
సాక్షి, న్యూఢిల్లీ : రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై ఆగస్ట్ 15న సుప్రీం కోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది. కోర్టు ఏర్పాటు చేసిన మధ్యవర్తుల కమిటీ నివేదిక ఇచ్చేందుకు మరికొంత సమయం కోరడంతో తదుపరి విచారణను వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. మధ్యవర్తిత్వ కమిటీ నుంచి ఇప్పటివరకూ మే 7న మధ్యంతర నివేదికను కోర్టుకు సమర్పించిందని, పూర్తి నివేదిక కోసం మరికొంత సమయం అవసరమని కోరిందని కోర్టు పేర్కొంది.
కాగా అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఫకీర్ మహ్మద్ ఇబ్రహీం కలీఫుల్లా నేతృత్వంలో ఆథ్యాత్మికవేత్త శ్రీశీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచు సభ్యులుగా సర్వోన్నత న్యాయస్ధానం మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేసి ఎనిమిది వారాల్లోగా నివేదిక సమర్పించాలని కోరిన సంగతి తెలిసిందే. మధ్యవర్తిత్వ కార్యకలాపాలను కెమెరాలో రికార్డు చేయాలని, ఈ వివాదంలో వివిధ పార్టీలు ఈ ఎనిమిది వారాల డెడ్‌లైన్‌ను ఉపయోగించుకుని విచారణకు సన్నద్ధం కావాలని కోర్టు కోరింది.
రామజన్మభూమి-బాబ్రీమసీదు స్ధలంలో వివాదాస్పదమైన 2.77 ఎకరాలను నిర్మోహి అఖారా, సున్ని సెంట్రల్ వక్ఫ్ బోర్డు (యూపీ), రామ్‌లల్లా విరాజ్‌మన్‌ల మధ్య పంచాలని అలహాబాద్ హైకోర్టు 2010లో జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లతో పాటు అయోధ్యలో సేకరించిన వివాదాస్పదం కాని 67.703 ఎకరాల మిగులు భూమిని వాటి యజమానులకు తిరిగి అప్పగించేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా ఈ దిశగా సుప్రీం కోర్టులో కేంద్రం అప్పీల్‌ను నిర్మోహి అఖారా వ్యతిరేకిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment