
సాక్షి, న్యూఢిల్లీ : ఓ మహిళ 28 సంవత్సరాలుగా చేస్తున్న నిరాహార దీక్షకు ముగింపు లభించనుంది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన ఊర్మిళ చతుర్వేది అనే 81 సంవత్సరాల మహిళ అయోధ్యలో డిసెంబర్ 6, 1992లో వివాదాస్పద కట్టడం నేలమట్టమైనప్పటి నుంచి ఉపవాస దీక్షకు పూనుకున్నారు. అయోధ్యలో రాముడికి మళ్లీ గుడి కట్టిన అనంతరం మాత్రమే ఆహారం స్వీకరించాలని నిర్ణయించుకున్నారు.వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన రోజు ఆమె ఎంతో ఆనందించారు. అమె కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు ఎంతగా వేడుకున్నా ఆమె తన ఉపవాస దీక్షను మాత్రం విరమించలేదు. తాను అయోధ్యకు వెళ్లి ఆ శ్రీరాముని మందిరాన్ని దర్శించడం తనకు పునర్జన్మ వంటిదని ఆమె అన్నారు. భూమిపూజ అనంతరం అయోధ్యకు వెళ్లి, సరయూ నదిలో పవిత్ర స్నానం చేసిన తర్వాత మాత్రమే ఉపవాస దీక్ష విరమిస్తానని ఊర్మిళ స్పష్టంచేశారు.
ఈ విషయంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ‘‘శ్రీరాముడు తన భక్తులను ఎప్పటికీ నిరాశ పరచడు. త్రేతాయుగం నాటి శబరి అయినా ఈ యుగం నాటి ఊర్మిళమ్మ (ఊర్మిళ చతుర్వేది) అయినా! అమ్మా, మీ భక్తికి ప్రణమిల్లుతున్నాను. పూర్తి భారతదేశం మీకు వందనాలు అర్పిస్తోంది! జై శ్రీరాం!’’ అని ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment