ఫైజాబాద్(యూపీ): రామజన్మభూమి–బాబ్రీ మసీదు సమస్యను పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు నియమించిన మధ్యవర్తిత్వ కమిటీ సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో ఉన్న అవధ్ వర్సిటీలో కమిటీ బుధవారం నిర్వహించిన భేటీకి 25 మంది పిటిషనర్లు తమ న్యాయవాదులతో కలిసి హాజరయ్యారు. కమిటీలో సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఎఫ్.ఎం. ఖలీఫుల్లా, న్యాయవాది శ్రీరామ్ పంచు, ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ సభ్యులుగా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ సమావేశానికి రామజన్మభూమి పునరుద్ధరణ్ సమితికి చెందిన స్వామి అవిముక్తేశ్వరానంద్, మహంత్ దినేంద్రదాస్ (నిర్మోహీ అఖారా), త్రిలోకీనాథ్ పాండే(రామ్‌లల్లా విరాజ్‌మాన్), స్వామి చక్రపాణి, కమలేశ్ తివారీ (హిందూ మహాసభ)తో పాటు ఇక్బాల్ అన్సారీ, మొహమ్మద్ ఉమర్, హాజీ మహబూబ్, మౌలానా అష్‌హద్ రషీదీ జమాత్ ఉలేమా ఏ హింద్), వసీమ్ రిజర్వీ (ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు) తదితరులు హాజరయ్యారు. కాగా, మధ్యవర్తిత్వ కమిటీతో చర్చలు సహృద్భావ వాతావరణంలో సాగాయని స్వామి అవిముక్తేశ్వరానంద్ తెలిపారు. ఈ మధ్యవర్తిత్వ కమిటీ మూడు రోజుల పాటు పిటిషనర్లతో చర్చలు జరుపుతుంది.
Comments
Please login to add a commentAdd a comment