న్యూఢిల్లీ: అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసే విషయమై పునర్ ఆలోచించాలని బాలీవుడ్ నటులు షబానా అజ్మీ, నసీరుద్దీన్ షాతో పాటు దేశంలోని వందకు పైగా ముస్లిం ప్రముఖులు కోరారు. అయోధ్య వివాదాన్ని సజీవంగా ఉంచితే ముస్లిం కమ్యూనిటీకి హాని కలుగుతుందని అభిప్రాయపడుతూ మంగళవారం వారు ఒక ప్రకటనను విడుదల చేశారు. రివ్యూ పిటిషన్ దాఖలు విషయమై మరోసారి ఆలోచించాలంటూ సంతకాల సేకరణ చేపట్టారు. ఇందులో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన లాయర్లు, పత్రికా విలేకరులు, సామాజిక కార్యకర్తలు, నటులు, వ్యాపారవేత్తలు, సంగీతకారులతో పాటు విద్యార్థులు ఉన్నారు. అయోధ్య వివాదాన్ని సజీవంగా ఉంచడం ద్వారా భారత ముస్లిం సామాజిక వర్గానికి హాని కలుగుతుందని తాము గట్టిగా నమ్ముతున్నామని లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ప్రకటనపై సంతకం చేసిన వారిలో సినీ రచయిత అంజుమ్ రాజ్‌బలి, జర్నలిస్ట్ జావేద్ ఆనంద్ సహా పలువురు ప్రముఖులు ఉన్నారు.
కాగా అయోధ్యలోని వివాదాస్పద భూమి (2.77) ఎకరాలు హిందువులకే చెందుతుందని సుప్రీం సంచలన తీర్పు వెలువరించింది. ప్రత్యామ్నాయంగా మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే సున్నీవక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలం ఇవ్వాలని ఆదేశించిన సంగతి విధితమే. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎంపీఎల్‌బీ) నవంబర్ 17న ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment