సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి సంబంధించి ముగ్గురు సభ్యులతో కూడిన మధ్యవర్తుల ప్యానెల్ పరిష్కార అన్వేషణలో విఫలమైందని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. ఈనెల 6 నుంచి ఈ కేసుపై రోజువారీ విచారణ చేపడతామని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. వాదనలు ముగిసే వరకూ కేసును రోజువారీ విచారిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలో జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ అబ్ధుల్ నజీర్‌లతో కూడిన బెంచ్ పేర్కొంది. తొలి విచారణ తేదీ నుంచి వంద రోజుల అనంతరం నవంబర్ 17న కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
విచారణ ప్రారంభమయ్యే సమయానికి పార్టీలు తమ వాదనలు, ఆధారాలతో కూడిన నకళ్లను రిజిస్ర్టీకి సమర్పించాలని కోర్టు కోరింది. అయోధ్య వివాద పరిష్కారం దిశగా మాజీ సుప్రీం కోర్టు జడ్జి ఎఫ్‌ఎం కలీఫుల్లా నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన మధ్యవర్తిత్వ కమిటీని సుప్రీం కోర్టు మార్చి 8న నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలో ఆధ్యాత్మిక వేత్త శ్రీశ్రీ రవిశంకర్, శ్రీరాం పంచు ఇతర సభ్యులుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment