
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును ద్వారక పీఠాధిపతి శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పు తనకు చాలా సంతోషాన్ని కలిగించిందనీ, రాముడు ఉత్తరప్రదేశ్‌లోని నగరంలోనే జన్మించాడనేది నిరూపితమైందని వ్యాఖ్యానించారు. శ్రీరాముడు అయోధ్యలోనే జన్మించాడనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు.
రామమందిరాన్ని నిర్మించడానికి ట్రస్ట్ ఏర్పాటు చేయాలన్న సుప్రీం ఆదేశంపై స‍్వరూపానంద స్పందిస్తూ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఇప్పటికే ఉందని వ్యాఖ్యానించారు. అయితే, అయోధ్యలో అనేక దేవాలయాలున్నాయని సున్నీ వక్ఫ్ బోర్డుకు అయిదు ఎకరాల భూమిని కేటాయించాలన్న సుప్రీం ఆదేశాలపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. అంతేకాదు ప్రతిపాదిత రామమందిరం డిజైన్ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా, ప్రపంచ చారిత్రక కట్టడాలలో ఒకటిగా వెలుగొందుతున్న కంబోడియాలోని "అంగ్‌కోర్ వాట్ దేవాలయం" అంత ఘనంగా, అంత విశాలంగా ఉండాలని స్వరూపానంద సరస్వతి అభిలషించారు.
Comments
Please login to add a commentAdd a comment