
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పదమైన బాబ్రీ మసీదు-రామజన్మభూమి కేసులో కక్షిదారులు రెండువారాల్లోగా తమ వద్ద ఉన్న ప్రతాల ఆంగ్ల అనువాదాన్ని తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. బాబ్రీ మసీదు-రామజన్మభూమి వివాదం కేసులో అప్పీళ్లపై మార్చి 14వ తేదీ నుంచి వాదనలు విననున్నట్టు తెలిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్ లతో కూడిన ధర్మాసనం గురువారం ఈమేరకు వ్యాఖ్యలు చేసింది. రామజన్మభూమి కేసులో రోజువారీ వాదనలు వినే ఉద్దేశంకు తమకు ఎప్పుడూ లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
బాబ్రీ మసీదు-రామజన్మభూమి కేసును తాము పూర్తిగా ‘భూవివాదం’ (ప్యూర్ లాండ్ డిస్‌ప్యూట్)గా పరిగణిస్తామని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు ముందుకురాని అభ్యర్థనలు ఇప్పట్లో తాము వినబోమని, తాజాగా ఇంప్లీడ్ అయిన పార్టీల వాదనలు తర్వాత వింటామని న్యాయస్థానం సంకేతాలు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి స్థానిక భాషల్లో ఉన్న పుస్తకాల్లోని అంశాలను ఆంగ్లంలోకి అనువదించి.. రెండు వారాల్లో తమకు అందజేయాలని ధర్మాసనం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment