
అయోధ్యపై సయోధ్య సాధించే వరకూ..
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య వివాద పరిష్కారంలో మధ్యవర్తిత్వ కమిటీ విఫలమవడంతో అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం నుంచి విచారణ చేపట్టనుంది. ఈ ఏడాది ఆరంభంలో మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేసిన సర్వోన్నత న్యాయస్ధానం వివిధ వర్గాలతో సంప్రదింపుల ద్వారా సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరింది.
సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఎఫ్‌ఎం కలీఫుల్లా, ఆథ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచుతో కూడిన త్రిసభ్య ప్యానెల్ ఈ ఏడాది నుంచి సంప్రదింపుల ప్రక్రియ చేపట్టింది. పలుమార్లు జరిగిన చర్చల అనంతరం కొన్ని పార్టీలు మధ్యవర్తిత్వానికి అంగీకరించడం లేదని కమిటీ సుప్రీంకు తేల్చిచెప్పడంతో రోజువారీ విచారణను చేపట్టాలని సర్వోన్నత న్యాయస్ధానం నిర్ణయించింది.
చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్‌లతో కూడిన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య వివాదాన్ని కొలిక్కితెచ్చే వరకూ పూర్తిస్ధాయిలో విచారణ చేపట్టాలని నిర్ణయించింది. మరోవైపు ఈ ఏడాది నవంబర్‌లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ పదవీవిరమణ చేయనున్న నేపథ్యంలో ఆ లోగా కేసును కొలిక్కితీసుకువస్తారని భావిస్తున్నారు.