2019 నవంబర్ 9న ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం లభించింది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును దేశమంతా స్వాగతించింది. అయోధ్య వివాదం పూర్వాపరాలపై సమగ్ర కథనమిది.
అయోధ్యలో 1528లో మొఘల్ సామ్రాజ్య సైనికాధికారి మిర్ బాకీ తాష్కేండీ బాబ్రీ మసీదును నిర్మించాడు. హిందువుల పవిత్రంగా భావించే ప్రాంతాన్ని ఆక్రమించుకుని ఈ మసీదును నిర్మించారనేది వివాదం. 1853–55లో ఈ కట్టడం విషయంలో తొలిసారి ఘర్షణలు చెలరేగడంతో అప్పట్లోనే మసీదు బయటి ప్రాంగణంలో హిందువులు పూజలు చేసుకునేందుకు, లోపలి భాగంలో ముస్లింల ప్రార్థనలకు వీలు కల్పిస్తూ ఓ గోడ నిర్మించారు.
తొలి కేసు 1885లో...
బాబ్రీ మసీదు ప్రాంగణంలోని ఛబుత్రా జన్మస్థాన్‌లో దేవాలయ నిర్మాణానికి అనుమతివ్వాలంటూ, జన్మస్థాన్‌కు మహంత్‌గా ప్రకటించుకున్న రఘుబర్ దాస్ ఫైజాబాద్ సబ్ జడ్జి కోర్టులో సివిల్ కేసు వేశారు. అయోధ్య న్యాయపోరాటానికి అదే ఆద్యం. స్టేట్ ఆఫ్ ఇండియా కార్యదర్శిని ప్రతివాదిగా చేరుస్తూ దాఖలైన ఈ కేసులో... ఆలయ నిర్మాణాన్ని మసీదు సంరక్షకుడు అడ్డుకోకుండా ఆదేశాలివ్వాలని రఘుబర్ దాస్ కోరారు.
1885 డిసెంబర్ 24న ఫైజాబాద్ సబ్ జడ్జీ కోర్టు న్యాయమూర్తి పండిట్ హరికిషన్ సింగ్ ఈ కేసు కొట్టివేస్తూ... ఆలయ నిర్మాణానికి అనుమతిస్తే ఏదో ఒక రోజు క్రిమినల్ కేసులు దాఖలు కావడంతోపాటు వేల మంది హత్యకు గురయ్యే అవకాశముందని వ్యాఖ్యానించారు. ఆ తీర్పును సవాలు చేస్తూ రఘుబర్‌దాస్ జిల్లా కోర్టును ఆశ్రయించగా న్యాయమూర్తి కల్నల్ ఎఫ్.ఇ.ఎ.ఛామెయిర్ కేసు కొట్టేశారు.
హిందువుల పవిత్ర స్థలంపై ఓ మసీదు నిర్మించడం దురదృష్టకరమని, ఈ ఘటన ఎప్పుడో 356 ఏళ్ల క్రితం జరిగింది కాబట్టి అప్పుడు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే సమయం మించిపోయిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. యథాతథ స్థితిని కొనసాగించాలని మాత్రమే ఇప్పుడు చెప్పగలమని స్పష్టం చేశారు. రఘుబర్ దాస్ దీన్ని అప్పటి ప్రావిన్స్ ప్రధాన కేంద్రమైన అవధ్ న్యాయస్థానంలోనూ సవాలు చేసినా ఫలితం లేకపోయింది.
విభజనతో రాజుకున్న వివాదం...
దేశ విభజనతో అయోధ్య వివాదం మరోసారి రాజుకుంది. 1949 డిసెంబర్ 22 రాత్రి బాబ్రీ మసీదులోని ప్రధాన గుమ్మటం లోపల రాముడి విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి. అఖిల భారతీయ రామాయణ్ మహాసభ తొమ్మిది రోజులపాటు అఖండ రామాయణ కీర్తన (రామచరిత మానస్ పఠనం) జరిపాక ఈ అద్భుతం చోటు చేసుకుందని, మసీదు లోపల రాముడి విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయని చెబుతారు. కొందరు వీటిని రహస్యంగా లోపలపెట్టారని కూడా చెబుతారు.
ఆ రోజు శుక్రవారం కావడంతో మసీదులో ప్రార్థనల కోసం భారీ సంఖ్యలో ముస్లింలు చేరడం యాదృచ్ఛికం. దీనిపై అయోధ్య అడిషనల్ సిటీ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ మొదలైంది. విగ్రహాలున్న కట్టడానికి తాళం వేయాలని జస్టిస్ మార్కండేయ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో మసీదులోకి ప్రవేశించే హక్కును ముస్లింలు కోల్పోగా, పూజలు చేసుకునే అవకాశం హిందువులకు దక్కింది. కోర్టు నియమించిన నలుగురు పూజారుల ద్వారా పక్క గేటు నుంచి విగ్రహాలను సందర్శించేందుకు వీలు ఏర్పడింది.
1950లో సివిల్ వ్యాజ్యం...
రాముడి విగ్రహాలను తొలగించకుండా అయోధ్యకు చెందిన ఐదుగురు ముస్లిం అధికారులను నిరోధించాలని, దర్శనానికి తనకు హక్కు ఉన్నట్లుగా ప్రకటించాలని గోపాల్ సింగ్ విశారద్ 1950లో సివిల్ వ్యాజ్యం వేయడంతో వివాదం మలుపు తిగింది. విచారణ జరిపిన న్యాయమూర్తి ఎన్.ఎన్.ఛద్దా ఇందుకు అనుమతించారు. పైకోర్టులూ ఈ తీర్పును సమర్థించాయి. 1955లో రాష్ట్ర హైకోర్టు కూడా కింది కోర్టుల తీర్పులను బలపరిచింది. ఈ దశలోనే నిర్మోహీ అఖాడా మసీదు ప్రాంతాన్ని తమకివ్వాలని కేసు వేయగా, 1961 డిసెంబరులో సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు స్థల యాజమాన్య హక్కులపై తొలి సివిల్ కేసు వేసింది. వీటిపై అలహాబాద్ హైకోర్టు విచారణ చేపట్టింది.
బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ ఏర్పాటు...
1950–51లో విగ్రçహాల పూజలపై ఆంక్షల్ని సడలించాలని స్థానిక న్యాయవాది ఒకరు 1986లో ఫైజాబాద్ మున్సిఫ్ కోర్టులో తాజా కేసు వేయడం బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ ఏర్పాటుకు కారణమైంది. మున్సిఫ్ కోర్టు ఈ కేసును కొట్టేయటంతో అప్పీల్ చేశారు. ఫైజాబాద్ జిల్లా జడ్జి కె.ఎం.పాండే తీర్పునిస్తూ తాళాలు, గేట్లు తొలగించడం వల్ల నష్టమేమీ లేదన్నారు. ఈ తీర్పు వెలువడిన గంట లోపే జిల్లా యంత్రాంగం తాళాలు తొలగించడం అవతలి వర్గాల్లో అనుమానాలు రేకెత్తించింది.
మూడు భాగాలుగా విభజన...
1994లో మసీదు ప్రాంతాన్ని కేంద్రం స్వాధీనం చేసుకునేందుకు వీలు ఏర్పడింది. మసీదు కూల్చివేత నేపథ్యంలో ఆ స్థలాన్ని కేంద్రం ప్రత్యేక చట్టం ద్వారా స్వాధీనం చేసుకోవడం సబబేనని, సెక్యులరిజం భావనకిది వ్యతిరేకం కాదని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో 2002 ఏప్రిల్లో అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమికి యజమాని ఎవరనేది తేల్చేందుకు అలహాబాద్ హైకోర్టు విచారణ ప్రారంభించింది. జస్టిస్ ఖాన్, జస్టిస్ సుధీర్ అగర్వాల్, జస్టిస్ ధరమ్‌వీర్ శర్మలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డు, రామ్ లల్లా, నిర్మోహీ అఖాడాలకు మూడు సమాన భాగాలుగా చేస్తూ 2010లో తీర్పునిచ్చింది. అయితే హైకోర్టు తీర్పును మూడు వర్గాలు çసుప్రీం కోర్టులో సవాలు చేశాయి. ఈ ముగ్గురితోపాటు మరో 11 మంది వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కలిపి విచారించి తాజా తీర్పు వెలువరించింది.
ప్రభుత్వంలో మార్పు..
రథయాత్ర మొదలైన కొద్ది నెలలకు యూపీలో, కేంద్రంలో ప్రభుత్వాలు మారాయి. యూపీలో బీజేపీ అధికారం చేపట్టగా, కేంద్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైంది. పర్యాటకాభివృద్ధి పేరుతో యూపీ ప్రభుత్వం వివాదాస్పద కట్టడం సమీపంలోని అనేక నిర్మాణాల్ని కూల్చేసింది. 1992 డిసెంబర్ 6న గంటల వ్యవధిలోనే కరసేవకుల చేతిలో బాబ్రీ మసీదు ధ్వంసమైంది. దీంతో యూపీ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 8న పారా మిలటరీ బలగాలు వివాదాస్పద స్థలాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. రాముడి విగ్రహాలకు పూజలు నిలిచిపోయాయి. కానీ.. ఆ రోజు సాయంత్రం పూజలు మళ్లీ మొదలయ్యాయి. అప్పటి నుంచి పూజలు కొనసాగుతున్నా భక్తులకు దర్శనాలు మాత్రం లేకుండా పోయాయి.
Comments
Please login to add a commentAdd a comment