హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా హోల్‌సేల్‌లో ప్యాసింజర్ వాహన విక్రయాలు 2023లో 40 లక్షల యూనిట్ల మైలురాయిని దాటి సరికొత్త రికార్డు నమోదైంది. తయారీ కంపెనీల నుంచి గతేడాది డీలర్లకు 41,01,600 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు చేరాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) శుక్రవారం తెలిపింది. యుటిలిటీ వెహికిల్స్‌కు పెద్ద ఎత్తున డిమాండ్ ఇందుకు కారణమని వెల్లడించింది.
‘హోల్‌సేల్‌లో 2022లో జరిగిన ప్యాసింజర్ వాహన అమ్మకాలతో పోలిస్తే గతేడాది నమోదైన విక్రయాలు 8 శాతం అధికం అయ్యాయి. యుటిలిటీ వాహనాల అమ్మకాలు 22.4 శాతం వృద్ధి చెంది గత ఏడాది 23,53,605 యూనిట్లకు పెరిగాయి. వ్యాన్స్ 1,32,468 నుంచి 1,46,122 యూనిట్లకు ఎగశాయి. ప్యాసింజర్ కార్స్ 8 శాతం క్షీణించి 16,01,873 యూనిట్లకు పడిపోయాయి. అక్టోబర్–డిసెంబర్‌లో డీలర్లకు చేరిన ప్యాసింజర్ వాహనాలు అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8 శాతం అధికమై 10,12,285 యూనిట్లను తాకాయి’ అని సియామ్ వివరించింది.
ఇతర విభాగాల్లో ఇలా..
గతేడాది తయారీ కంపెనీల నుంచి డీలర్లకు చేరిన ద్విచక్ర వాహనాల సంఖ్య 9 శాతం పెరిగి 1,70,75,160 యూనిట్లుగా ఉంది. వాణిజ్య వాహనాలు 9.33 లక్షల నుంచి 9.78 లక్షల యూనిట్లకు చేరాయి. త్రిచక్ర వాహనాలు 4,18,510 నుంచి 6,80,550 యూనిట్లకు ఎగశాయి. అన్ని విభాగాల్లో కలిపి హోల్‌సేల్‌లో వాహన విక్రయాలు గతేడాది 10 శాతం వృద్ధితో 2,28,36,604 యూనిట్లకు పెరిగాయి. 2022లో ఈ సంఖ్య 2,07,92,824 యూనిట్లుగా ఉంది. ఆటోమొబైల్ రంగానికి 2023 సహేతుకంగా సంతృప్తికరంగా ఉందని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. ప్యాసింజర్, వాణిజ్య, ద్విచక్ర వాహనాలు సింగిల్ డిజిట్ వృద్ధిని నమోదు చేశాయి. త్రిచక్ర వాహనాలు చాలా మంచి రికవరీని సాధించాయని ఆయన పేర్కొన్నారు. ప్యాసింజర్ వాహన విభాగంలోని మొత్తం అమ్మకాలలో యుటిలిటీ వాహనాల వాటా ఏకంగా 62 శాతానికి చేరిందని వివరించారు. 2024లో సైతం వృద్ధి జోరు కొనసాగుతుందని ఆటో పరిశ్రమ ఆశాజనకంగా ఉందన్నారు.
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో..:
న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ భారత్ మండపంలో ఫిబ్రవరి 1–3 తేదీల్లో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో జరుగనుంది. రెండేళ్లకోసారి జరిగే ఆటో ఎక్స్‌పో కంటే ఈ ప్రదర్శన విస్తృత స్థాయిలో ఉంటుందని వినోద్ అగర్వాల్ చెప్పారు. ఆటోమొబైల్‌తో ముడిపడి ఉన్న అన్ని విభాగాల కంపెనీల భాగస్వామ్యంతో ఇది మరింత విస్తృత ఈవెంట్‌గా మారనుందని ఆయన అన్నారు. వాహన తయారీ సంస్థలతోపాటు ఈ ప్రదర్శనలో టైర్లు, స్టీల్, బ్యాటరీ, ఇతర విభాగాల కంపెనీలు సైతం పాల్గొంటాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 600 మందికిపైగా ఎగ్జిబిటర్లు పాలుపంచుకుంటారని వివరించారు.
ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాల్లో సరికొత్త రికార్డ్‌లు
Published Sat, Jan 13 2024 8:40 AM | Last Updated on Sat, Jan 13 2024 9:13 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment