్ని పునఃపరిశీలించాలని కోరింది. దేశంలో కోవిడ్ స్థితిగతులపై విచారణను సుమోటోగా సుప్రీం తీసుకుంది. ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ వర్కర్స్కు, 45 ఏళ్ల వయస్సు పైబడిన వారికి తొలి విడతలో కేంద్రం ఉచితంగా టీకా ఇచ్చింది. ఆ తరువాత వ్యాక్సినేషన్ కార్యక్రమంలో రాష్ట్రాలకు భాగస్వామ్యం కల్పిస్తూ సరళీకృత విధానం ప్రారంభించింది. సత్తా చూపాం అత్యంత స్వల్ప వ్యవధిలో దేశీయంగా రెండు టీకాలను అభివృద్ధి చేసి భారత్ తన సత్తా నిరూపించుకుందని ప్రధాని తెలిపారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అర్హులైనవారికి 23 కోట్ల టీకా డోసులు వేశారన్నారు. గతంలో విదేశాల్లో టీకాలు అభివృద్ధి చెంది, అందుబాటులోకి వచ్చిన దశాబ్దాల తరువాత భారతీయులకు అవి లభించేవని ప్రధాని గుర్తు చేశారు. కొన్ని వ్యాధులకు వేరే దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసే సమయానికి, భారత్‌లో ఆ కార్యక్రమం ప్రారంభమయ్యేదన్నారు. గత 5, 6 ఏళ్లలో ఆ పరిస్థితి మారిందన్నారు. ‘అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ.. కోవిడ్‌ను ఎదుర్కొనే టీకాను సరైన వ్యూహం, ప్రణాళికతో, స్పష్టమైన విధానంతో, పట్టుదలతో ముందుకు వెళ్లి... ఒకటి కాదు, రెండు వ్యాక్సిన్లను స్వల్ప వ్యవధిలోనే దేశీయంగా అభివృద్ధి చేయగలిగాం’ అన్నారు. గత వందేళ్లలో మానవాళి ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభం ఈ మహమ్మారేనన్న ప్రధాని.. దీనిపై భారత్ బహుముఖ పోరు సల్పుతోందన్నారు. యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రులను, ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశామని, ఐసీయూ బెడ్స్‌ను, ఆక్సిజన్ ఉత్పత్తిని, వెంటిలేటర్ల లభ్యతను పెంచామని తెలిపారు. అత్యవసర ఔషధాల ఉత్పత్తిని భారీగా పెంచామని, కొత్తగా వైద్య వసతులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశామన్నారు. ఈ మహమ్మారి కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరాంతానికి సాధ్యమే ఈ సంవత్సరాంతానికి 18 ఏళ్లు పైబడినవారందరికీ టీకా ఇవ్వడం సాధ్యమనని సంబంధిత ఉన్నతాధికారులు తెలిపారు. అప్పటికి 187.2 కోట్ల టీకా డోసులు అందుబాటులోకి వస్తాయన్నారు. దేశంలో 18 ఏళ్లు పైబడినవారి సంఖ్య సుమారుగా 94 కోట్లు ఉంటుందన్నారు. జనవరి నుంచి జులై వరకు 53.6 కోట్ల డోసులు, ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు 133.6 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయన్నారు. నవంబర్ వరకు ఉచిత రేషన్ పేదలకు ఉచిత రేషన్ అందించే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని నవంబర్ వరకు పొడగిస్తున్నామని ప్రధాని వెల్లడించారు. ఇందులో భాగంగా దేశంలోని దాదాపు 80 కోట్ల మంది పేదలకు నెలవారీగా, ఒక్కో వ్యక్తికి 5 కేజీల చొప్పున ఆహారధాన్యాలు ఉచితంగా అందజేస్తారు. సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో మే, జూన్ నెలలకు ఈ పథకం కింద ఉచితంగా ఆహార ధాన్యాలను అందిస్తామని కేంద్రం ఏప్రిల్‌లో ప్రకటించింది. గత సంవత్సరం ఈ పథకాన్ని ఏప్రిల్ నుంచి 8 నెలల పాటు కొనసాగించామని ప్రధాని గుర్తు చేశారు. ‘ఈ సంవత్సరం కూడా మే, జూన్ నెలల్లో దీన్ని అమలు చేశాం. ఇప్పుడు ఈ పథకాన్ని దీపావళి వరకు పొడగించాలని నిర్ణయించాం. ఈ సంక్షోభ సమయంలో ప్రభుత్వం పేదలకు ఒక స్నేహితుడిగా అండగా ఉంటుంది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
కేంద్రం ఇవ్వకున్నా మేమిస్తాం: 23 రాష్ట్రాలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం 45 ఏళ్ల పైబడిన వారికి ఉచితంగా టీకా అందించగా ప్రస్తుతం 18-45 ఏళ్ల వారికి మే 1వ తేదీ నుంచి వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించింది. అయితే వారికి మాత్రం ఉచితమని చెప్పలేదు. దీంతో ఆ వయసు వారు బయట కొనుక్కుని వేసుకోవాల్సిన పరిస్థితి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా తాము ఉచితంగా టీకా అందిస్తామని దేశంలోని అన్ని రాష్ట్రాలు ముందుకువచ్చాయి. 18-45 ఏళ్ల వారికి ఉచితంగా టీకా అందిస్తామని ఏకంగా 23 రాష్ట్రాలు ప్రకటించాయి. ఇక తెలంగాణతో పాటు మరో రెండు, మూడు రాష్ట్రాలు వయసుతో నిమిత్తం లేకుండా ఉచితంగా టీకా అందిస్తామని ప్రకటించాయి. ఇప్పటివరకు 19.19 కోట్ల వ్యాక్సిన్‌ను 45 ఏళ్లు పైబడిన వారికి వినియోగించారు. మే 1వ తేదీ నుంచి 18 నుంచి 45 ఏళ్ల వయసు వారికి వ్యాక్సిన్‌కు కేంద్రం అనుమతి ఇచ్చింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాక్సినే దానికి విరుగుడుగా భావిస్తున్నారు. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను అన్ని రాష్ట్రాలు వేగవంతం చేశాయి. ఈ నేపథ్యంలో అందరికీ వ్యాక్సిన్ వేయించాలని సంకల్పించాయి. ప్రజలకు ఉచితంగా టీకా వేసేందుకు ముందుకు వచ్చాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు 23 రాష్ట్రాలు ఉచితంగా టీకా అందిస్తామని ముందుకు వచ్చాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం వయసు నిమిత్తం లేకుండా అన్ని వయసుల వారికి ఉచితంగా టీకా అందిస్తామని ప్రకటించింది. ఉచితంగా టీకా అందిస్తామని ప్రకటించిన రాష్ట్రాలు ఇవే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, అసోం, గోవా, ఒడిశా, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్. చదవండి: మాస్క్ లేదని చితక్కొట్టిన ఆర్టీసీ బస్ డ్రైవర్ చదవండి: ఎన్నికల సంఘం బీజేపీ గూటి చిలక -
అందరికీ ఉచితంగా టీకా: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వయసుతో సంబం ధం లేకుండా అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 4 కోట్ల మందికి దీంతో ప్రయోజనం చేకూరుతుందని.. ఇందుకు రూ.2,500 కోట్ల మేర వ్యయమవుతుందని అం చనా వేసింది. రాష్ట్ర జనాభాతోపాటు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు కూడా ఉచితంగా టీకా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రజల ప్రాణాల కంటే డబ్బులు ముఖ్యం కాదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం శనివారం ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 35 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేసినట్టు వివరిం చారు. అందరికీ వ్యాక్సినేషన్‌కు సంబంధించి తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. మొత్తం రాష్ట్రంలో ఉన్న అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్‌కు జిల్లాల వారీ ఇన్చార్జులు రాష్ట్రంలో భారత్ బయోటెక్ సంస్థ కరోనా వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తోందని, రెడ్డీస్ ల్యాబ్స్ సహా మరికొన్ని సంస్థలు కూడా త్వరలో టీకాలు ఉత్పత్తి చేయనున్నాయని సీఎంకేసీఆర్ అన్నారు. అందువల్ల వ్యాక్సినేషన్ విషయంలో ఎలాంటి ఇబ్బందీ ఉండబోదని స్పష్టం చేశారు. రెండు, మూడు రోజుల్లో తనకు అవసరమైన వైద్య పరీక్షలు జరిగి, పూర్తి స్వస్థత చేకూరగానే.. సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని తాను స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. వ్యాక్సినేషన్ పటిష్టంగా, విజ యవంతంగా అమలు కావడానికి వీలుగా జిల్లాల వారీగా ఇన్చార్జులను నియమిస్తామని చెప్పారు. ఆక్సిజన్, రెమిడెసివిర్ కొరత లేకుండా.. విస్తృత వ్యాక్సినేషన్‌తో పాటు, రెమిడెసివిర్ తదితర కరోనా సంబంధిత మందులకు, ఆక్సిజన్‌కు ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రజలు ఏ విధమైన భయభ్రాంతులకు గురికావొద్దని, కరోనా సోకిన వారికి పడకల విషయంలో, మందుల విషయంలో ప్రభుత్వం చేయాల్సినదంతా చేస్తోందని చెప్పారు. ప్రజలను కోవిడ్ బారి నుంచి కాపాడటానికి అన్ని రకాల చర్యలు ప్రభుత్వం తీసుకుంటోందని భరోసా ఇచ్చారు. ప్రజలు కూడా ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. పెద్ద ఎత్తున గుంపులుగా గుమిగూడవద్దని, ఊరేగింపులలో పాల్గొన వద్దని, అత్యవసరమైతే తప్ప బయట తిరగొద్దని, స్వయం క్రమశిక్షణ పాటించాలని ప్రజలకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. కరోనా మహమ్మారి విషయంలో తీసుకోవాల్సిన చర్యలన్నీ చేపడుతున్నామని కేసీఆర్ మరోమారు స్పష్టం చేశారు. -
రాష్ట్రాలకు రూ.400లకు డోసు
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు, పుణేకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సీఐఐ) తమ కరోనా వ్యాక్సిన్ ’కోవిషీల్డ్’బహిరంగ మార్కెట్ ధరలను బుధవారం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకైతే రూ.400 డోసు చొప్పున అందజేస్తామని, ప్రైవేటు ఆసుపత్రులకు ఒక డోసుకు రూ.600 వసూలు చేస్తామని వెల్లడించింది. భారత్‌లో జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా, కేంద్ర ప్రభుత్వం వైద్య సిబ్బందికి, ఫ్రంట్‌లైన్ వర్కర్స్కు, 45 ఏళ్ల పైబడిన వారందరికీ ఉచితంగా టీకాలు వేస్తున్న విషయం తెలిసిందే. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు, నిపుణుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకొని మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్‌కు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల కిందట నిర్ణయం తీసుకుంది. ఫార్మా కంపెనీలు ఉత్పత్తి చేసే టీకాల్లో 50 శాతం కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటిలాగే తక్కువ ధరకు అందిస్తూ... మిగతా 50 శాతం వ్యాక్సిన్లను బహిరంగ మార్కెట్లలో రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆసుపత్రులు, సంస్థలకు అమ్ముకోవడానికి వీలు కల్పించింది. అయితే ఫార్మా కంపెనీలు మే1 లోపే పారదర్శకంగా తమ బహిరంగ మార్కెట్ ధరలను ప్రకటించాలని కేంద్రం షరతు విధించింది. కేంద్ర అదేశాలకు అనుగుణంగా సీరమ్ కోవిషీల్డ్ ధరలను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 400 డోసు, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600 డోసు చొప్పున అందజేస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. ‘ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ల ధరలను దృష్టిలో పెట్టుకొని... వాటితో పోల్చితే తక్కువ ధర ఉండేలా, అందరికీ అందుబాటులో ఉండేలా కోవిషీల్డ్ ధరలను నిర్ణయించాం. అమెరికా వ్యాక్సిన్లు బహిరంగ మార్కెట్లో ఒక్క డోసుకు రూ.1,500 కంటే ఎక్కువగా, రష్యా, చైనా వ్యాక్సిన్లు ప్రతి డోసుకు రూ.750కి పైగా ఉన్నాయి. రాబోయే రెండు నెలల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా సరఫరాను పెంచుతాం. నాలుగైదు నెలల తర్వాత వ్యాక్సిన్ రిటైల్ మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది’అని సీరమ్ ఇన్స్టిట్యూట్ వివరించింది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటిలాగే 45 ఏళ్ల పైబడిన వారందరికీ ఉచితంగా టీకా కార్యక్రమాన్ని ఇకపై కూడా కొనసాగించనుంది. 18–45 ఏళ్ల లోపు వయసు వారికి టీకాలు వేసే విషయం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రైవేటు ఆసుపత్రుల్లో వేసుకోదలచుకున్న వారు నేరుగా వెళ్లి ఆసుపత్రి నిర్ధారించిన ఫీజు చెల్లించి వేసుకోవచ్చు. గతంలో 45 ఏళ్ల పైబడిన వారికి ప్రభుత్వం తరఫున టీకాలు సరఫరా అయ్యాయి కాబట్టి... ప్రైవేటులో వేసుకుంటే టీకాకు రూ. 150, సర్వీసు ఛార్జీ కింద రూ.100 వసూలు చేసుకోవడానికి అనుమతించారు. ఇప్పుడు సీరమ్ డోసును రూ.600లకు అమ్మనుంది. దీనిపై ప్రైవేటు ఆసుపత్రులు ఎంత అదనంగా వసూలు చేస్తాయనేది చూడాలి. కాంట్రాక్టు ముగిశాక కేంద్రానికీ అదే ధర కేంద్ర ప్రభుత్వానికి రూ.150 డోసు చొప్పున అందిస్తూ... రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం రూ.400 ధర నిర్ణయించడంపై విపక్షాలు మండిపడ్డాయి. ఇంత అధికధర వసూలు చేయడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించాయి. వైరస్ సమర్థత ఎంత ఉంటుందో ఇంకా పూర్తిగా తెలియకముందే, చాలాకాలం ముందే కేంద్ర ప్రభుత్వం గంపగుత్తగా తమకు 10 కోట్ల డోసులకు అర్డర్ ఇచ్చిందని, రిస్క్‌ను తాము కూడా పంచుకొనే దాంట్లో భాగంగానే రూ.150 డోసును కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి అంగీకరించామని సీరం సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. ఈ పది కోట్ల డోసుల సరఫరా పూర్తికాగానే కేంద్ర ప్రభుత్వానికి కూడా రూ.400 డోసు చొప్పునే ఇస్తామన్నారు. ప్రస్తుతం నెలకు 6–7 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తున్నామని, జులై కల్లా దీన్ని 10 కోట్ల డోసులకు పెంచుతామన్నారు. -
ఉచితంగా కోవిడ్ టీకా
పట్నా: బిహార్‌లో ప్రజలకు ఉచితంగా కోవిడ్–19 వ్యాక్సిన్‌ను అందిస్తామని భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఐసీఎంఆర్ ఆమోదం లభించగానే కోవిడ్–19 వ్యాక్సిన్‌ను ఒకసారి ఉచితంగా అందిస్తామన్నారు. ‘‘కరోనాపై పోరాటంలో బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచింది. కరోనా టీకా ఉచితంగా పంపిణీ చేసే బాధ్యత బీజేపీ తీసుకుంటుంది. ఐసీఎంఆర్ వ్యాక్సిన్‌కి అనుమతినివ్వగానే ప్రజలకు ఉచితంగా అందిస్తాం’’అని నిర్మలా సీతారామన్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా చెప్పారు. భారత్‌లో మూడు టీకాలు వివిధ దశల్లో ప్రయోగాల్లో ఉన్నాయని, అవి విజయవంతమైతే భారీగా టీకా డోసుల్ని ఉత్పత్తి చేయడానికి భారత్ సన్నద్ధంగా ఉందని అన్నారు. వ్యాక్సినేషన్‌కు అనుమతిరాగానే బిహార్ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. యువతకు 19 లక్షల ఉద్యోగాలు బీజేపీతోనే భరోసా అన్న ట్యాగ్‌లైన్‌తో రూపొందించిన ఎన్నికల హామీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకున్న ఇమేజ్ను పూర్తిగా వాడుకునే ప్రయత్నం చేశారు. వచ్చే అయిదేళ్లలో యువతకి 19 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, పప్పు ధాన్యాలకు కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విపక్షాల దాడి కరోనా మహమ్మారిని అధికార పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ అంశంలో ఎన్నికల సంఘం పార్టీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకోవడానికి తమ రాష్ట్రానికి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూడాలా అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఆర్జేడీ, కాంగ్రెస్, శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ తదితర పార్టీలన్నీ కోవిడ్ వ్యాధిని అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. -
30వరకూ కోళ్లకు ఉచితంగా టీకాలు
అనంతపురం అగ్రికల్చర్ : పెరటికోళ్లకు కొక్కెర, బొబ్బతెగుళ్ల నివారణకు శుక్రవారం నుంచి ఉచితంగా టీకాలు కార్యక్రమం ప్రారంభమైందని పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ వి.రవీంద్రనాథఠాగూర్, పశువ్యాధి నిర్ధారణ కేంద్రం ఏడీ డాక్టర్ ఎన్.రామచంద్ర శుక్రవారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఈనెల 30వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. గడువులోగా 6 లక్షల పెరటికోళ్లకు టీకాలు వేయడంతో పాటు డీవార్మింగ్ మందులు కూడా తాపుతామన్నారు.ఈ అవకాశాన్ని గ్రామీణులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.